వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!
ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్డౌన్ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!