‘కష్టంలో నుంచే కసి పుడుతుందం’టారు. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ విషయంలో ఇది అక్షర సత్యం. తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తండ్రి కడుపున పుట్టిన ఆమె చిన్నతనం నుంచి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. క్రీడలోకి వచ్చే క్రమంలో బంధువుల నుంచి ఎన్నో అవమానాలు భరించింది. ఇలా జీవితం ఆమెకు విసిరిన సవాళ్లను సోపానాలుగా మలచుకొని ఒక్కో మెట్టూ ఎక్కింది. ‘నువ్వెప్పటికీ హాకీ ప్లేయర్ కాలేవు’ అని అవమానించిన వారికి జాతీయ మహిళల జట్టుకే కెప్టెన్ అయి చూపించింది. ఉండడానికి ఇల్లే లేని తన తల్లిదండ్రులకు రెండంతస్తుల ఇంటిని బహుమతిగా అందించింది. మొత్తానికి ఇప్పటివరకు 241 అంతర్జాతీయ మ్యాచుల్లో 134 గోల్స్ సాధించి, కెప్టెన్‌గా జట్టును టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించేలా చేసింది. మరి, ఇన్ని పేరు ప్రఖ్యాతులు, విజయాలు తనను వరించాయంటే తనెంత కష్టపడిందో మనం ఊహించగలం. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం తాజాగా తాను దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’కు ఎంపికవడంతో దక్కినట్లయింది. ఈ ఆనంద సమయంలో కళ్లు చెమర్చుతూ రాణి నెమరువేసుకున్న గత జ్ఞాపకాలేంటో తెలుసుకుందాం..
అదింకా నెరవేరలేదు!
నిజం చెప్పనా.. ఒక మహిళా హాకీ ప్లేయర్‌గా నాకు ఖేల్ రత్న వస్తుందని కనీసం ఊహించనైనా లేదు నేను! ఎప్పుడైతే ఈ అవార్డు గురించి ప్రకటించారో అప్పుడు నేనెంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ క్షణం నా కన్నీళ్లను ఆపుకోలేకపోయా. వెంటనే ఈ శుభవార్తను పంచుకుందామని నాన్నకు ఫోన్ చేశా. ఫోన్లో కూడా ఏడుస్తూనే ఉన్నా. దాంతో నాకేమైందోనని వాళ్లు కంగారు పడిపోయారు. నిజానికి ఈ అవార్డు ప్రాముఖ్యమేంటో కూడా వాళ్లకు తెలియదు. అందుకే ఈ విషయం గురించి మరింత వివరంగా చెప్పేసరికి.. నాన్న కూడా ఎమోషనల్ అయ్యారు.. చాలా సంతోషించారు! ఇన్నేళ్ల నా కృషి, పట్టుదల, త్యాగం, కఠోర శ్రమకు గుర్తింపుగానే ఈ అవార్డు నాకొచ్చిందనుకుంటున్నా. అయినా సంతృప్తి పడను. ఎందుకంటే నా జీవిత లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడం! వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల కోసమే ప్రస్తుతం కఠోర సాధన చేస్తున్నా. ఇప్పుడు ఖేల్‌రత్నతో పాటు గతంలో అర్జున, భీమ్ అవార్డు (హరియాణా ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం).. వంటి పురస్కారాలెన్నో అందుకున్నా.. ఒలింపిక్స్ కల ఇంకా నెరవేరాల్సి ఉంది.
అమ్మాయిననే వివక్ష చూపించారు!
అయితే చాలామందికి నేను మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గానే తెలుసు.. కానీ చిన్నతనం నుంచి నేనెన్నో కష్టాలను ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఒక అమ్మాయిగా నన్ను చిన్నచూపు చూసే వారి మధ్యే పెరిగా. హరియాణాలోని షాహాబాద్ మా ఊరు. నాన్న తోపుడు బండి లాగేవారు. నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండే వారు. నాకు హాకీ అంటే చిన్నప్పటి నుంచే మక్కువ ఉండేది. ఆ ఇష్టంతోనే హాకీ ఆడతానంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. కారణం.. నేనొక అమ్మాయినని! అయినా రోజూ వాళ్ల ముందు ఏడ్చేదాన్ని. నా పేరెంట్స్ నిరక్షరాస్యులు కావడంతో నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. దీనికి తోడు ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు ‘అమ్మాయిని ఆటలకు పంపించి మీకు మీరు చెడ్డపేరు తెచ్చుకుంటారా? మైదానంలో పొట్టిపొట్టి బట్టలేసుకుంటే మీకు తలవంపులు కాదా?’ అంటూ వాళ్లను మరింత రెచ్చగొట్టేవారు.
ఆ అవమానాలే నాకు వరమయ్యాయి!
అయినా అమ్మానాన్నల్ని ఎలాగోలా ఒప్పించి 13 ఏళ్ల వయసులో జూనియర్ నేషనల్ క్యాంప్‌లో చేరాను. అక్కడా నాకు అవమానాలు తప్పలేదు. కారణం.. నాకు సరైన తిండి లేక తక్కువ బరువుండడమే! ఆ సమయంలో నేను కేవలం 36 కిలోలున్నా. దీంతో కోచ్ నన్ను అందరి ముందు నిలబెట్టి నువ్వెప్పుడూ దేశం తరఫున ఆడలేవు.. అంటూ తక్కువ చేసి మాట్లాడారు. ఆ క్యాంప్ నుంచి నన్ను బయటికి పంపించారు. అయితే అందుకు అప్పుడు బాధపడినా.. అదే నాకు వరమైందని ఆ తర్వాత తెలుసుకున్నా. క్యాంప్ నుంచి బయటికొచ్చేసిన నేను షాహాబాద్ హాకీ అకాడమీలో చేరాను. అక్కడ నాకు బల్దేవ్ సర్ (ద్రోణాచార్య అవార్డు గ్రహీత) అండగా నిలిచారు. ఆయన శిక్షణకు నా పట్టుదల కూడా తోడవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే నాకు రాలేదు. జాతీయ జట్టులోనే కాదు.. ఆసియా-ఎలెవన్, వరల్డ్-ఎలెవన్ జట్లలోనూ స్థానం సంపాదించా. ప్రస్తుతం మన దేశ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా!
అవమానించిన వారే గర్వపడుతుంటే..!
ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన నన్ను చూసి అమ్మానాన్నల ఆనందం పదింతలైంది. జీవితంలో మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మనల్ని అందలమెక్కిస్తుందని వాళ్లు అప్పుడప్పుడూ నాతో అంటూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న పడ్డ కష్టాలు చూశాను. నా కోసం ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు అనే మాటలు వారు భరించడం నన్ను చాలా బాధపెట్టింది. అందుకే అమ్మానాన్నలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలనే మూడేళ్ల క్రితం వారికి రెండంతస్తుల ఇంటిని బహుమతిగా అందించాను. ఇలా నా ఎదుగుదల, నాకొచ్చిన పేరుప్రఖ్యాతులు చూసి ఒకప్పుడు నన్ను అవమానించిన వారే ఇప్పుడు ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ మురిసిపోతున్నారు. అసలు వాళ్లు అలా అంటుంటే నా ఫీలింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు!
ఈ అవార్డు వారికే అంకితం!
ఇక ఇప్పుడు నాకు ఖేల్ రత్న అవార్డు రావడం, అది కూడా ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా హాకీ ప్లేయర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే కరోనా కల్లోలం కొనసాగుతోన్న ఈ తరుణంలో ఎందరో యోధులు ముందు వరుసలో నిలబడి ఈ వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. అలాంటి వారియర్స్‌కి ఈ అవార్డును అంకితమిస్తున్నా. అలాగే ఈ అవార్డు నా జట్టు సభ్యుల వల్లే సాధ్యమైంది. అందుకే ఇది వారికీ వర్తిస్తుంది. ఈ పురస్కారం నాలో, మహిళల హాకీ జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. ఇదే స్ఫూర్తితో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.. అందుకు మీరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇంతవరకు నన్ను ముందుండి నడిపించిన క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హాకీ ఇండియా, నా కోచ్‌లు, స్పాన్సర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులు, క్రీడాప్రియులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు! థ్యాంక్యూ!!