Image for Representation
‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడంటూ’ అనాదిగా వస్తున్న సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కుమారులే అంతిమ సంస్కారాలన్నీ చేస్తారు. కొడుకులు లేకపోతే వరుసకు కుమారులయ్యే వ్యక్తులు కానీ సోదరులు కానీ ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. కొన్నిచోట్ల అయితే ఆడబిడ్డలను శ్మశానం దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటిది కాలం చేసిన తమ తండ్రి కోసం సమాజపు కట్టుబాట్లను కాదనుకున్నారు మహారాష్ర్టకు చెందిన కొందరు మహిళలు. కొడుకులు లేని లోటును తీరుస్తూ ‘ఆ నలుగురు’గా మారి తమ తండ్రి అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి నిర్వహించారు. పాడె మోయడం నుంచి చితికి నిప్పంటించేదాకా అన్ని బాధ్యతలను నెరవేర్చారు. తద్వారా ఆఖరి మజీలీలోనూ తమ తండ్రిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లా షెందుర్జన్ గ్రామానికి చెందిన సఖారామ్ గణపతిరావు కాలే(92)కు 12 మంది కూతుళ్లు. కుమారులు లేరు. సామాజిక దృక్పథం మెండుగా ఉన్న ఆయన కొడుకుల్లేరే అని ఎప్పుడూ బాధపడలేదు. పైగా బాలికల చదువుకున్న ప్రాముఖ్యతను వివరిస్తూ చుట్టు పక్కల గ్రామాల్లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే వయసు పైబడడంతో పాటు వరుసగా అనారోగ్య సమస్యలు వెంటాడడంతో గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితమయ్యారు గణపతిరావు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో శాశ్వతంగా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు. ఈనేపథ్యంలో తమను ఎంతో అల్లారుముద్దుగా పెంచి, జీవితంలోని ప్రతి దశలో తమకు అండగా నిలిచిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఎంతగానో ఏడ్చారా 12 మంది కుమార్తెలు.
కుమారులు లేకపోతే ఏంటి?
గణపతిరావు మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ‘ఈయనకు దహన సంస్కారాలు ఎవరు చేస్తారో?..ఏంటో?..పున్నామ నరకం నుంచి తప్పించడానికి కనీసం ఒక్క కొడుకైనా లేడు కదా పాపం’ అంటూ వారంతా గుసగుసలాడుకున్నారు. తండ్రిని కోల్పోయి బాధలో మునిగిపోయిన ఆ కూతుళ్లు ఈ మాటలు విని మరింత ఆవేదనకు లోనయ్యారు. దీంతో చివరకు ‘మా నాన్నకు కొడుకులు లేకపోతే ఏంటి?.. మేం 12 మంది కూతుళ్లం ఉన్నాం. మా నాన్న అంతిమ సంస్కారాలన్నీ మేమే నిర్వహిస్తాం’ అంటూ ముందుకువచ్చారు. ఈ మాటలు విని అక్కడున్న బంధువులు, గ్రామస్తులు ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత వారి నిర్ణయంలో తప్పేముందంటూ అందరూ ఆ కూతుళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందించారు.
అందుకే ఇలా చేశాం?
తన సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న గణపతిరావును కడసారి చూడడానికి గ్రామస్తులంతా తరలివచ్చారు. ఈక్రమంలో తమ తండ్రి అంతిమ సంస్కారాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారా 12 మంది కూతుళ్లు. సంప్రదాయాలు, కట్టుబాట్లను కాదంటూ తండ్రి పాడె మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి ఆయన చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ అనే కూతురు మాట్లాడుతూ ‘మేం 12 మంది అక్కాచెల్లెళ్లం. మాకెవరూ సోదరులు లేరు. అయినా మా నాన్న కొడుకులు లేరని ఏనాడూ బాధపడలేదు. ఆయనకు సామాజిక విషయాలపై ఎంతో అవగాహన ఉంది. అందుకే ఇక్కడితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అటువంటి నాన్నకు మేం అంత్యక్రియలు నిర్వహిస్తే తప్పేంటి? పైగా కూతుళ్లే తన చితికి నిప్పంటించాలన్నది ఆయన చివరి కోరిక. అందుకే ఆయన దహన సంస్కారాలన్నీ మేమే నిర్వహించాం. కుమారులకు కూతుళ్లు ఏమాత్రం తక్కువ కాదని అందరూ తెలుసుకోవాలనే ఇలా చేశాం’ అంటూ చెప్పుకొచ్చింది.
గతంలోనూ!
కుమారుల స్థానంలో కూతుళ్లు/కోడళ్లు తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి.
* మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సుందర్బాయ్ నైక్వాడే అనే 80 ఏళ్ల మహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అయితే అప్పటివరకు తమను తల్లిలా చూసుకున్న అత్త హఠాత్తుగా కన్నుమూయడంతో నలుగురు కోడళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తద్వారా అత్తపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
* గతంలో మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని వరుద్ గ్రామానికి చెందిన విఠల్ సదాశివ్ మరణించడంతో ఆయన ఏడుగురు కూతుళ్లే దహన సంస్కారాలు నిర్వహించారు. తద్వారా కుమారుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు.
* అంతకుముందు వారణాసిలోని బైదైనీ ప్రాంతానికి చెందిన యోగేష్ చంద్ర ఉపాధ్యాయ అనే వ్యాపారి అనారోగ్యంతో కన్నుమూశాడు. అతనికి కుమారులెవరూ లేకపోవడంతో నలుగురు కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి తండ్రిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.