పెళ్లికి ముందు, పెళ్లిలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా మధురానుభూతులను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఫొటోషూట్స్ తీయించుకోవడం ఇప్పుడు కామనైపోయింది. సాధారణంగా ఫొటోషూట్ అంటే ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి, అందంగా ముస్తాబై.. తమ సొగసును ఫొటోల్లో బంధించుకుంటుంటారు అమ్మాయిలు. ఇక గర్భిణులైతే తమ మెటర్నిటీ ఫొటోషూట్ కోసం అవుట్‌ఫిట్స్, మేకప్, లొకేషన్ని మరింత జాగ్రత్తగా ఎంచుకుంటుంటారు. తమ కడుపులోని బిడ్డకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ మధుర క్షణాలను కెమెరాలో బంధించుకుంటుంటారు. కానీ కొలరాడోకు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్ కోసం ఓ పెద్ద సాహసమే చేసింది. వందలాది తేనెటీగల్ని తన బేబీ బంప్‌పై వాలేలా చేసుకొని మరీ ఫొటోషూట్ చేయించుకుంది. ఇదేం ఫొటోషూట్.. పైత్యం కాకపోతే.. అనుకోకండి! తాను అంతటి సాహసం చేయడం వెనుక ఓ చిన్న కథ కూడా ఉందంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిందీ మహిళ.
తేనెటీగలనగానే ఆమడదూరం పరిగెత్తుతాం మనం. అవెక్కడ మనల్ని కుట్టి చంపేస్తాయోనని భయపడిపోతాం. అలాంటిది తేనెటీగల్ని తన బేబీ బంప్‌పై వాలేలా చేసి మెటర్నిటీ ఫొటోషూట్ చేయించుకుంది కొలరాడోకు చెందిన బెథానీ కరులక్ బేకర్ అనే మహిళ. వందలాది తేనెటీగలు గ్యాప్ లేకుండా తన చిట్టిపొట్టను చుట్టేసినా.. తన ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లోను ప్రదర్శించిందీ డేరింగ్ వుమన్. ఇలా తేనెటీగలతో తాను తీయించుకున్న మెటర్నిటీ షూట్ ఫొటోల్ని ఫేస్బుక్లో పంచుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.
అందుకే ఈ సాహసం చేశాను!
అయితే తన ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ ఇంతలా వైరలవుతుందని తాను అనుకోలేదని అంటోంది బెథానీ. అంతేకాదు.. మీ అందరికీ తేనెటీగలు వాలిన బేబీ బంప్ మాత్రమే కనిపిస్తోంది.. కానీ దాని వెనుక ఓ చిన్న కథ కూడా దాగుందంటూ ఆ స్టోరీని సుదీర్ఘమైన క్యాప్షన్ రూపంలో ఫేస్బుక్లో పంచుకుందీ బ్రేవ్ లేడీ.
ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా!
బేబీ బంప్‌పై తేనెటీగలు వాలినా ఎంతో ధైర్యంగా, మోముపై చిరునవ్వుతో పోజిచ్చిన ఫొటోను ఫేస్బుక్లో పంచుకున్న బెథానీ.. ‘ఏడాది క్రితం నాకు అబార్షన్ అయింది. ఇది నా జీవితంలో ఓ అనుకోని భయంకరమైన సంఘటన. తీవ్ర మనోవేదనతో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చినా చాలా రోజుల వరకు నేను తిరిగి మామూలు స్థితికి చేరుకోలేకపోయాను. నా గర్భంలో పురుడు పోసుకున్న నా చిన్నారి ఈ భూమ్మీదకు రాకుండానే కనుమరుగైందన్న ఆవేదన నన్ను కొన్ని నెలల పాటు డిప్రెషన్లోకి నెట్టేసింది. క్రమంగా నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఆ సమయంలో నా కుటుంబం, ఫ్రెండ్స్ ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఒక భార్యగా, తల్లిగా తిరిగి నా బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా నాకు మనసు రాలేదు.
గర్భం ధరించినా అదే భయం!
ఇలా కొన్ని నెలలు గడిచింది. నేను మళ్లీ గర్భం ధరించాను. ఓవైపు పట్టరానంత సంతోషంగా ఉన్నా.. పాత జ్ఞాపకాలే నాకు పదే పదే గుర్తొస్తూ ఈసారి ఏమవుతుందోనన్న భయంలోకి నన్ను నెట్టేసేవి. ఇలా చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. రెండో త్రైమాసికంలోకి అడుగుపెట్టాను. అయినా నా ప్రెగ్నెన్సీ విషయం ఎవరితో చెప్పకూడదనుకున్నా.. కారణం.. మళ్లీ అబార్షన్ అవుతుందేమోనన్న భయం! ఇంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడం మొదలైంది. మరోవైపు నాకు వాంతులవడంతో రోజంతా నీరసంగా పడుకొనే ఉండేదాన్ని. కరోనా కారణంగా ఇంటికొచ్చి పలకరించే వారే కరువయ్యారు. లంచ్ డేట్స్, మీటింగ్స్ అన్నీ బంద్! ఇలా నేను ఎవరినీ కలవకపోవడం వల్ల నా ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ తెలియలేదు.. నేనూ వారికి చెప్పలేదు. ఇక్కడ నాకు సంతోషం కలిగిస్తోన్న విషయమేంటంటే.. నేను ఇంట్లోనే ఉండడం వల్ల నా కడుపులోని బిడ్డ ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పెరుగుతుందన్నది నా మనసుకు ఊరట కలిగిస్తోంది. ఈ క్రమంలో నా భర్త చూపిన ప్రేమ, ఆప్యాయతలే నన్ను తిరిగి మామూలు మనిషిని చేశాయి. ఆయన ప్రపంచంలోనే ఉత్తమ భర్త!
అందులోని ప్రత్యేకత అదే!
ప్రస్తుతం నేను 37 వారాల గర్భిణిని. మరికొన్ని వారాల్లో నా బిడ్డ మా మధ్యకు రాబోతోంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి నాకు మాటలు రావట్లేదు.
అయితే ఈ సంతోషం నాకు దక్కడానికి సుమారు ఒక ఏడాది పట్టింది. గత సంవత్సర కాలంగా - ఎంతో ఆవేదనను అనుభవించా.. మిస్ క్యారేజ్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. ఎంతో మానసిక ఆందోళన తర్వాత ఈ దశకు చేరుకున్నా.. మళ్ళీ నా బిడ్డను చూడబోతున్నా..! ఒక గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో, నేనూ అలాగే ఇన్నాళ్లూ ఎంతో మానసిక వేదనను అనుభవించి, ఇప్పుడు ధైర్యంగా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోగలిగే స్థైర్యాన్ని కూడగట్టుకోగలిగా..
ఈ ఫొటోషూట్ కేవలం - ఓ మహిళ బేబీ బంప్‌పై వందలాది తేనెటీగలు వాలిన దృశ్యం మాత్రమే కాదు. ఈ ఫొటో మరెన్నో విషయాలు చెబుతుంది. సుదీర్ఘ మానసిక కుంగుబాటుని అధిగమించి, మళ్ళీ నేను ధైర్యవంతురాలిగా మారిన వైనానికి ఈ ఫొటో ప్రతీక. నా పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫొటోను చూసి, నాలోని యోధురాలిని గుర్తిస్తారని ఆశిస్తున్నాను..”- అంటూ సుదీర్ఘమైన క్యాప్షన్ రూపంలో తన కథను పంచుకుంది బెథానీ.
ఎంత ఫొటోషూట్ అయినా తేనెటీగలు కుట్టకుండా ఉంటాయా? అన్న సందేహం మీకు రావచ్చు. నిజానికి బెథానీ ఓ కల్చరల్ గిఫ్ట్స్ స్టోర్‌ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజా తేనెను కూడా ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. అందుకే బెథానీకి తేనెటీగలతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.. కాబట్టే అవి తనకు ఎలాంటి హానీ తలపెట్టలేదంటుంది బెథానీ!
మొత్తానికి - ఈ ఫొటో తీయించుకోవడం వెనుక బెథానీ ఉద్దేశం ఏదైనా- ఇలాంటి సాహసాలు చేయడం మాత్రం మంచిది కాదు. అందులోనూ గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటివి అసలు పనికి రాదన్న విషయం మనందరికీ తెలిసిందే.
Photo: Facebook