Image for Representation
ఎలాంటి సర్జరీ జరిగేటప్పుడైనా రోగులకు నొప్పి తెలియకుండా అనస్తీషియా ఇవ్వడం కామన్. అయితే ఈ రోజుల్లో కొందరు రోగులు మత్తు మందు తీసుకోకుండానే శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సర్జరీ జరుగుతుండగానే పాటలు పాడుతూ, గిటార్ - వయొలిన్ లాంటి సంగీత వాయిద్య పరికరాలు వాయిస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఇటీవల ఓ 60 ఏళ్ల బామ్మ తనకు బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగానే వంట చేసింది. మొత్తం రెండున్నర గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో కేవలం గంటలోనే 90 స్టఫ్డ్ ఆలివ్స్(ఇటలీలో ఫేమస్ డిష్) ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
గంటలోపే 90 స్టఫ్డ్ ఆలివ్స్!
ఇటలీలోని అన్కోనా నగరానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలికి ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులోని ఎడమ వైపున ఉండే టెంపోరల్ లోబ్(మాటలు, శరీరంలోని కుడి వైపు భాగాల కదలికలను నియంత్రించే భాగం)లో ఏర్పడిన ట్యూమర్‌ను తొలగించేందుకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఈ సర్జరీ జరిగే క్రమంలో ఆ రోగి మెదడు పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆమెను ఏదో ఒక పనిచేయమని సూచించారు అక్కడి వైద్యులు. దీంతో వంటచేస్తానన్న ఆమె 90 ఆలివ్స్ను తయారుచేసింది. మాంసం, ఛీజ్, బ్రెడ్ తదితర పదార్థాలతో తయారుచేసే ఈ వంటకం ఇటలీలో చాలా ఫేమస్. ఇందులో భాగంగా ముందుగా మాంసం, ఛీజ్లను పిండిలో కలిపి ముద్దగా తయారు చేసుకుందీ ఓల్డ్ వుమన్. అనంతరం వాటిని బ్రెడ్ రోల్స్ తరహాలో చుట్టి రుచికరమైన ఆలివ్స్ను తయారుచేసింది. ఆమెకు మొత్తం రెండున్నర గంటల పాటు బ్రెయిన్ సర్జరీ జరగ్గా.. గంటలోపే 90 ఆలివ్స్ను తయారుచేయడం విశేషం.
60 మంది రోగులకు ఇలాగే చేశాను!
ఈక్రమంలో మొత్తం 11 మంది వైద్యుల బృందం ఈ సర్జరీలో పాల్గొంది. అందులో ఒక వైద్యుడు మాట్లాడుతూ.. ‘ఇటీవల బ్రెయిన్ సర్జరీకి సంబంధించి చాలా మార్పులొచ్చాయి. పేషెంట్లను మెలకువతో ఉంచే (అనస్తీషియా ఇవ్వకుండానే) ఆపరేషన్లు చేస్తున్నాం. సర్జరీ చేస్తున్నప్పుడు రోగుల మెదడులోని కదలికలు, పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఇలా చేస్తున్నాం. ఈక్రమంలో రోగులకు ఏదో ఒక పనిచేయాలని సూచిస్తున్నాం. ఇందులో భాగంగా చాలామంది రోగులు పాటలు పాడడమో, సంగీత వాయిద్య పరికరాలు వాయించడమో.. ఇలా తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. మరికొంతమంది రోగులు మొబైల్స్‌లో కార్టూన్లు చూస్తున్నారు. ఇవేవీ లేకపోతే మేమే వారిని వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ వారి మెదడుకు పని పెడుతుంటాం. నేను ఇప్పటివరకు సుమారు 60 మందికి ఇలాగే సర్జరీలు చేశాను. తాజా ఆపరేషన్ కూడా బాగా జరిగింది’ అని చెప్పుకొచ్చారాయన.
ప్రస్తుతం బామ్మ బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘సూపర్ ఛెప్’, ‘ఇది సర్జరీలా లేదు... ఓ హారర్ సినిమా చూసినట్లుంది’ అని వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.