కొన్ని దశాబ్దాల క్రితం వరకు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. పురుషులతో సమానంగా అవకాశాలిస్తే రాకెట్లలో రివ్వున ఎగిరి ఆకాశాన్ని కూడా అందుకోగలమని రుజువు చేస్తున్నారు. అంతేనా.. ఇటు ఇంటి బాధ్యతలతో పాటు అటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించగలమని నిరూపిస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వందే భారత్’ మిషన్‌లో కూడా ఇద్దరు అమ్మలు భాగస్వాములయ్యారు. ఈ మేరకు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ ఈ సూపర్ మామ్స్ సేవలపై ప్రశంసల జల్లు కురిపించింది.
‘వందే భారత్’ మిషన్ పేరుతో!
కరోనాను కట్టడి చేసేందుకు భారత్‌తో సహా పలు ప్రపంచదేశాలు లాక్డౌన్ అమలుచేస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేయడంతో చాలామంది భారతీయులు విదేశాల్లోనే చిక్కుకుపోయారు. సుమారు రెండునెలలుగా కొనసాగుతోన్న ఈ లాక్‌డౌన్‌తో దాదాపు 2లక్షల మంది భారతీయులు విదేశాల్లో అవస్థలు పడుతున్నారని అంచనా. అయితే లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా భారత ప్రభుత్వం ఇటీవల పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ‘వందే భారత్’ మిషన్ పేరుతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మొదటి విడతగా మలేషియా, ఒమన్, యూఏఈ, సింగపూర్, బంగ్లాదేశ్, మాల్దీవుల్లో ఉన్న భారతీయులను విమానాలు, ఓడల ద్వారా ఇక్కడకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
ముందుండి నడిపించారు!
ఈ మిషన్‌లో భాగంగా మలేషియా, ఒమన్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి తాజాగా రెండు ఎయిర్ ఇండియా విమానాలు బయల్దేరాయి. ఈ రెండింటికీ మహిళలే నాయకత్వం వహించడం విశేషం. తిరుచిరాపల్లి-కౌలాలంపూర్ విమానానికి కెప్టెన్ కవితా రాజ్‌కుమార్ నేతృత్వం వహించగా, కొచ్చి-మస్కట్ విమానానికి కెప్టెన్ బిందూ సెబాస్టియన్ సారథ్యం వహించారు. కరోనా కల్లోలం నేపథ్యంలో ఎంతో రిస్క్, శ్రమతో కూడిన ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారీ కెప్టెన్లు. అక్కడి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చి తమ వృత్తిధర్మాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో కవితా రాజ్‌కుమార్, బిందూ సెబాస్టియన్ల సేవలను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. వారిద్దరి ఫొటోలను పంచుకుంటూ ‘వీరిద్దరూ అమ్మగా ఇంటిని నడిపించగలరు. పైలట్లుగా ఆకాశంలో విమానాలు కూడా నడపగలరు. వందే భారత్ మిషన్‌లో భాగంగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన మా మహిళా కెప్టెన్లకు ‘మాతృ దినోత్సవ’ శుభాకాంక్షలు!’అంటూ రాసుకొచ్చింది.
రిస్క్ అని తెలిసినా తమ వృత్తికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన ఈ సూపర్ మామ్స్‌కి మనమూ సెల్యూట్ చేద్దాం..!
Photo: Facebook