చిన్నా ,పెద్దా, ధనిక, పేద అన్న తారతమ్యాల్లేకుండా అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది కరోనా. ప్రపంచంపై పగబట్టినట్లు పంజా విసురుతూ ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. ఇదే సమయంలో ఈ మహమ్మారికి ఎదురెళ్లి మరీ పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరమై ప్రాణాంతక వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. వైరస్‌తో ముప్పు పొంచి ఉన్నా వృత్తిధర్మానికే ఓటేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అయితే కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కొందరు డాక్టర్లు కూడా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకే చెందుతుంది న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ లోర్నా ఎం బ్రీన్(49). ఎక్కడున్నా నిత్యం రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను వైద్యం చేసిన కరోనా బాధితులు వరుసగా చనిపోవడం చూసి చలించిపోయింది. దీంతో మానసిక వేదనకు గురై తనకు తానే తనువు చాలించుకుంది.
చలించిపోయి... తనువు చాలించుకుంది!
చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి అమెరికాకు శాపంగా పరిణమించింది. ఈ విపత్తు నుంచి అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదురొడ్డి పోరాటం చేస్తున్నారు. వీరిలో డాక్టర్ లోర్నా ఒకరు. మన్‌హట్టన్‌లోని న్యూయార్క్ ప్రెస్పిటేరియన్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడికల్ విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె తన వైద్యంతో ఎంతోమంది కరోనా రోగులకు వూపిరి పోశారు. ఇదే సమయంలో చాలామంది రోగులు కోలుకోలేక లోర్నా కళ్లముందే కన్నుమూశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్నా...పేషెంట్లు చనిపోవడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకుంది.
కరోనా కోరలకు చిక్కినా!
కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో అదే మహమ్మారి కోరలకు చిక్కింది లోర్నా. దీంతో కొద్ది రోజుల పాటు క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. ఎంతో ధైర్యంగా వైరస్‌ను ఎదుర్కొని దానిపై విజయం సాధించింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా బాధితులను కాపాడే ఉద్దేశంతో కోలుకున్న వెంటనే విధుల్లో చేరింది లోర్నా. ఇదే సమయంలో ఆస్పత్రిలో రోగుల పరిస్థితి మరింత దిగజారింది. చికిత్స పొందుతున్న సమయంలోనే చాలామంది రోగులు కోలుకోలేక లోర్నా కళ్ల ముందే కన్నుమూశారు. దీంతో ఆమె మానసిక కుంగుబాటుకు గురైంది. ఆస్పత్రి యాజమాన్యం కూడా తన మానసిక స్థితిని అర్థం చేసుకుని వెంటనే ఇంటికి పంపించేసింది. దురదృష్టవశాత్తూ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడి తన కుటుంబ సభ్యులతో పాటు తన సహచర వైద్యులు, స్నేహితులకు తీరని శోకం మిగిల్చింది లోర్నా.
నా కూతురు నిజమైన హీరో!
ఈక్రమంలో ఆత్మహత్యకు పాల్పడేముందు లోర్నా తనతో మాట్లాడిందని ఆమె తండ్రి డాక్టర్ ఫిలిప్ బ్రీన్ చెప్పడం గమనార్హం.
‘నా కూతురికి ఎలాంటి మానసిక అనారోగ్యం లేదు. తను బలవన్మరణానికి పాల్పడేముందు నాతో ఫోన్లో మాట్లాడింది. ఇంట్లో ఉన్నా తను నిత్యం రోగుల బాగోగుల గురించే ఆలోచించేది. కరోనా బారిన పడినా చికిత్స తీసుకుని వెంటనే కోలుకుంది. మళ్లీ విధులకు హాజరైంది. అయితే ఇదే సమయంలో కరోనా రోగులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలను చూసి ఆమె తట్టుకోలేకపోయింది. అంబులెన్స్‌ల నుంచి బయటకు రాకముందే చాలామంది పేషెంట్లు మరణించడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని నాతో ఫోన్లో చెప్పింది. విధి నిర్వహణలో భాగంగా నా కూతురు తన పనిని తాను చేయాలనుకుంది. కానీ దురదృష్టవశాత్తూ అదే ఆమె ప్రాణాలు బలిగొంది. నా కూతురు నిజమైన హీరో’ అని లోర్నా తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.
ఇంట్లో నుంచే రోగుల గురించి ఆరా తీసేది!
అందరితో ఎంతో కలివిడిగా, సరదాగా ఉండే లోర్నా ఆత్మహత్య తమకు తీవ్ర ఆవేదనను మిగిల్చిందని ఆమె కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు ఉద్వేగానికి లోనవుతున్నారు. ‘తన ప్రతిభతో అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది లోర్నా. తనెప్పుడూ ఇతరుల గురించే ఆలోచించేవారు. పని సంగతి పక్కన పెడితే తాను చాలా కూల్. క్రీడలంటే చాలా ఆసక్తి. తనకు న్యూయార్క్ స్కై క్లబ్లో సభ్యత్యం కూడా ఉంది. స్నో బోర్డ్ గేమ్‌ను ఎంతో ఇష్టంగా ఆడేది. తనకు దేవుడిపై చాలా నమ్మకం. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వారానికోసారి తన ఇంటి దగ్గరే పేదలకు భోజనం ఏర్పాటుచేసేది. కరోనా బారిన పడినప్పుడు కూడా తను ఇంట్లో నుంచే మాకు మెసేజ్‌లు చేస్తూ రోగుల సమాచారం తెలుసుకునేది..’ అంటూ లోర్నాతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు ఆమె కొలీగ్స్.
వారిలో మానసిక ఆందోళన!
కరోనా కారణంగా వైద్య సిబ్బందిలో కూడా మానసిక ఆందోళనలు ఉత్పన్నమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో లోర్నా ఆత్మహత్య కూడా అలాంటిదేనని అక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు చెబుతున్నారు. ‘కరోనా రోగులను కాపాడే క్రమంలో కొంతమంది అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది వైద్యులు మానసిక క్షోభకు గురవుతున్నారు. నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడంతో పాటు వైరస్‌తో ప్రత్యక్ష పోరాటం చేసే క్రమంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి పీపీఈ కిట్లు చాలామందికి ఉండడం లేదు. ఇక చాలా చోట్ల వైద్యులపై దాడులు కూడా జరుగుతున్నాయి..’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
రోగుల ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి...ఎంతోమందిని కరోనా నుంచి కాపాడిన లోర్నా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. విపత్కర పరిస్థితుల్లోనూ వృత్తిధర్మం పాటిస్తూ వైద్య వృత్తికే వన్నె తెచ్చిన ఈ డాక్టర్ నిజమైన కరోనా వారియర్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.