ఓ సూక్ష్మక్రిమి(కరోనా)కి.. 190కి పైగా దేశాలకు మధ్య సాగుతోన్న సమరంలో మనుషులంతా ఏకమై కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనబడని యుద్ధం చేస్తున్నారు. ఈ వైరస్ ధాటికి మనుషులందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అని రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్ 19 వైరస్ నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీలో అలుపూ-సొలుపూ లేకుండా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం కొవిడ్ 19పై ఎన్నో అధ్యయనాలు చేసి ‘ChAdOx1 nCoV-19’ అనే టీకాను కనిపెట్టింది. అయితే ఈ టీకాను ముందు మనుషులపై ప్రయోగించాలని వీళ్లు నిర్ణయించారు. ఈ క్రమంలో తమపై ఈ పరీక్షలు జరిపేందుకు అంగీకరిస్తూ 800 మంది వలంటీర్లు ముందుకు రాగా.. వారిలో ఎలీసా గ్రనాటో అనే మహిళ టీకా తీసుకోవడం విశేషం.
నేనూ ఓ శాస్త్రవేత్తనే..!
తన కుటుంబ క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అతివలు. అలాగే ఈ సమాజాన్ని కనిపించని శత్రువు నుంచి కాపాడడంలోనూ తాము ముందే ఉంటామని ఎలీసా గ్రనాటో అనే మహిళ తాజాగా నిరూపించింది. లండన్‌కు చెందిన ఎలీసా వృత్తిరీత్యా ఓ మైక్రో బయాలజిస్ట్..! ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ‘Bacterial Interactions’ పై అధ్యయనం చేస్తోంది. అయితే ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన టీకా తనపై ప్రయోగించేందుకు అంగీకరించి ధైర్యంగా ముందుకొచ్చింది ఎలీసా. అంతేకాదు టీకా వేయించుకున్న రోజే ఆమె పుట్టినరోజు (32వ) కూడా కావడం విశేషం.
ఈ సందర్భంగా ఎలీసా మాట్లాడుతూ ‘నేను కూడా ఓ శాస్త్రవేత్తనే..! అందుకే.. సైన్స్‌పై ఎక్కడ పరిశోధనలు జరిగినా నావంతు సహకారాన్ని అందించేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే..! వైరస్ల గురించి నేను అంతగా చదువుకోలేదు కాబట్టి.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఎలాంటి సహాయం అందించలేకపోతున్నానని ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను..! కనీసం ఈ ప్రయోగం ద్వారానైనా కొవిడ్ 19 వైరస్ కట్టడి చేసేందుకు నేను ఉపయోగపడుతున్నందుకు నాకు తృప్తిగా ఉంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ యువ శాస్త్రవేత్త.

ఆ విషయం ఎవరికీ తెలియదు!
ఎలీసాతో పాటు టీకా పొందిన రెండో వ్యక్తి పేరు ఎడ్వర్డ్ ఓ నీల్. ఆయన క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తుంటారు. ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు వీళ్లిద్దరిలో ఎలీసాపై కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను ప్రయోగించగా.. మరో వ్యక్తికి Meningitis (వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే మెదడు సంబంధిత వ్యాధి)ని అరికట్టే టీకాను అందించారు. తమపై ప్రయోగం జరిపేందుకు సిద్ధంగా ఉన్న మిగతా వలంటీర్లకు కూడా ఇదే పద్ధతిని అనుసరించనున్నామని వైద్యులు తెలిపారు. అయితే వీరిలో ఎవరికి ఏ టీకాను అందిస్తున్నారనే విషయం ఆ వైద్యులకు తప్ప.. అక్కడున్న వలంటీర్లెవరికీ తెలియదు. ఇక ఈ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలు పూర్తిస్థాయిలో తెలియడానికి కొన్నిరోజులు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

వాటికి సిద్ధపడే..
ఈ వ్యాక్సిన్ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది కాబట్టి.. ఈ ప్రయోగాలు కచ్చితంగా సఫలమవుతాయని చెప్పలేం. ఒక్కోసారి టీకా తీసుకున్న కొన్ని రోజులకు కొంతమందిలో భుజాల నొప్పి, తలనొప్పి, జ్వరం.. తదితర లక్షణాలు కనిపించే అవకాశం కూడా ఉంది. అందుకే రానున్న రోజుల్లో కూడా ఈ పరీక్షల్లో పాల్గొన్న వలంటీర్లు శాస్త్రవేత్తల పర్యవేక్షణలోనే ఉంటారు. ఇందుకు అంగీకరించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులపైనే ఇలాంటి ట్రయల్ టీకాలను ప్రయోగిస్తుంటారు శాస్త్రవేత్తలు.
గతంలో ఈమె కూడా..
కొన్నిరోజుల క్రితం అమెరికాకు చెందిన National Institute of Health, Moderna అనే సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ‘mRNA-1273’ అనే టీకాను తనపై ప్రయోగించమని ధైర్యంగా ముందుకొచ్చింది 43 ఏళ్ల జెన్నిఫర్ హాలెర్ అనే మహిళ. అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పని చేస్తోన్న జెన్నిఫర్‌కు 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి విజృంభిస్తోన్న తరుణంలో జెన్నీకి ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించారు తన పై అధికారులు. కానీ, కరోనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో జెన్నీ భర్త కూడా ఉండడం గమనార్హం.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువశాతం మంది కింది స్థాయి ఉద్యోగులే..! దీంతో వీళ్లంతా తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని జెన్నీ చాలా బాధపడేది. ఆ సమయంలోనే కరోనా టీకాలపై క్లినికల్ పరీక్షల కోసం 15 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు గల వలంటీర్లు కావాలని ఓ సంస్థ ఇచ్చిన ప్రకటన చూసి జెన్నీ వాళ్లను సంప్రదించింది. ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు చాలామంది రాగా.. వీరిలో జెన్నీతో పాటు మరో ఇద్దరే ఎంపికయ్యారు. వైద్యులు ఈ ముగ్గురిలో తొలి టీకాను జెన్నీపైనే ప్రయోగించారు.
|
మనం చిన్న ఇంజెక్షన్ వేయించుకోవడానికే తెగ భయపడిపోతుంటాం. అలాంటిది ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్న టీకాతో తమ ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశం ఉందని తెలిసినా కొండంత ధైర్యంతో, సమాజ శ్రేయస్సు కోరి ముందుకు వచ్చిన ఈ మహిళల త్యాగం అమూల్యం..!