ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్నారు. అహర్నిశలూ శ్రమిస్తూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయితే పలు దేశాల్లో రోగులకు సరిపడా వైద్య సిబ్బంది, నర్సులు ఉండడం లేదు. ఈ కారణంగా సరైన వైద్య సేవలు అందక రోగులు, పనిభారంతో వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితులను కాపాడేందుకు తన ‘కోటగుమ్మం’ దాటి మరీ ముందుకు వచ్చింది స్వీడన్ యువరాణి సోఫియా. సకల రాజభోగాలు అనుభవిస్తోన్నా.. ఇతరులకు సహాయపడడంలోనే మానసిక సంతృప్తి ఉందంటూ స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించడానికి ‘వలంటీర్’గా అవతారమెత్తిందీ స్వీడిష్ ప్రిన్సెస్.
సకల రాజభోగాలను వదిలి!
అగ్ర దేశాలను సైతం ముప్పతిప్పలు పెడుతోన్న కరోనా మహమ్మారి స్వీడన్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ కొంచెం మెరుగైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఆ దేశంలో సుమారు 1400మంది మృత్యువాతపడ్డారు. ఇంకా 13వేల మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది స్వీడన్ ప్రిన్సెస్ సోఫియా. ఆ దేశపు యువరాజు ప్రిన్స్ కార్ల్ ఫిలిప్ సతీమణి అయిన ఆమె.. మూడు రోజుల ఆన్లైన్ ఇంటెన్సివ్ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరీ వలంటీర్‌గా అవతారమెత్తింది. ప్రస్తుతం తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోన్న సోఫియామెట్ ఆస్పత్రిలోనే వలంటీర్‌గా సేవలందిస్తున్నారీ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ఉన్న ఈ ఆస్పత్రికి 2016 నుంచే గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు సోఫియా.
శిక్షణ తీసుకుని!
స్వీడన్‌లోనూ రోజురోజుకీ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే అందుకు తగ్గ వైద్య సిబ్బంది, నర్సులు లేకపోవడంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన సోఫియామెట్ ఆస్పత్రి.. కరోనా బాధితులకు సేవలందించేందుకు కొంతమంది సిబ్బందిని నియమించుకుంటోంది. వైద్యులకు సహాయపడేలా ఓ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టి.. వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా వారానికి 80మంది చొప్పున ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆపత్కాలంలో వైద్య సిబ్బందికి తన వంతు సహాయం చేయాలనుకున్న సోఫియా కూడా ఈ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోర్సులో చేరింది. అక్కడ వారితో పాటే క్లీనింగ్, వంట చేయడం, క్రిమి సంహారక మందుల పంపిణీ తదితర కార్యక్రమాల్లో తర్ఫీదు పొందింది.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు!
కరోనా సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందికి తమ వంతు సహాయమందిస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్ ఇంగ్లండ్- 2019 కిరీటం కైవసం చేసుకున్న డాక్టర్ భాషా ముఖర్జీ కూడా ఇటీవల స్టెత్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే నాన్ మెడికల్ వలంటీర్‌గా శిక్షణ తీసుకున్న సోఫియా ప్రస్తుతం సోఫియామెట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి తన వంతు సహాయమందిస్తోంది. కరోనా రోగులకు నేరుగా వైద్యం చేయకపోయినా తన సేవలతో వైద్య సిబ్బందిపై పడుతున్న అదనపు భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తోంది. ఈ సందర్భంగా ఆమె సోఫియామెట్ హాస్పిటల్లో డాక్టర్లతో కలిసి దిగిన ఫొటోలను తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది రాయల్ సెంట్రల్ ఫ్యామిలీ.
‘కరోనా తీవ్ర సంక్షోభం తీసుకొచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిపై భారాన్ని తగ్గించేందుకు ప్రిన్సెస్ సోఫియా వలంటీర్‌గా చేరారు’ అని ఆమె సేవా గుణం గురించి రాసుకొచ్చింది స్వీడన్ రాజ కుటుంబం. ఆ ఫొటోల్లో నీలం రంగు ఆప్రాన్ ధరించిన సోఫియా తన తోటి సహచరులతో సామాజిక దూరం పాటిస్తూ నిల్చుంది. ఆమె ఫొటోను చూసిన నెటిజన్లందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అందమైన రూపమున్న ఈ యువరాణి మనసూ అందమైనదే’ అని కామెంట్లు పెడుతున్నారు.
Photo: Instagram