కనికరం లేకుండా కోరలు చాస్తోన్న కరోనాకు అగ్రదేశాలు సైతం అతలాకుతలమవుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా బ్రిటన్‌లో ఇప్పటికే సుమారు 7వేల మంది మృత్యువాత పడగా, లక్షలాది మంది క్వారంటైన్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్లెస్ లాంటి ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కరోనా కోరల్లో చిక్కుకొని తాను కూడా చావును చాలా దగ్గర్నుంచి చూశానని చెబుతోంది లండన్‌లో నివసిస్తోన్న రియా లఖానీ. భారతీయ సంతతికి చెందిన ఆమె కరోనా బారిన పడి ఇటీవలే కోలుకుంది. ఈ క్రమంలో చికిత్స తీసుకునే సమయంలో తనకెదురైన అనుభవాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుందీ బ్రేవ్ లేడీ.
ఏడేళ్లుగా చికిత్స తీసుకుంటున్నా!
వృత్తి రీత్యా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన రియా లండన్‌లో ఉంటోంది. ఏడేళ్ల నుంచి ఆమె అచలేసియా(అన్న వాహికకు సంబంధించిన సమస్య)తో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో ఏది మింగాలన్నా ఆమెకు కష్టమయ్యేది. అప్పటి నుంచి రెగ్యులర్‌గా చికిత్స తీసుకుంటూనే ఉంది. అయితే సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఆమెకు శస్ర్తచికిత్స అనివార్యమైంది. దీంతో వైద్యులు కూడా ఆమెకు ఆపరేషన్ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక దీని కోసం రియా కూడా ఆస్పత్రిలో చేరింది. అయితే ఇదే సమయంలో ఆమె ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారితమైంది. దీంతో కరోనాకు చికిత్స తీసుకునే క్రమంలో తనకెదురైన అనుభవాలను ఓ వార్తా సంస్థతో ఇలా పంచుకుంది.
కృత్రిమ శ్వాసతోనే..!
‘సర్జరీ కోసం నేను ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజులకే నా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీనికి తోడు తీవ్ర జ్వరం కూడా వచ్చింది. మొదట ఈ లక్షణాలన్నింటినీ చూసి నేను, నా కుటుంబ సభ్యులు సర్జరీ కారణంగా వచ్చిన దుష్ప్రభావాలేమోనని భావించాం. ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షల కోసం నా నమూనాలను పంపించాను. ఆ పరీక్షల్లో నాకు కరోనా సోకిందని నిర్ధారితమైంది. దీంతో నేను, నా కుటుంబ సభ్యులతో పాటు వైద్యులందరూ షాకయ్యారు. వెంటనే నా గదిలో ఉండే మిగతా రోగులను వేరే చోటికి తరలించారు. నా రూంను ఐసోలేషన్ వార్డుగా మార్చేశారు. అయితే క్రమంగా నా ఆరోగ్య పరిస్థితి చేయి దాటిపోయింది. వైద్యులు కృత్రిమ శ్వాస అందించడం మొదలుపెట్టారు. అయినా నా కండిషన్ మెరుగుపడకపోగా మరింత విషమించడంతో లండన్‌లోని కరోనా ప్రధాన చికిత్సా కేంద్రానికి నన్ను తరలించారు.’
మనసులో భయం మొదలైంది!
‘అక్కడ నన్ను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో కనీసం నా భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువులను చూసే అవకాశం కూడా లేదు. చికిత్సలో భాగంగా ఎందరో వైద్యులు వచ్చి నన్ను పరిశీలించే వారు. నన్ను అబ్జర్వేషన్లో ఉంచి అనునిత్యం నా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించే వారు. నాకు వినిపించకుండా ఒకరికొకరు మెల్లగా గొణుక్కునేవారు. ఆ సమయంలో నా మెదడులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. మనసులో ముందెన్నడూ లేని భయం మొదలైంది. అప్పటివరకు శ్వాస తీసుకోవడమనేది సహజ ప్రక్రియ అనుకునేదాన్ని. కానీ అప్పుడు గాలి ఎలా పీల్చుకోవాలో, ఎలా వదిలేయాలో గుర్తుంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో శ్వాస తీసుకోవడమంటే నాకు ఓ కొండెక్కినంత కష్టంగా ఉండేది. ఒకానొక దశలో ఇక నా పని అయిపోయిందనుకున్నా. చావు నాకు చాలా దగ్గరలో ఉన్నట్లు అనిపించింది. జీవితం మీద ఆశలు వదులుకుని ఎంతో వైరాగ్యంతో నా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపించాను..’
మొదలెట్టిన మాట పూర్తిచేయాలంటే!
అయితే హీరోల రూపంలో ఉన్న వైద్యుల సేవలు, నా అదృష్టం కారణంగా నెమ్మదిగా నా ఆరోగ్యం మెరుగైంది. ఆస్పత్రిలో మొదట కనీసం పక్కకు కూడా తిరగలేకపోయేదాన్ని.. మాట్లాడలేకపోయేదాన్ని.. మొదలెట్టిన మాటను పూర్తి చేయాలంటే మారథాన్‌ను పూర్తి చేసినంత శ్రమపడాల్సి వచ్చేది. అయితే వైద్యులు ఆక్సిజన్‌తో పాటు నొప్పిని భరించేందుకు మార్ఫిన్ను ఇచ్చేవారు. అదే సమయంలో నా పక్క బెడ్‌పై చికిత్స పొందుతున్న ఐరిస్ అనే ఓ 96 ఏళ్ల వృద్ధురాలిని చూసి నాకు జీవితంపై ఆశ చిగురించింది. వయసు పైబడడంతో ఆమెకు సరిగ్గా వినిపించకపోయినా, మేం బాగా కలిసిపోయాం. దూరంగా ఉంటూనే ఒకరి ఆరోగ్య పరిస్థితి గురించి ఒకరం తెలుసుకునే వాళ్లం..’
వారే నా నిజమైన హీరోలు!
‘ఇక నాతో పాటు అక్కడున్న వారందరికీ చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది నిజంగా హీరోలు. ఎందుకంటే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు అసలు పగటి వెలుతురును చూస్తాననుకోలేదు. ఇక నన్ను ఎంతగానో ప్రేమించే నా కుటుంబ సభ్యులను కూడా కలుసుకుంటాననుకోలేదు. వైద్య సిబ్బంది మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వేడిగా టీ, బ్రెడ్, స్నాక్స్ అందించే వారు. ఇక కరోనా నుంచి కోలుకున్నాక ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లే సమయంలో నా మనసులో ఏర్పడిన భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేను. ఇప్పటికీ కొంచెం దగ్గు, ఊపిరితిత్తుల్లో నొప్పి ఉంది. అందుకే ఇంట్లో నా భర్త, నేను వ్యక్తిగత దూరం పాటిస్తున్నాం. ఇప్పట్నుంచి ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోను..’ అంటూ తాను కరోనాను జయించిన విధానం గురించి చెప్పుకొచ్చింది రియా.
ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా.. మనసులో కొండంత ధైర్యం, సమస్యను ఎదుర్కొంటానన్న ఆత్మవిశ్వాసం, జీవితంపై ఆశ ఉంటే కరోనానే కాదు.. అంతకుమించిన మహమ్మారిని సైతం జయించగలం అని నిరూపించింది రియా.. ‘కరోనా సోకింది.. ఇక మా పని అయిపోయినట్లే..’ అని నిరాశలో కూరుకుపోయే వారి మనసులో కొండంత ఆశను తీసుకొచ్చిందీ మహిళ.
Photo: Instagram.com/liveeachdaylikeitsyourlast