కరోనా భయంతో ప్రపంచమంతా షట్‌డౌన్ అయిపోయింది. డాక్టర్లు, పోలీసులు, మీడియా.. వంటి అత్యవసర సేవలు మినహా సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇక ఇలాంటి సమయంలో మరీ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికొచ్చే సాహసం ఎవరైనా చేస్తారా చెప్పండి. కానీ అలాంటి సాహసమే చేసింది ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్. క్వారంటైన్లో భాగంగా దొరికిన ఖాళీ సమయాన్ని మనమంతా విభిన్న రకాలుగా ఉపయోగించుకుంటుంటే.. ఈ ఇంగ్లండ్ స్కిప్పర్ మాత్రం ‘నా ఈ ఖాళీ సమయం సేవకే అంకితం..’ అంటూ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్హెచ్ఎస్)’లో వలంటీర్‌గా చేరిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్హెచ్ఎస్లో తన సభ్యత్వాన్ని కూడా నమోదు చేసుకుందీ ఇంగ్లిష్ క్రికెట్ బ్యూటీ. ఇంతకీ హీథర్ ఎన్హెచ్ఎస్ వలంటీర్‌గా ఎలా సేవ చేస్తోందో తెలుసుకుందామా..?
ప్రస్తుతం కరోనా ప్రపంచమంతా విస్తరించినప్పటికీ కొన్ని దేశాల ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఆ దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ఇప్పటికే కరోనా మహమ్మారిపై పోరాటం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు కోట్లకు కోట్లు విరాళాలు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఏకంగా కరోనా జోన్లోకే ఎంటరైంది. తాజాగా ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్హెచ్ఎస్)’లో తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న హీథర్.. ఎన్హెచ్ఎస్ వలంటీర్‌గా ఈ మహమ్మారిపై పోరాటం చేయడానికి ధైర్యంగా ముందడుగేసింది.
వలంటీర్‌గా ఏం చేస్తోంది?
కరోనాపై పోరులో భాగంగా జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్హెచ్ఎస్)లో వలంటీర్‌గా చేరిన హీథర్.. కరోనా చికిత్సకు అవసరమయ్యే మందులు రవాణా చేయడం, కరోనా వైరస్ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివి చేస్తోంది. దీని గురించి హీథర్ మాట్లాడుతూ.. ‘ఎన్హెచ్ఎస్లో వలంటీర్‌గా చేరాను. ప్రస్తుతం నా చేతిలో చాలా ఖాళీ సమయం ఉంది. అందుకే ఈ సమయంలో నాకు చేతనైనంత సహాయం చేయడానికి నిశ్చయించుకున్నా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. నా స్నేహితుల్లో కొందరు ఎన్హెచ్ఎస్లో పనిచేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వారు ఎంతగా కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి నాకు చేతనైనంతగా సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా. నా ప్రాణ స్నేహితుల్లో ఎలిన్ ఒకరు, ప్రస్తుతం ఆమె రాయల్ లివర్‌పూల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి ఆమె ప్రశాంతంగా పని చేసుకోవడానికి మా యూనివర్సిటీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో కొన్ని పాత పాటల్ని ఆమెకు పంపిస్తున్నా. ఇలా ఆమెను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నా.
ఎన్హెచ్ఎస్లో వలంటీర్‌గా సేవలందించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ క్రమంలో మందులు రవాణా చేయడంతో పాటు ఐసోలేషన్‌లో ఉన్న రోగుల్ని కలిసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో వారు కరోనా ఫోబియా నుంచి త్వరగా బయటపడేసేలా నాకు చేతనైనంతగా అవగాహన కల్పిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఇంగ్లండ్ స్కిప్పర్. సేవాభావంతో పాటు కరోనాపై పోరాడాలనే ఆసక్తి ఉన్న వారిని కొన్ని రోజుల క్రితం ఎన్హెచ్ఎస్ ప్రకటన ద్వారా ఆహ్వానించిందా సంస్థ. ఆ ప్రకటన హీథర్ కంట పడడంతో రెండో ఆలోచన లేకుండా అందులో చేరిపోయిందీ డ్యాషింగ్ క్రికెటర్.