ప్రపంచమంతా కరోనా వైరస్ అలుముకున్న ఈ తరుణంలో దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి, ఓవైపు మార్కెట్లో లభించే మాస్కులు కొందామంటే వందలకు వందలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. మరోవైపు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే శానిటైజర్ల కొరత కూడా ఏర్పడినట్లు మనం రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే ఇక నుంచి మాస్కులు, శానిటైజర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదంటున్నారు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఫూల్‌బాగ్‌కు చెందిన మహిళలు. ఈ క్రమంలోనే అక్కడి వందలాది మంది మహిళలు మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఇలా వీరు తయారుచేసిన ఈ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే విక్రయిస్తూ కరోనా బారి నుంచి అందరినీ కాపాడడంలో పరోక్షంగా తమ వంతుగా కృషి చేస్తున్నారు. మరి, ఈ మహిళల గురించి, వారు తయారుచేస్తోన్న ఉత్పత్తుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం రండి..
కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ తరుణంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మరోవైపు మార్కెట్లో శానిటైజర్ల కొరత కూడా ఏర్పడింది. ఈ రెండు సవాళ్లను అధిగమిస్తూ కరోనా నివారణలో కీలకంగా మారిన ఈ వస్తువులను అందరికీ చేరువ చేయడానికి గ్వాలియర్‌లోని ఫూల్ బాగ్‌కు చెందిన వందలాది మంది మహిళలు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే పర్యావరణహితమైన పదార్థాలతో మాస్కులు, శానిటైజర్లు తయారుచేస్తూ తక్కువ ధరకే విక్రయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ మహిళా మణులు.
ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో..!
మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద గ్వాలియర్ జిల్లాలో 2,375 మహిళా సంఘాల గ్రూపులున్నాయి. వీరిలో 862 మంది మహిళలు మాస్కుల కుట్టుపనిలో నిమగ్నమయ్యారు. అయితే అంతకంటే ముందు ఆ జిల్లా పంచాయతీ సీఈవో శివమ్ వర్మ ఆదేశాల మేరకు అక్కడి 8 గ్రూపుల్లోని 46 మంది మహిళలు 900కు పైగా మాస్కుల్ని తయారుచేశారు. పర్యావరణహితమైన కాటన్, Nonwoven fabric వంటి ఉత్పత్తులతో తయారుచేసిన ఈ మాస్కుల్ని ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రపరిచి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్వో) కార్యాలయాలకు, ఇతర ఆరోగ్య సంస్థలకు అందజేశారు. దాంతో మరో రెండు లక్షల మాస్కులు కావాలంటూ ప్రభుత్వం, ఇతర ఆరోగ్య సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇలా వీటికి డిమాండ్ పెరగడంతో మరిన్ని గ్రూపుల్లోని మహిళలు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఇలా మొత్తంగా 862 మంది మహిళలు పర్యావరణహిత మాస్కుల తయారీలో బిజీగా ఉన్నారు.
శానిటైజర్లు కూడా..!
కేవలం మాస్కులే కాదు.. ప్రస్తుతం శానిటైజర్లకు కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే గ్వాలియర్ జిల్లాలోని మహిళా సంఘాల గ్రూపులకు చెందిన మిగతా మహిళలంతా శానిటైజర్ల తయారీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే శానిటైజర్ తయారీ, ప్యాకింగ్ కోసం అక్కడి రాయరూ ప్రాంతంలోని మద్యం కర్మాగారాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో శానిటైజర్ తయారీ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. అంతేకాదు.. ఈ శానిటైజర్ల తయారీ కోసం ‘రాయరూ డిస్టిల్లరీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ)’ సంస్థ దాదాపు 20 వేల లీటర్ల స్పిరిట్‌ను కూడా అందజేస్తోంది.
ఇలా ప్రభుత్వం చొరవతో, మహిళా సంఘాలంతా ఏకమై తయారుచేస్తోన్న మాస్కులు, శానిటైజర్ల ధర కూడా చాలా తక్కువ. ఈ క్రమంలో ఒక్కో మాస్కుకు రూ. 10 చొప్పున, లీటర్ శానిటైజర్ బాటిల్‌కు రూ. 100 చొప్పున ధర నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటి తయారీ పూర్తయ్యాక ఆర్డర్లు సప్లై చేయడంతో పాటు అక్కడ కొన్ని సెంటర్లను ఏర్పాటు చేసి వీటిని విక్రయించనున్నట్లు వారు చెబుతున్నారు.
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న ఈ పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లను అందరికీ అందుబాటు ధరల్లో అందించడానికి గ్వాలియర్ మహిళలు చేస్తోన్న ఈ ప్రయత్నం నిజంగా హర్షణీయం. ఆయా ప్రభుత్వాల చొరవతో వివిధ రాష్ట్రాల్లోని మహిళా సంఘాలు కూడా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తక్కువ ధరకే కరోనా ప్రొటెక్టివ్ ప్రొడక్ట్స్ తయారుచేస్తే పరోక్షంగా ఈ వైరస్ ముప్పు నుంచి అందరినీ బయటపడేసిన వారవుతారు.. అంతే కదూ!!