ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా భయమే అలుముకుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఎన్నో దేశాల్లో తన విశ్వరూపాన్ని చూపుతోంది. మొదటి రెండు నెలలు చైనాను కుదిపేసిన ఈ వైరస్ ప్రస్తుతం కొన్ని దేశాల్ని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అలా కరోనా చెరబట్టిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. రోజురోజుకీ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల రేటు కూడా ఇటలీలో ఎక్కువేనని అధికారికంగా వెల్లడైన గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ రోజురోజుకీ రోగులు పెరిగిపోతుండడంతో వైద్య సదుపాయాలు కూడా కొరవడుతున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి కరోనా బాధితులకు తనవంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా వెర్సేస్. తన కూతురు అలెగ్రా వెర్సేస్తో కలిసి మిలాన్‌లోని ఓ హాస్పిటల్‌కి కోటి రూపాయలకు పైగా విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది డొనాటెల్లా.

ప్రస్తుతం ఇటలీలో విలయ తాండవం చేస్తోన్న కరోనా వైరస్ ధాటికి అక్కడి జనం విలవిల్లాడిపోతున్నారు. రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో సరైన వైద్య సదుపాయాలు అందక మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డొనాటెల్లా. ఆమె కూతురు-ఇటాలియన్ సామాజిక కార్యకర్త అలెగ్రా.
వారికి అండగా నిలుద్దాం!
ఈ తల్లీకూతుళ్లిద్దరూ కలిసి మిలాన్‌లోని శాన్ రఫేల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్కు రెండు లక్షల యూరోల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.62 కోట్లకు పైమాటే)ను విరాళంగా అందించారు. అంతేకాదు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి కట్టుగా ఉండి కరోనా బాధితుల్ని ఆదుకోవాలంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు డొనాటెల్లా.

‘ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా ఏకం కావడం చాలా ముఖ్యం. ఈ వైరస్ బారిన పడిన వందల మంది ప్రాణాలను కాపాడడానికి నిరంతరం శ్రమిస్తోన్న వైద్య బృందానికి మనవంతుగా సహాయం చేయడం మన ధర్మం. అందుకే నేను, అలెగ్రా మిలాన్‌లోని శాన్ రఫేల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్కు రెండు లక్షల యూరోలను విరాళంగా అందించాం. మన మనసులన్నీ ఈ వైరస్ బారిన పడి పోరాడుతోన్న బాధితుల చుట్టూ, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ బాధితులకు నిరంతరాయంగా వైద్య సహాయం అందిస్తోన్న వైద్య సిబ్బంది చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా బాధితులను కాపాడే క్రమంలో వైద్య సిబ్బంది చేస్తోన్న కృషి అభినందనీయం. ఇలాంటి సమయంలో మనం కూడా ఈ సమాజంలోని వ్యక్తులుగా ఏకమవ్వాల్సిన తరుణమిది. ఒకరికొకరు అండగా నిలబడుతూ ఒకరినొకరు కాపాడుకోవాల్సిన సమయమిది.. - ఇట్లు డొనాటెల్లా, అలెగ్రా’ అంటూ కరోనాను అంతం చేయడంలో కలిసికట్టుగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు.
అంతకుముందు మరో ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ మిలాన్, రోమ్‌లోని పలు ఆసుపత్రులకు సుమారు రూ. 14.12 కోట్లను విరాళంగా అందించారు.
Photos: Screengrab & Instagram.com/donatella_versace