సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి సాయుధ దళాలంటే పురుషులే గుర్తుకు వస్తారు. ఇక్కడ మహిళలున్నా ఉన్నత అవకాశాలకు మాత్రం ఆమడదూరంలో ఉంటారు. ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ‘ ఆడవాళ్లు అన్ని విభాగాల్లో పనిచేయలేరు. వారికి పురుషులతో సమానంగా శక్తి సామర్థ్యాలుండవు’ అని కుంటిసాకులు వెతుకుతుంటారు. ముఖ్యంగా ఆర్మీ, నేవీల్లాంటి దళాల్లో కొన్నేళ్లుగా ఈ వివిక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గతనెలలో ఆర్మీలో పురుషులతో పాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించాలని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు తాజాగా మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సైన్యంలో మాదిరిగానే నావికాదళంలోనూ మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో శారీరక లక్షణాలను సాకుగా చూపుతూ వారిని ఉన్నత అవకాశాలకు దూరం చేస్తున్న వారికి మరోసారి మొట్టికాయలు వేసింది.
శారీరక కారణాల సాకుతో వివక్ష!
సాయుధ దళాలకు సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలను ఎంపిక చేసుకుంటున్నా వారిని కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక ఇండియన్ నేవీలో మహిళలు 1992 నుంచే సేవలందిస్తున్నారు. అయితే ఆర్మీ, ఎయిర్ఫోర్స్ మాదిరిగా కాకుండా కేవలం మెడికల్, పారామెడికల్ లాంటి విభాగాలకే వారు పరిమితమయ్యారు. అయితే ఆ అతర్వాత నేవీలో కూడా క్రమక్రమంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మహిళలు ‘షార్ట్ సర్వీస్ కమిషన్ కేటగిరీ’ హోదాతో ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్), అబ్జర్వర్, లాజిస్టిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, పైలట్ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. అయితే ఉన్నత అవకాశాలు మాత్రం వారికి ఆమడదూరంలో ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా నేవీలోని కొన్ని విభాగాల్లో మహిళలను నియమించరాదని 2008లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సమాన అవకాశాలు కల్పించాల్సిందే!
ఇలా నేవీ అవకాశాలకు సంబంధించి మహిళలపై కొనసాగుతున్న వివక్షపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో తాజాగా విచారణకు వచ్చింది. దీనిని విచారించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీతో కూడిన ధర్మాసనం తీర్పునిస్తూ ‘ సాయుధ దళాల్లో లింగ సమానత్వం పాటించాల్సిందే. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాల్సిందే. ఈ విషయంలో వారి శారీరక కారణాలను సాకుగా చూపడం సరికాదు. నేవీలో మహిళా అధికారులు చూపిన ధైర్య సాహసాలు, త్యాగాలు మరువలేం. ఇప్పటికీ వారికి శాశ్వత కమిషన్ ఏర్పాటుచేయకపోతే వారికి అన్యాయం చేసినట్టే. ఈ అంశంపై మూడు నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. లింగ వివక్షను అధిగమించడంలో భాగంగా గతంలో చాలా సందర్భాల్లో మహిళలకు పలు అవకాశాలు కల్పించాం. నేవీలో మహిళల నియామకానికి సంబంధించి 2008లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చింది.
మైండ్సెట్ మార్చుకోండి..!
సైనిక దళాల్లో సమానావకాశాల నిరాకరణకు శరీర నిర్మాణం, మాతృత్వం వంటి అంశాలను విధాన నిర్ణేతలు, అధికారులు కారణాలుగా చెబుతున్నారని ధర్మాసనం వివరించింది. సైన్యంలోని మహిళలకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ గత నెలలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. సైనిక దళాల్లోని అతివలకు సమాన హోదా కల్పించాలంటే తొలుత ఆలోచనా తీరులో మార్పు రావాలని పేర్కొంది. నౌకాదళంలో సముద్ర విధులకు వెళ్లాక.. సైన్యం, వైమానిక దళం తరహాలో వెంటనే స్థావరానికి తిరిగి రావడానికి అవకాశం ఉండదని, అందువల్ల అలాంటి విధులు అతివలకు సరిపడవంటూ కేంద్రం చేసిన వాదనను కొట్టేసింది. శారీరక లక్షణాల రీత్యా పురుష అధికారులు కొన్ని రకాల విధులకు బాగా సరిపోతారన్న మూస ఆలోచనధోరణి ఆధారంగా ఇలాంటి వాదన చేస్తున్నారని ఆక్షేపించింది. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సాగరయానం చేయగలరని చెప్పింది. నౌకాదళంలో ఎక్కువగా రష్యా నుంచి సమకూర్చుకున్న యుద్ధనౌకలే ఉన్నాయని, వాటిలో మహిళల కోసం బాత్రూమ్లు లేవన్న వాదననూ తిరస్కరించింది. పురుష అధికారులతో కలిసి మహిళా అధికారులు కూడా పనిచేశారని తెలిపింది. పైగా 1999లో రక్షణ శాఖ.. నౌకాదళ ప్రధానాధికారికి జారీ చేసిన విధాన పత్రంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఈ వాదన ఉందని చెప్పింది. అన్ని విభాగాల మహిళా అధికారులు యుద్ధనౌకల్లో పనిచేసేలా ఉత్తర్వులివ్వాలని ఈ పత్రం చెబుతోందని గుర్తు చేసింది. నౌకాదళంలో పలువురు మహిళా అధికారులు సాధించిన విజయాలనూ ధర్మాసనం ప్రస్తావించింది.
ఈ తీర్పుతో కలిగే ప్రయోజనాలివే..!
ప్రస్తుతమున్న షార్ట్ సర్వీస్ కమిషన్ కేటగిరీ నియమాల ప్రకారం మహిళలు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే నేవీలో పనిచేయడానికి అవకాశముంటుంది. అదే పర్మనెంట్ కమిషన్ ఏర్పాటైతే వారు రిటైర్ అయ్యేంతవరకు దేశానికి సేవలందించవచ్చు. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. ఇక తాజా కోర్టు తీర్పు ప్రకారం ఎస్ఎస్సీ కేటగిరీలో కనీసం పదేళ్లు చేసిన మహిళా అధికారులందరూ శాశ్వత కమిషన్ హోదాకు అర్హత సాధిస్తారు. ఇక 2008కి ముందు విధుల్లో చేరి శాశ్వత కమిషన్ లేకపోవడంతో నష్టపోయిన వారందరూ కూడా పర్మనెంట్ కమిషన్ ప్రకారం పెన్షన్ సదుపాయం పొందుతారు.
ఇండియన్ నేవీలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలంటూ సుప్రీం వెలువరించిన తీర్పుపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా సాధికారతకు మరో ముందడుగు పడిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.