చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్నంతా కలవరపెడుతోంది కరోనా వైరస్ (కొవిడ్-19). ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఈ వ్యాధిని ‘మహమ్మారి’గా ప్రకటించింది. ఇక భారతదేశంలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ పలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇదేమీ ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న కేరళ వాసులను ఉదాహరణగా చూపిస్తూ ఊరట కలిగిస్తున్నారు. ఈ లిస్టులో తానూ ఉన్నానంటోంది 37 ఏళ్ల అమెరికన్ మహిళ. ఈ మహమ్మారి బారిన పడిన తాను పూర్తిగా కోలుకున్నానని చెబుతోందీ డేరింగ్ వుమన్. అంతేకాదు కరోనా భయంతో వణికిపోతున్న ప్రపంచానికి ఉపశమనం కలిగిస్తూ తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుందీ అమెరికన్ లేడీ.
మూడు వారాల్లోనే కోలుకుంది!
అమెరికాలోని సియాటెల్‌కు చెందిన ఎలిజబెత్ ష్నెయిడర్ ప్రస్తుతం ఓ కంపెనీలో మార్కెటింగ్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అమెరికాకు సంబంధించి అతి ఎక్కువ కరోనా మరణాలు సియాటెల్ నగరంలోనే నమోదు కావటం గమనార్హం. ఇక ఇదే నగరంలో నివసిస్తోన్న ఎలిజబెత్ కూడా ఫిబ్రవరి చివరి వారంలో కరోనా బారిన పడింది. అయితే వైద్యాధికారులు సూచించిన సలహాలతో పాటు కొన్ని స్వీయ జాగ్రత్తలు పాటించిన ఆమె.. ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంది. అంతేకాదు ప్రస్తుతం యథావిధిగా తన రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతోంది. ఈ క్రమంలో కరోనా బారిన పడి మూడు వారాలకే కోలుకున్న ఎలిజబెత్ వ్యాధి చికిత్సా సమయంలో తన అనుభవాలను ఫేస్బుక్ వేదికగా అందరితో షేర్ చేసుకుంది. మరి అందరినీ కలవరపెడుతున్న కరోనాను ఎలిజబెత్ ఎలా ఎదుర్కొందో ఆమె మాటల్లోనే విందాం రండి.
అందుకే మీ ముందుకొచ్చా!
‘హాయ్.. నా పేరు ఎలిజబెత్. నేనూ కొవిడ్-19 బాధితురాలినే. అయితే ప్రస్తుతం దీని నుంచి పూర్తిగా కోలుకున్నా. యథావిధిగా నా రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతున్నా. ఈ మహమ్మారికి సంబంధించి నా అనుభవాలను అందరితో పంచుకుంటే ప్రయోజనముంటుందని నా స్నేహితులు సూచించారు. అందుకే ఇలా మీ ముందుకొచ్చా. కరోనాపై వస్తున్న అపోహలు, దీని గురించి భయపడుతున్న వారికి నా మాటలు చాలా ఊరటనిస్తాయని ఆశిస్తున్నా..

సాధారణ ఫ్లూ జ్వరమనుకున్నా!
నాకు మొదటిసారిగా ఫిబ్రవరి 25న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అంతకంటే మూడు రోజుల ముందు ఓ చిన్న పార్టీకి హాజరయ్యాను. మొదట నాకు చాలా నీరసంగా అనిపించింది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు కూడా బాధించడంతో ఆఫీసుకు సెలవు పెట్టాను. అప్పటికే మీడియాలో కరోనా గురించి వార్తలు వస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యాధి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే నేను ఇది సాధారణ ఫ్లూ అనుకుని కొన్ని మందులు తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నా. అదే రోజు నాతో పాటు పార్టీలో పాల్గొన్న 40 శాతం మందికి కూడా ఇవే లక్షణాలు బయటపడ్డాయి. ఇక పార్టీకి హాజరైన నా స్నేహితుల్లో చాలామంది 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులే. నాకేమో 37 ఏళ్లు. మొదటి మూడురోజుల పాటు అందరికీ నీరసం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు లాంటి సాధారణ లక్షణాలే కనిపించాయి. ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, అతిసారం బాధించాయి.
వయసును బట్టి వ్యాధి తీవ్రత!
నా విషయానికొస్తే మొదట తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. మరుసటి రోజు అదే జ్వరం మళ్లీ 99.5 డిగ్రీలకు పడిపోయింది. అంతేకాదు ఒకరోజు వాంతులు కూడా అయ్యాయి. ఆ తర్వాత జ్వరం క్రమక్రమంగా తగ్గిపోతూ ముక్కుదిబ్బడ, గొంతునొప్పి మొదలయ్యాయి. మా స్నేహితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే తీవ్రమైన దగ్గు బాధించింది. మరికొందరికి ఛాతీ సమస్యలు, శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యాయి. నాకప్పుడు అర్థమైంది వయసును బట్టి కూడా ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత ఉంటాయని. అయితే నాతో పాటు చాలామందికి వూపిరి తీసుకోవడంలో ఇబ్బంది లేకపోవడంతో ఇది సాధారణ ఫ్లూ జ్వరమని అనుకున్నాం. ఈ నేపథ్యంలో ఫ్లూ జ్వరంపై పరిశోధన చేసే ‘సియాటెల్ ఫ్లూ స్టడీ’ సంస్థను సంప్రదించి నేను చెక్ చేయించుకున్నాను. ఆ సంస్థ సూచించినట్లుగా ఓ శ్వాస పరీక్షా కిట్‌లో నా వివరాలు, నమూనాలు వారికి పంపాను. వారు నా శాంపిల్స్‌ను కింగ్ కంట్రీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు పంపించారు. మార్చి7న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా శాంపిల్స్‌ను పరీక్షించిన పబ్లిక్ హెల్త్ అధికారులు నాకు కొవిడ్-19 వైరస్ సోకిందని షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఆస్పత్రికి కూడా వెళ్లలేదు!
కరోనా లక్షణాలు బయటపడిన వెంటనే బాధితులను 7 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ అధికారులు నాకు చెప్పారు. అయితే మార్చి 9 నాటికే నాకు వ్యాధి లక్షణాలు బయటపడి 13 రోజులు గడిచాయి. దీంతో నాకు ఎలాంటి ఐసోలేషన్ ట్రీట్మెంట్ అవసరం రాలేదు. కొవిడ్ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రి పాలు కావాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం కూడా ప్రజలందరినీ కరోనా అనుమానంతో అనవసరంగా బంధించాలని భావించదు. నా విషయానికొస్తే కరోనా దానంతంట అదే తగ్గిపోయింది. కనీసం చికిత్స కోసం నేను ఎలాంటి వైద్యుడిని సంప్రదించలేదు. ఇక వ్యాధి నిర్ధరణ అయ్యాక మూడు రోజుల పాటు అసలు బయటకు వెళ్లలేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యాను.
ఆ పొరపాటు చేయద్దు!
కరోనాకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోకపోవడం. ఇలాంటి లక్షణాలు బయటపడినప్పుడు సాధారణ జలుబు, దగ్గు అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దాని వల్ల మరింత మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదముంది. సియాటెల్ నగరంలో ఇన్ని కరోనా మరణాలు సంభవించాయంటే దానికి కారణం ఇదే అని నేను భావిస్తాను. ఇక్కడ కరోనాను అరికట్టేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మనకు ఈ వ్యాధి ఉందని తెలిసినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలి.

అలా అధిగమించా!
నాకు కూడా సైనస్ సమస్య ఉంది. ఈ మహమ్మారి సోకిన వారందరికీ శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవడం సహజం. అయితే నాకిలాంటి సమస్యలు ఎదురుకాకుండా స్వీయ జాగ్రత్తలతో పాటు కొన్ని మందులు కూడా తీసుకున్నా. ఈ వైరస్ నా వూపిరితిత్తులకు సోకకుండా నిరంతరం సుడాఫెడ్, ఆఫ్రిన్ నాసల్ స్ర్పే లాంటి ఔషధాలను తీసుకున్నాను. అయితే ఇదేమీ మెడికల్ టిప్ కాదు. శ్వాసకోశ సంబంధిత సమస్యలను అధిగమించేందుకు నేనేం చేశానో చెబుతున్నా అంతే.
ఆందోళన వద్దు!
ఇక చివరిగా నేను చెప్పేదేంటంటే దీని గురించి ఎవరూ ఆందోళన పడద్దు.. మీకు కరోనా ఉంది అంటే... ఉండనీయండి. దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. వైద్యులు సూచించిన ఔషధాలు తీసుకోండి. మీ ఆరోగ్య చిహ్నాలు మరీ ప్రమాదకరంగా ఉంటే తప్ప మీరు ఇంటివద్దనే ఉండవచ్చు. మంచి నీరు ఎక్కువగా తాగండి. పూర్తి విశ్రాంతి తీసుకోండి. చక్కగా మీకిష్టమైన టీవీ కార్యక్రమాలను చూడండి. నా మాటలు మీకందరికీ ఊరటనిస్తాయని ఆశిస్తున్నా..’ అని రాసుకొచ్చింది ఎలిజబెత్.
కరోనాకు సంబంధించి తన అనుభవాలను పంచుకుంటూ ఎలిజబెత్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు సుమారు 44వేల మంది నెటిజన్లు ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. అంతేకాదు చాలా ఉపయోగకరమైన సమాచారమిచ్చారంటూ దాదాపు 6వేల మంది కామెంట్లు పెట్టడం విశేషం.