అసలే ఇరుకు రోడ్లు, ఆపై లక్షలాది వాహనాలు, వీటికి తోడు దుమ్ము, ధూళి, పొగతో నిండుకున్న సిటీ రోడ్లపై నడిచి వెళ్లే పాదచారులకు అదొక పెద్ద ప్రహసనమని చెప్పవచ్చు. కనీసం నడిచి వెళ్లే దారి కూడా వారికి కనిపించదు. ఇక కొన్ని చోట్ల పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఫుట్‌పాత్‌లను కొందరు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే గమ్య స్థానానికి త్వరగా చేరుకునే క్రమంలో కొందరు ద్విచక్ర వాహనదారులు ఏకంగా ఫుట్‌పాత్‌ల పైనుంచే తమ బైక్‌లు పోనిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు లేరనో లేదంటే వారిని ఎవరూ గమనించట్లేదన్న ధీమాతోనో వారిలా నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌లపై విచ్చలవిడిగా బైక్‌లు నడుపుతుంటారు. పుణెలోని రోడ్లపై కూడా దాదాపు ఇదే పరిస్థితి. అయితే ఇటీవల ఆ నగరంలోని ఫుట్‌పాత్‌లపై బైక్‌లు నడుపుతున్న కొందరు వాహనదారులను ఓ మహిళ అడ్డుకుంది. అంతేకాదు సదరు వాహనదారులు ఫుట్‌పాత్ దిగి రోడ్డు మీదకు వచ్చేలా ‘క్లాస్ తీసుకుంది’ కూడా!

సరైన ‘దారి’కి తెచ్చింది!
ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని అందరికీ తెలుసు. అయితే ట్రాఫిక్ జామ్‌ల నుంచి తప్పించుకోవడానికో, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలన్న తాపత్రయమో.. కొందరు బైకర్లు ఫుట్‌పాత్‌లపై కూడా బైక్‌లు పోనిస్తుంటారు. అలా వేగంగా వాహనాలు నడుపుతూ కొన్నిసార్లు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న పాదచారులను కూడా ఢీకొడుతుంటారు. ఇటీవల పుణెలో కూడా అలా వెళ్లాలనుకున్న వాహనదారులకు తనదైన శైలిలో బుద్ధి చెప్పింది గోఖలే అనే టీచర్. క్లాస్‌లో పాఠాలు చెబుతూ విద్యార్థులను సరైన దారిలో నడిపించే ఆమె ‘దారి’ తప్పిన వాహనదారులకు కూడా అలాగే ‘క్లాస్’ తీసుకుంది. రోడ్లపైనే బైక్‌లు నడపాలని పాఠాలు చెప్పింది. దీంతో సదరు వాహనదారుడు దారి కొచ్చాడు. ఫుట్‌పాత్ పై నుంచి వెంటనే బైక్‌తో సహా రోడ్డు మీదకు దిగాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు ఆమెకు జత కలిశారు. ఈ ముగ్గురూ కొద్ది సేపు అక్కడే ఉండి ఎవరూ ఫుట్‌పాత్‌పై బైక్ నడపకుండా అడ్డుగా నిల్చున్నారు. ఈ తతంగం మొత్తాన్నీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఆమె చాలామందికి ఆదర్శం!
దారి తప్పిన వాహనదారులకు ‘క్లాస్’ తీసుకుని సరైన దారిలోకి తీసుకొచ్చిన గోఖలేకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సామాజిక స్పృహతో ఆమె చేసిన పనికి నెట్ ప్రియులు కూడా ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ‘రోడ్స్ ఆఫ్ ముంబై’ కూడా తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ‘పుణెకు చెందిన ఈ మహిళ చాలామందికి ఆదర్శం. వెల్డన్ మేడమ్. కానీ కొందరు బైకర్లు ఇలా ఫుట్‌పాత్‌ల పైకి రావడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి వారి కారణంగా సీనియర్ సిటిజన్స్ కూడా ట్రాఫిక్ పోలీసుల నిర్వహణ బాధ్యతలను మోయాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరం’ అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఆంటీల దినోత్సవం ఏర్పాటు చేయాలి!
ఇలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కూడా చేరింది. ఇక సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన తనకు నచ్చిన అంశాలతో పాటు ఆలోచింపజేసే కథనాలను కూడా ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు. ఈక్రమంలో గోఖలేకు సంబంధించిన ఈ వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘ఇప్పుడే ఈ వీడియో చూశాను. వెంటనే నేను ఇలాంటి మహిళలందరికీ అభిమానిగా మారిపోయా. ఆమె తెగువకు మనం మరింత బలం ఇవ్వాలి. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కచ్చితంగా ఆమెను ఘనంగా సత్కరించాలి. లేకపోతే విడిగా అంతర్జాతీయ ఆంటీల దినోత్సవం ఏర్పాటు చేయాలి. ఇలాంటి మహిళల కారణంగానే ఈ ప్రపంచం ఇంకా ఎంతో భద్రంగా ఉంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారీ బిజినెస్ దిగ్గజం.
మేడమ్! ఒకసారి మా నగరానికి కూడా రండి!
ఇక ఇప్పటికే నెటిజన్ల మనసు దోచుకున్న ఈ వీడియోను తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా షేర్ చేయడంతో అది మరింత వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె బాగా బుద్ధి చెప్పింది’, ‘గాడ్ బ్లెస్ యూ మేడమ్’, ‘మీరు చాలామందికి ఆదర్శం’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక హైదరాబాద్, దిల్లీ, ముంబైకు చెందిన నెటిజన్లయితే ‘మేడమ్! మీరు ఒకసారి మా నగరానికి రండి’ అంటూ ఫుట్‌పాత్‌పై వెళుతున్న వాహనాల ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన ఆమె స్టూడెంట్స్ కూడా ‘ఆమె మా స్కూల్ టీచర్. మాకు ఇంగ్లిష్ పాఠాలు చెబుతారు. ఆమెను చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ అని కామెంట్లు పెట్టడం విశేషం.
Photos: Screengrab