విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన మన దేశంలో అత్యంత వివాదాస్పదమైన సాంస్కృతిక క్రీడ జల్లికట్టు. మగవారి ధైర్యసాహసాలకు ప్రతీకగా తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే ! అయితే స్త్రీలకూ ఓ జల్లికట్టు ఉందనే విషయం మీకు తెలుసా ? ఇదీ తమిళనాడులోనే జరుగుతుందని ఎప్పుడైనా విన్నారా ? తెలీదంటే ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిందే ! ఎందుకంటే మగవారి జల్లికట్టులో ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ఉంటే స్త్రీల జల్లికట్టులో ‘ఫన్’ మాత్రమే ఉంటుంది. అది కూడా.. ఎదురుగా వస్తే కుమ్మిపడేసే ఎద్దులతో కాదు.. కోళ్లతో ! ఆశ్చర్యంగా ఉంది కదూ ! మరీ ఫన్నీ కథేంటో తెలుసుకుందాం రండి !
సరదా మగవారికేనా... ?
గతంలో ఓ బైక్కు సంబంధించి ఓ టీవీ యాడ్ వచ్చేది ! అందులో నటి ‘వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ది ఫన్’ అంటుంది. అంటే.. సరదా అంతా మగవారికేనా ? అని ప్రశ్నిస్తుందన్న మాట ! ఆ యాడ్ సంగతి పక్కన పెడితే పొంగల్ వాతావరణం చూస్తే చాలామంది అమ్మాయిలు అడిగే ప్రశ్న ఇదే ! గాలి పటాలు ఎగరేయడం సహా కోళ్ల పందాల దగ్గర నుంచి జల్లికట్టు వరకు సరదా అంతా మగవారిదేనా అన్నట్లు పొంగల్ సాగుతుంది. ఈక్రమంలో ఇంట్లోని స్త్రీలంతా అలంకరణకు, పిండి వంటకాలు చేయడానికి పరిమితమైపోతుంటారు. మరి వారికి మాత్రం సరదా ఉండకూడదా ? అని ప్రశ్నించుకున్నారు తమిళనాడులోని తిరుచెంగోడ్ గ్రామ ప్రజలు. అందుకే తమ ఊరి ఆడపడుచుల కోసం అయిదేళ్ల క్రితం ఓ వినూత్న పోటీకి తెరలేపారు. అదే కోళ్లతో జల్లికట్టు ఆడటం ! అంటే.. ఎద్దును తరిమినట్టు ఈ జల్లికట్టులో కోళ్లను తరుముతారా ఏంటి ? అని అడుగుతారేమో ! ఇందులో ధైర్య సాహసాల ప్రదర్శనేమీ ఉండదు. కొంచెం తెలివి ! మరికొంచెం ఫన్ ఉంటాయంతే !
ఇలా ఆడతారు !
ఈ ఆటలో ఒక్కొక్కరే పాల్గొనాల్సి ఉంటుంది. బృందాలు ఉండవు. ముందుగా ఓ సర్కిల్ని గీస్తారు. తర్వాత పోటీలో పాల్గొనే మహిళ కళ్లకు గంతలు కట్టి ఆమెను సర్కిల్లో నిలబెడతారు. ఆ తర్వాత ఓ కోడిని తీసుకొచ్చి చిన్న తాడుతో ఆమె కాలికి ఆ కోడిని కట్టేస్తారు. ఇప్పుడు కొంత సమయాన్ని నిర్దేశించి, కోడితో పాటు ఆమె కూడా సర్కిల్ దాటకుండా ఆమెను ఆ కోడిని పట్టుకోమంటారు. అలా ఎవరైతే తక్కువ సమయంలో గీత దాటకుండా కోడిని పట్టుకుంటారో వారే విజేత ! ఈ ఆటకు వారు పెట్టుకున్న పేరు ‘నవీన జల్లికట్టు’. పురుషుల జల్లికట్టులోలా హింసకు తావు లేకుండా తెలివికి నిదర్శనంగా ఈ పోటీ సాగుతుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాదు ఈ ఆటలో గెలిచే వారికి మంచి మంచి బహుమతులు కూడా ఇస్తామంటున్నారు నిర్వాహకులు. పొంగల్ సమయంలో మగవారికి కోడి పందాలు, జల్లికట్టు ఎంత సాధారణమో ఈ ఊరి స్త్రీలకు ఈ ఆట కూడా అంతే కామన్ ! అందుకే ఈ ఊరి నుంచి వెళ్లి ఎక్కడ స్థిరపడ్డా, ఈ పోటీల సమయానికి మాత్రం ఊరు చేరుకొని మరీ పోటీలో పాల్గొంటుంటారు మహిళలు.
అక్కడ ‘చికెన్ క్యాచింగ్ కాంపిటీషన్’ !
ఇలా కోళ్లతో మహిళలకు పోటీ నిర్వహించడం తమిళనాడులోనే కాదు నాగాల్యాండ్లోనూ ఉంది. దాని పేరు ‘చికెన్ క్యాచింగ్ కాంపిటీషన్’. ఇందులో ఓ వైపు కోడిని నిల్చోబెట్టి మరోవైపు మహిళలందరూ నిల్చుంటారు. రన్నింగ్ రేస్లోలా విజిల్ ఊదగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కోడిని పట్టుకోవాలి. ఎవరు ముందు పట్టుకుంటే వారే విజేత. ఆ కోడి కూడా వారిదే అన్నమాట ! నాగాల్యాండ్లో ఉన్న చాలా సాంస్కృతిక క్రీడల్లో ఇదీ ఒకటి. ఈ ఆటను పురుషులు కూడా ఆడుతుంటారు.
ధైర్యం మగవారి సొత్తు కాదు !
జల్లికట్టు ఆటను తమ పౌరుషానికి ప్రతీకగా భావిస్తుంటారు పురుషులు. అయితే ఎద్దును చూడగానే వారి మదిలో భయాన్ని కలిగించేలా ఎద్దులకు శిక్షణ ఇవ్వడం వెనుక కొంతమంది స్త్రీల హస్తం కూడా ఉందని మీకు తెలుసా ? వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మధురైకి చెందిన సెల్వరాణి అనే మహిళ గురించి. ఆమె వయసు 51 ఏళ్లు. కానీ చాలామంది మగవారు చూస్తేనే భయపడేలా ఎద్దుకి శిక్షణ ఇవ్వడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం ఆమె రాము, తొట్టుచ్చి అనే రెండు ఎద్దులకు శిక్షణ ఇస్తోంది. తొట్టుచ్చి మూడేళ్ల నుంచే పోటీల్లో పాల్గొంటుండగా, రాము దాదాపు 50 పోటీల్లో పాల్గొంది. పలు పోటీల్లో ఎవరికీ చిక్కకుండా విజేతగా కూడా నిలిచింది. చిన్నతనం నుంచే ఇలా ఎద్దులను పెంచడం అలవాటు చేసుకున్నానంటున్న సెల్వరాణి వాటిని చూస్తే తనకు భయం కాదు ప్రేమ కలుగుతుందని అంటోంది.
Photo: Screengrab