సాధారణంగా మార్కెట్‌కు వెళ్లాలంటేనే కాలి నడక బదులు బండి మీద వెళ్తే బావుంటుంది అనుకుంటాం. అటువంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1900 కిలోమీటర్లు కాలి నడక ప్రయాణానికి సిద్ధమయ్యారు ఆరుగురు మహిళలు. మహిళలంటే అలాంటి ఇలాంటి వారు కాదు. నిరంతరం నిప్పుతో చెలగాటం ఆడే ఫైర్ ఫైటర్స్. అది కూడా అలాంటి ఇలాంటి ప్రాంతంలో కాదు. ఎముకలు కొరికే చలి ఉండే అంటార్కిటికా మంచు పర్వతాల్లో ! అదీ ఒకరోజో పది రోజులో కాదు 70 రోజుల పాటు. ఇంతకీ వారెందుకు ఈ యాత్రకు సన్నద్ధమయ్యారో తెలుసా ?

ఆ ఉదంతాలకు చలించిపోయి.. !
అగ్నిమాపక దళంలో పని చేయడం ఎంతో సాహసంతో కూడిన పని. ఇప్పటివరకు ఈ రంగంలో పురుషులే ఎక్కువ శాతం ఉండగా ఇప్పుడిప్పుడే మహిళలు కూడా తాము పురుషులకేమీ తక్కువ కాదని ఫైర్ ఫైటర్స్‌గా రాణిస్తున్నారు. ఇలా తనతో పాటు మరో అయిదుగురు మహిళలతో అంటార్కిటికా ఫైర్ ఫైటర్స్ అనే బృందాన్ని ఏర్పాటు చేసి, ఎంతోమంది జీవితాలను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుతోంది ఇంగ్లండ్‌కు చెందిన నకితా రాస్ అనే మహిళ. మనం చేసే ప్రతి పనిలో ఆడ, మగ అన్న తేడాలు చూడకూడదనే వారిలో నకితా ఒకరు. అయితే మొదట్లో ఫైర్ ఫైటర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మంటల్లో కాలిపోయిన వారిని చూసి నకితా చలించిపోయిందట. అవొక హృదయవిదారక సందర్భాలని తెలుపుతూ తనలాంటి చాలామంది ఫైర్ ఫైటర్స్ ఇలాంటి ఉదంతాల వల్ల మానసిక సమస్యలకు కూడా గురయ్యారని చెబుతోంది. ఇలా తాను కూడా మానసిక ఒత్తిడికి గురై అటు కుటుంబంతో ఇటు స్నేహితులతో పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
అప్పుడు పుట్టిందే ఈ ఆలోచన !
ఇదే సమయంలో ఎవరైనా అమ్మాయి ఫైర్ ఫైటర్‌గా రాణించాలనుకుంటున్నట్లు చెబితే వారికి ఏమని సమాధానం చెప్పాలో నకితకు అర్థం కాలేదట. అందుకే అటువంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఈ రంగంలో మానసిక ఒత్తిళ్లు ఎలా ఉంటాయి ? వాటిని ఏరకంగా అధిగమించవచ్చో ప్రపంచానికి తెలిసేలా ఏదైనా సరికొత్తగా చేయాలని భావించారామె. ఈక్రమంలో తన బృందంతో కలిసి అంటార్కిటికా ఖండాన్ని దాటాలనే ఆలోచన వచ్చిందామెకు. ఇదే ఆలోచనను ట్రెక్కింగ్ చేసే తన బృందంతో పంచుకోగా వారు కూడా సంతోషంగా ఓకే అనడంతో ఈ ‘ఫస్ట్ ఆల్ ఫీమేల్ అంటార్కిటికా క్రాసింగ్’కి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిధులు సమీకరించడం మొదలుపెట్టిన నకితా బృందం 2023లో ఈ యాత్రను చేయనుంది. సౌత్ వేల్స్‌కు చెందిన ఇద్దరు మహిళా ఫైర్ ఫైటర్స్, లండన్‌కు చెందిన మరో ముగ్గురు మహిళా ఫైర్ ఫైటర్స్‌తో కలిసి తాను చేయబోయే ఈ యాత్రతో నకితా చెప్పబోయే సందేశం ఒక్కటే..
‘‘అభిమానించే స్నేహితులు అండగా ఉండి మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒక పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా సాధించగలం.. ఒత్తిడినీ అధిగమించగలం. మేమంతా అంటార్కిటికాలో 1900 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయబోతున్నాం. టెంట్, ఆహారం, ఇంకా మాకు కావాల్సిన వస్తువులన్నీ మాతో పాటే తీసుకెళ్లబోతున్నాం..’’ అంటూ తమ ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది నకిత. అంతేకాదు, ‘మేము చూడ్డానికే సాధారణంగా కనిపిస్తాం కానీ మేము సాధించే ఫలితాలు అసాధారణం’ అంటోంది ఈ డైనమిక్ ఫైర్ ఫైటర్. మరి ఈ బృందం చేయబోయే యాత్ర విజయవంతమై మరింత మంది స్త్రీలకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం... !
Image credits: https://twitter.com/antarctic_fire/media