అతని పేరు బాలక్రిష్ణ. వయసు 55 ఏళ్లు. ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండడు. అంతేనా.. తనకు అవసరమైనప్పుడు దోపిడీలు చేస్తాడు. అడ్డొచ్చిన వారిని చంపేస్తాడు. పట్టుకుందామంటే అధ: పాతాళానికి వెళ్లినా దొరకడు. గత మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అటువంటి దుర్మార్గుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ! తనకు తెలిసిన వారిని సంబంధాలు చూసిపెట్టమన్నాడు. బెదిరిస్తే తప్ప ఏ అమ్మాయైనా అందుకు సిద్ధపడదని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ అమ్మాయి తాను బాలక్రిష్ణను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చింది. ఆమె పేరు రాధ. వయసు 30ఏళ్లు ! తండ్రి వయసున్న అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇదెక్కడి విడ్డూరం..! అనుకోకండి. అందుకు ఓ కారణం ఉంది.

వినాశకాలే విపరీత బుద్ధి !
ఎంతవారలైనా కాంత దాసులే ! అని ఊరికే అనలేదు. ఈక్రమంలో మహిళ తలచుకోవాలే గానీ మహా మహా ఋషుల ధ్యాస మరల్చడమే కాదు మొండి నేరస్తులు పాతాళంలో దాగున్నా బయటకు తీసుకురాగలదని నిరూపించింది ఓ మహిళా పోలీస్. మూడేళ్లుగా మధ్యప్రదేశ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు కరడుగట్టిన దోపిడీ దొంగ బాలక్రిష్ణ చౌబే. ఎక్కడుంటాడో తెలియదు. ఎటువైపు నుంచి వస్తాడో అర్థం కాదు. మధ్యప్రదేశ్‌లోని ఛతార్పుర్ నుంచి ఖజురహో ప్రాంతంలో గ్రామస్తులను దోచుకుంటూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ, ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. దీంతో అతడిని పట్టుకోవడానికి పోలీసులు పదివేల రూపాయల నజరానా కూడా ప్రకటించారు. అయినా అది పారకపోవడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. ఈ సమయంలో చౌబేకి వచ్చిన ఓ వింత ఆలోచన వారికి ప్లస్సయింది.

ఆపదున్నా ధైర్యం చేసింది !
చేసేదేమో నేరం. పైగా 55 ఏళ్ల వయసు. ఈ సమయంలో తనకో భార్య కావాలనుకున్నాడు చౌబే. తనకు తెలిసిన వారితో వధువును చూసిపెట్టమన్నాడు. ఆ విషయం పోలీసులకు తెలిసింది. ఏంచేయాలా అని ఆలోచిస్తు్న్న తరుణంలో సబ్ ఇన్స్పెక్టర్ మాధవీ అగ్నిహోత్రి తాను పెళ్లి కూతురిగా వెళతానని తెలిపింది. మొదట పోలీసులు రిస్క్ తీసుకుంటున్నావని ఆమెతో అన్నారు. అయినా ఫర్వాలేదంది. దీంతో ఒక టీమ్‌ను తయారు చేసి మాధవికి దిల్లీలో కూలీ పని చేసే రాధ పేరు మీద ఓ కొత్త సిమ్ ఇప్పించారు అధికారులు. చౌబేకు ఫోన్ చేసి మాధవి తనను తాను రాధగా పరిచయం చేసుకొంది. పొరబాటున మరొకరికి ఫోన్ చేయబోయి అతడికి ఫోన్ చేసినట్లు మాట కలిపింది. మొదట రాధ ఫోన్ నంబర్ గురించి వాకబు చేసిన చౌబే ఆమె దిల్లీలో కూలీ పనిచేసే రాధనే అని నిర్ధరించుకున్నాడు. ఇక అక్కడి నుంచి రాధకు పని సులువైంది. వారం పాటు అతడితో మాట-మాట కలిపి చౌబే పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో ఓకే అనేసింది. తనను చూడాలనుకుంటే ఉత్తరప్రదేశ్‌లోని బిజోరీ గ్రామానికి రావాలని కోరింది.

రాధా ఆగయీ... అంది ! వచ్చి పట్టేసుకున్నారు !
బిజోరీ గ్రామానికి తన టీమ్‌తో వెళ్లిన మాధవి తాను చౌబేను కలిసిన తర్వాత ‘రాధా ఆగయీ’ అనే సిగ్నల్ ఇస్తానని తెలిపింది. చౌబే ఎప్పుడూ తన వద్ద నాటు తుపాకీ ఉంచుకుంటాడు. ఏమాత్రం తేడా వచ్చినా మాధవి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయినా సమయస్ఫూర్తితో వ్యవహరించి సిగ్నల్ ఇవ్వగానే అతడు తుపాకీ తీసేలోపు పోలీసులు వచ్చి చౌబేను పట్టేసుకున్నారు. అతడిపై ఇప్పుడు ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే ఇక అతడు జైలు నుంచి బయటకు రావడం కలే. మాధవి ప్రదర్శించిన తెగువకు స్థానిక ప్రజలతో పాటు పోలీసు అధికారులు కూడా శెభాష్ అంటున్నారు.