అబ్బాయిది మన కులం కాదు.. ఎందుకమ్మా ఈ ప్రేమా గీమా.. మన కుటుంబం పరువు, మర్యాద ఏం కావాలి?.. ఇవి తాను ప్రేమించిన అబ్బాయి గురించి ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఎదుర్కొన్న ప్రశ్నలు.. మరి ఆ అమ్మాయి వాటికి సమాధానం చెప్పగలిగిందా? తన ప్రేమను నిలబెట్టుకుందా? వీటికి సమాధానాలు ఆమె మాటల్లోనే..
నా పేరు రంజని. అమలాపురం దగ్గర్లోని ఓ పల్లెటూరు మాది. అమ్మానాన్నలిద్దరూ పరువు ప్రతిష్ఠలకి ఎంతో విలువనిస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు, చదువు ఈ రెండే లోకం. ఆడుకోవడానికి కూడా పక్కింటికి వెళ్లేదాన్ని కాదు. ఒంటరిగానే ఆడుకొనేదాన్ని. అలా ఒంటరితనం అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలను కూడా పూర్తిగా బయటపెట్టేదాన్ని కాదు. నాకేమీ తెలియదని అనేవారంతా. అలా అనుకోవడమే మంచిదని భావించి నేను కూడా దాన్ని అలాగే కొనసాగిస్తూనే వచ్చాను. అందుకేనేమో.. మొదటిసారి నేను నా ప్రేమ గురించి ఇంట్లో చెప్పగానే ఒక్కసారిగా అమ్మానాన్నలిద్దరూ షాక్ తిన్నారు.

చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. అక్కడ నాతో పాటు మరికొంత మంది చేరారు. అందరికీ ఒకే చోట శిక్షణ ఇచ్చేవారు. వృత్తిపరంగా రాటుదేలడానికి మమ్మల్ని వివిధ ప్రాంతాలకు పంపేవారు. అలా ఒకసారి నేను, చరణ్ చెన్నైకి వెళ్లాం. అక్కడ పదిహేను రోజుల పాటు శిక్షణ తీసుకున్నాం. ఆరు నెలలుగా ఒకే చోట ఉన్నా ఇద్దరికీ ముఖపరిచయం తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు. ఈ పదిహేను రోజుల కాలంలో ఇద్దరమూ మంచి స్నేహితులమయ్యాం. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మా మధ్య మాటల ప్రవాహం పెరిగింది. అప్పుడప్పుడూ బయటకు కూడా వెళ్లేవాళ్లం. అలా మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
అది ప్రేమో, ఆకర్షణో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రేమకు మరో నాలుగు నెలల గడువు పెట్టుకున్నాం. ఈ నాలుగు నెలల్లో మా ప్రేమ గురించి, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మాకు ఒక స్పష్టత వస్తుందని భావించాం. కానీ అనుకోకుండా నాకు పెళ్లి సంబంధం రావడంతో పదిహేను రోజులు తిరక్కుండానే మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పాల్సి వచ్చింది. మొదటి సారి మా ప్రేమ గురించి తెలిసిందంటే అది మా ఇద్దరి తల్లిదండ్రులకే. చరణ్ వాళ్ల అమ్మానాన్నలకి నేను ఓకే. వాళ్లు మా ప్రేమని అంగీకరించారు. మా ఇంట్లోనే సమస్య. ఎందుకంటే చరణ్ వాళ్లదీ, మాది ఒక కులం కాదు.

నా ప్రేమ గురించి చెప్పగానే నాపై విరుచుకుపడ్డారు అమ్మానాన్న. ఆ రోజు నాపైన తిట్ల వర్షం కురిసింది. ఇప్పటి వరకు వెలగబెట్టింది చాలు ఇక ఇంట్లో కూర్చోమన్నారు. ఉద్యోగం మానెయ్.. నీకు పెళ్లి చేసేస్తామన్నారు. కానీ నా భవిష్యత్తు గురించి నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. నమ్మకం కూడా ఉంది. కానీ నాన్న 'నాకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి' అనే సరికి బాగా ఏడుపొచ్చింది. వాళ్లని ఎదిరించి నా దారి నేను చూసుకోవడానికి ఇది సినిమా కాదు. అందుకే వాళ్లకి నచ్చచెప్పాలని ప్రయత్నించా. వీలు దొరికినప్పుడల్లా చరణ్ గురించి, వాళ్ల కుటుంబం గురించి చెప్పేదాన్ని. అది విని మాతో చెప్పకుండానే పెళ్లి కుదుర్చుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. నా నోట సమాధానం లేదు. నా ప్రయత్నం వ్యర్థమైందని భావించా. కానీ చరణ్ నాకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. ఇక ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకున్నా.
అందుకే అమ్మానాన్నలిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను. అసలెందుకు వాళ్లు నా ప్రేమని అంగీకరించడం లేదో సరైన కారణం చెప్పమన్నాను. అన్నింటికీ ఒకటే సమాధానం ఇద్దరి కులం ఒకటి కాదు.. మా కూతుర్ని వేరే కులం వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మా పరువు గంగలో కలిసిపోతుందన్నారు. మళ్లీ మళ్లీ ఈ మాటే వినాల్సి రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ వీలైనంత వరకు నచ్చచెప్పాలనే ప్రయత్నించా. చరణ్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. కానీ వాళ్ల సమస్య కులం ఒక్కటే. ఆ విషయంలో వాళ్లని నేను కన్విన్స్ చేయలేకపోయాను.
ఆ తర్వాత అమ్మానాన్నలిద్దరూ ఏం ఆలోచించుకున్నారో ఏమో.. మా ఇద్దరికీ రెండు సంవత్సరాల గడువు పెట్టారు. అప్పటికీ చరణ్ నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటే నిరభ్యంతరంగా మా పెళ్లి చేస్తామన్నారు. అక్కడి వరకూ హ్యాపీ. మరి అన్ని రోజులూ నేను ఇంట్లోనే ఉండలేను కదా..! అందుకే మళ్లీ హైదరాబాద్ బయల్దేరా.. రోజూ ఆఫీసుకి వెళుతున్నాను. ఇప్పటికి రెండు నెలలు మాత్రమే అయింది. రెండేళ్ల సమయం ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను.
- ఇట్లు
రంజని