మాస్కులు, సామాజిక దూరం, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు.. ఇవన్నీ గాలికొదిలేసి ప్రస్తుతం కరోనా మన మధ్య లేదన్నట్లే మసలుకుంటున్నారు చాలామంది! ఇక పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఊళ్లకు వెళ్లడం, వేడుకలు-పార్టీల్లో గుంపులుగా పాల్గొనడం మామూలైపోయింది. ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ల వాలకం చూస్తుంటే ‘ఇంకెక్కడి కరోనా.. మనలో ఉన్న ఇమ్యూనిటీని తట్టుకోలేక ఎప్పుడో చైనా పారిపోయింది’ అనేలా ఉంది.
కానీ అదే మహమ్మారి తనను రెండు నెలలుగా ఇబ్బంది పెడుతోందంటోంది పాట్నాకు చెందిన ప్రత్యూషా ముఖర్జీ. కరోనా లేదనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వాళ్లందరినీ అలర్ట్ చేయడానికి తన కొవిడ్ స్టోరీని పంచుకోవడానికి మన ముందుకొచ్చింది. వ్యాక్సిన్ వచ్చినా అది మన దాకా రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటిదాకానైనా కనీస జాగ్రత్తలు పాటించాలంటూ అందరినీ వేడుకుంటూ తన కొవిడ్ అనుభవాలను ఇలా నెమరువేసుకుంది.
ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు వివిధ దేశాల్లో కొత్తగా రూపు దాల్చుతున్న కొవిడ్.. ఇలా ఈ వైరస్ గురించి సందిగ్ధం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఈ వైరస్ ఎప్పుడు సమూలంగా అంతమవుతుంది? మారుతున్న వైరస్‌పై వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందా? మరి, వ్యాక్సిన్ వేసుకుంటే దుష్ప్రభావాలేమైనా వస్తే? ఇలా అందరి మనసుల్లో జవాబులు లేని ప్రశ్నలెన్నో! ఇలా ఇంతటి ప్రతికూల పరిస్థితులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారి వల్ల వారికి, వాళ్ల కుటుంబానికి, చుట్టూ ఉన్న వారందరికీ ప్రమాదమే! నేనూ అలాంటి ప్రమాదంలోనే ఇరుక్కున్నా.

లండన్‌లో మాస్టర్స్ చదువుతోన్న నేను గతేడాది ఆగస్టులో ఇండియాకు తిరిగొచ్చా. అయితే అప్పటికి అక్కడ స్ట్రెయిన్ ఊసే లేదు. కానీ ఇక్కడ మాత్రం కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో ఎందుకైనా మంచిదని రెండు వారాల పాటు ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నా. కొవిడ్ పరీక్ష కూడా చేయించుకున్నా.. నెగెటివ్ వచ్చింది. నేను ముందు నుంచీ ఆరోగ్యంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతుంటా. నాలో ఇమ్యూనిటీ స్థాయులు కాస్త తక్కువగా ఉండడం కూడా ఇందుకు ఓ కారణం. ఏదేమైనా ఇక్కడికొచ్చాక కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టా. అయితే ఒకరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మా అక్క కొడుకు పుట్టినరోజు పార్టీకి వెళ్లాం. వాళ్లు కూడా కేవలం ఇంట్లో వాళ్లనే పార్టీకి పిలిచారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు, పరిశుభ్రమైన భోజనం.. ఇలా ప్రతి విషయంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా సరైన నాణ్యతా ప్రమాణాల్ని పాటించారు. కాబట్టి వైరస్ విస్తరించే ప్రమాదమే ఉండదు కదా.. అనుకున్నా..!
******
ఆ తర్వాత మూడు నాలుగు రోజులకు నెమ్మదిగా దగ్గు ప్రారంభమైంది. వాతావరణంలో కాస్త మార్పులొస్తే చాలు.. నాకు దగ్గు, జలుబు పిలవకుండానే వచ్చేస్తాయి. అలాంటిది పార్టీకి వెళ్లాను కదా.. అక్కడ తీసుకున్న ఆహారం ప్రభావమేమో అనుకున్నా..! ఇక మరుసటి రోజుకి దగ్గు మరింతగా పెరగడమే కాదు.. జలుబు, జ్వరం, నీరసం కూడా మొదలయ్యాయి. అసలే నాకు రోగనిరోధక శక్తి తక్కువ.. అందుకే ఇలా అవుతుందేమో అనుకున్నా కానీ.. ఇవి కరోనా లక్షణాలు అన్న ఆలోచనే నాకు రాలేదు. ఇక విపరీతమైన అలసటతోనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఫలితం తెలిసి ఒక్కసారి షాకయ్యా! కారణం.. నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇంత జాగ్రత్తగా ఉన్నా నాకు వైరస్ ఎలా సోకిందో అసలు అర్థం కాలేదు. పోనీ పార్టీకి వెళ్లాను కదా అక్కడ ఎవరికైనా ఉండి ఉంటుందనుకున్నా.. ఎవరి దగ్గర్నుంచి కంప్లైంట్స్ రాలేదు. అయితే నాకు పాజిటివ్ అని తెలిశాక మా ఇంట్లో వాళ్లు కూడా పరీక్షలు చేయించుకున్నారు. దేవుడి దయ వల్ల వాళ్లందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా.

డాక్టర్ నా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉండమని సలహా ఇచ్చారు. జ్వరం, జలుబు, దగ్గు తగ్గడానికి మందులు కూడా రాసిచ్చారు. అయితే ఆ మందులు వేసుకోవడం వల్ల అసలు సమస్యలు తగ్గుముఖం పట్టినా పలు కొత్త అనారోగ్యాలు నన్ను చుట్టుముట్టాయి. పాదాల్లో వాపు, శరీరమంతా నీరు పట్టి బరువుగా అనిపించేది. ఒళ్లు నొప్పులు వేధించేవి. దీంతో కనీసం లేచి నా పనులు నేను చేసుకోలేకపోయేదాన్ని. వారం రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే రుమటాలజిస్ట్ని సంప్రదించమని సలహా ఇచ్చారు. అప్పుడర్థమైంది రియాక్టివ్ ఆర్థ్రైటిస్ వల్లే ఇలా జరుగుతుందని! ఈ అనారోగ్యం కారణంగా నా జుట్టు విపరీతంగా రాలడం మొదలైంది. అయితే ఈ క్రమంలో నా శరీరమంతా వచ్చిన వాపును తగ్గించుకోవడానికి యాంటీబయోటిక్స్ వాడుతూనే.. కరోనా నుంచి కోలుకోవడానికి వైద్యులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ పాటించాను. ఆవిరి పట్టడం, ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం, కాసేపు యోగా-ధ్యానం చేయడం, చక్కటి పోషకాహారం తీసుకోవడం.. వంటివి చేశాను. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం తిరిగి నా చేతుల్లోకి వస్తోంది.
******
ఇదిలా ఉంటే అసలు నాకు కరోనా ఎలా సోకిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి కదా.. ఇక దాని కథ ముగిసినట్లే అనుకోవడానికి వీల్లేదు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారిపై అది ప్రభావం చూపకపోయినా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే నాలాంటి వారికి ఈ వైరస్ తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించండి. అందుకోసం ఆహారం దగ్గర్నుంచి వ్యాయామాల దాకా బోలెడన్ని మార్గాలున్నాయి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోండి.. మాస్కులు, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత.. ఇవి మాత్రం మర్చిపోవద్దు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు ఇవే మనకు రక్షణ కవచాలు..! ఆ మాటకొస్తే టీకా తీసుకున్నా సరే.. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.. గుర్తు పెట్టుకోండి!