సమాజంలోని కొన్ని పద్ధతులని ఎప్పటికీ మార్చలేమనేది వాస్తవం. చాలామంది ఇప్పుడు కొడుకు, కూతురు సమానమే అంటుంటారు. కానీ కూతురు పుట్టినప్పటికంటే కొడుకు పుట్టినప్పటి సంతోషం ఎక్కువుంటోంది. ఎందుకు ? కొడుకు మాత్రమే వృద్ధాప్యంలో తోడుంటాడనా ? లేక తలకొరివి పెట్టి పున్నామ నరకాన్ని తప్పిస్తాడనా ? ఈ సమాజంలో తల్లీకూతుళ్ల బంధమంటే పెళ్లి వరకే తల్లితో ఉండే స్నేహమా ? ఇలా ప్రశ్నలు సంధిస్తోంది ఎవరో కాదు, కాకినాడలో ఉండే శిరీష. ఎందుకో ఆమె హృదయరాగాన్ని ఆమె మాటల్లోనే వినండి !

నమస్తే ! నా పేరు శిరీష. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు. నాన్న ఉన్నంత వరకు మాది కూడా అలాంటి కుటుంబమే. ఎప్పుడైతే నాన్న రోడ్ యాక్సిడెంట్లో పోయారో అప్పుడే తెలిసింది ఈ లోకంలో చింతలేని కుటుంబం ఒక వింతే అని. అప్పటి వరకు కూడా మాకేం కావాలో నాన్నే చూసుకునేవాడు. కానీ ఆ తర్వాత సరదాగా తినే ఐస్‌క్రీమ్‌ని కూడా లెక్కలేసుకుని తినాలని మాకర్థమైంది. ఇంట్లో పెద్దవాళ్లంటే చిన్నవాళ్ల కోసం త్యాగం చేసి బతికేవారని అర్థమైంది. లెక్కలంటే భయపడిన నాకు, అక్కకు ఇలా లెక్కలేసుకుని బతకడం వల్ల కూడా లెక్కలొస్తాయని అర్థమైంది.

అమ్మమ్మకి అమ్మ, మామయ్య ఇద్దరే సంతానం. నాన్న లేకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య ఆదుకుంటారని అనుకుంది అమ్మ. అయితే అత్తయ్య పడనివ్వలేదు. ఇందులో ఆమె తప్పు కూడా ఉందనుకోవడం లేదు. ఎందుకంటే మామయ్య సంపాదన అంతంతే ! అత్తయ్యకి మామయ్య అడ్డు చెప్పలేడు. మామయ్యకి అమ్మమ్మ, తాతయ్యలు సర్దిచెప్పలేరు. వారు కడదాకా ఉండాల్సింది మామయ్యతోనే కదా ! బంధమంటే అవసరాల కోసం ఏర్పడేదే అని అప్పుడే నాకర్థమైంది.

ఎదుటివారి ఇష్టంలేని సాయంతో అవమానంగా జీవించేకంటే కష్టపడి సొంత కాళ్లపై నిలబడడమే ఉత్తమం అనుకుంది అమ్మ. పెద్దగా చదువుకోకపోవడంతో మా కోసం అంగన్వాడీ పని నుండి కూరగాయలు అమ్మే పని వరకు అమ్మ చేయని పనంటూ లేదు. అప్పుడప్పుడూ ఒంటి మీద చిన్న బట్ట కూడా లేకుండా రోడ్డు మీద తిరిగే మా తోటి అనాథల్ని చూస్తే మాకనిపిస్తుంటుంది... మాకు వారికి ఉన్న తేడా అమ్మే అని !
*****
స్తోమతని బట్టి అమ్మ నన్నూ, అక్కని డిగ్రీ వరకు చదివించింది. అమ్మ పెదవులపై నాన్న పోయినప్పుడు మాయమైన నవ్వుని మళ్లీ అక్క పెళ్లిలోనే నేను చూడటం ! అక్క పెళ్లి చేసిన తర్వాత చాలామందిలా ఒక భారం దిగిందనుకోలేదు అమ్మ. మొదట బావ ఇంటి నుండి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటికి కారణం ఇదే అని చెప్పలేను ! ఎందుకంటే చాలామంది భర్తల్లాంటి వాడే మా బావ కూడా. ఏం కావాలో నేరుగా చెప్పడు. అక్క బాధని బట్టే మేము అర్థం చేసుకోవాలి. అక్కకి పాప పుట్టిన తర్వాత సమస్యలు మరింత పెరిగాయి. దీంతో విడాకుల వరకూ వెళ్లింది వ్యవహారం. అమ్మే సర్ది చెప్పింది. చివరకు వారసుడు పుడితే తప్ప అక్క జీవితం కుదుటపడలేదు. ఇంటి వారసుడికి ఇంత విలువుంటుందా అనిపించింది నాకు.

తర్వాత కొంతకాలానికి నాకూ పెళ్త్లెంది. అమ్మలో అక్క పెళ్లప్పుడు ఉన్న సంతోషం నా పెళ్లప్పుడు కనిపించలేదు. దానికి కారణం తాను ఒంటరినైపోయాననే భావనే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మనోవేదనతోనే సంవత్సరం గడిచింది. ఈలోపు నాకు పాప పుట్టింది. మా ఆయన, అత్తమామలు అక్క తరపు వాళ్లకంటే కాస్త నయమే అయినా పాప పుట్టినప్పుడు వారిలో నిరుత్సాహం నాకు స్పష్టంగా కనిపించింది.
*****
ఒకరోజు ఉన్నట్టుండి అమ్మకి ఒంట్లో బాగాలేదని తెలియడంతో నేను, అక్క వెళ్లాం. మంచం మీద అమ్మని చూసి హృదయం ద్రవించిపోయింది. అప్పుడే అమ్మని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించేద్దాం అంది అక్క. నాకు నచ్చలేదని చెప్పా. 'నా పరిస్థితి నీకు తెలుసు.. మరి నువ్వు అమ్మని జీవితాంతం చూసుకోగలవా ?' అని ప్రశ్నించింది. దానికి నా నుండి కూడా మౌనమే సమాధానమైంది. ఈ పరిస్థితుల్లోనే నాకూ అనిపించింది.. తర్వాతి సంతానం నాకు వారసుడే జన్మించాలని.

అక్క చెప్పిన ఓల్డేజ్ హోమ్ గురించి ఆలోచిస్తున్న సమయంలో నాకో ఆలోచన వచ్చింది. అమ్మకి చిన్న వయసులోనే పెళ్లవడం వల్ల ఇప్పుడు తనకి నలభై ఏళ్లే... మళ్లీ అమ్మకి పెళ్లెందుకు చేయకూడదు ? ఇలా వారసులు లేక ఓల్డేజ్ హోమ్‌లలో తల్లిదండ్రులు నైరాశ్యంలో బతికే కంటే (వారసులుండీ కొంతమంది అలానే ఉంటున్నారనుకోండి) ఒక కొత్త తోడుతో మిగిలిన జీవితం సరికొత్తగా ఎందుకు గడపకూడదు ? చెప్పండి ! నా ఆలోచన కరెక్టేనా.. ? దీనికి సంస్కృతీ సంప్రదాయాలు అడ్డు అని మాత్రం చెప్పకండి ! ఒక మనిషి సంతోషాన్ని హరించే సంస్కృతీ సంప్రదాయాలెందుకో నాకెప్పటికీ అర్ధంకాదు.. మరి మీరూ ఆలోచించి నాకో చక్కటి సలహా ఇవ్వగలరా ?
ఇట్లు,
శిరీష.