Image for Representation
ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావిస్తారక్కడ. అలాంటిది స్కూలుకెళ్తానంటే ఊరుకుంటారా? ‘చదువు, ఉద్యోగం నీకెందుకు? ఆ పనులు చేయాల్సింది మగాళ్లు! నువ్వు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు’ అంటూ పైగా బోలెడన్ని షరతులు! ఇలాంటి వివక్షను చూస్తూనే పెరిగింది అఫ్గానిస్థాన్‌కు చెందిన వహీదా బేగం. అయినా ఇలాంటి బెదిరింపులకు తలొగ్గే నైజం కాదామెది. కారణం.. తన తండ్రి అండ! ఆడపిల్ల అయితే ఏంటి .... మగాళ్లకు తీసిపోని విధంగా తనని తయారుచేయాలనుకున్నాడు వహీదా తండ్రి. అలా నాన్న చొరవతో చక్కగా చదువుకుని ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించిందామె. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వద్దని వారించినా ఉద్యోగం సంపాదించిందన్న నెపంతో అన్యాయంగా ఆమెపై దాడికి తెగబడ్డారు దుండగులు. ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాదు.. ఆమె ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం కూడా కోల్పోయేలా చేశారు. అలాగని అదే తలచుకుంటూ కుమిలిపోకుండా, పడిలేచిన కెరటంలా విజృంభించిదామె.. ఓవైపు బాలికల హక్కులు, వారి విద్య కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అతివలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పోరాట స్ఫూర్తిని చాటుతూ తన జీవిత కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలు, మహిళల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ ఆడపిల్లలపై జరిగే దాడులు వారి ఎదుగుదలకు అడుగడుగునా అడ్డు పడుతున్నాయి. అలాంటి ఘటనల్లో బయటి ప్రపంచానికి తెలిసేవి కొన్నైతే.. తెలియనివి ఇంకెన్నో! నేనూ అలాంటి పరిస్థితుల మధ్యే పెరిగాను. ఇక్కడి నింగర్హార్ ప్రావిన్స్‌లో ఓ చిన్న కుగ్రామం మాది! ఇక్కడ ఉన్న పాఠశాల కేవలం మగపిల్లల కోసమే! ఆడపిల్లలు బయటికి వెళ్లడానికి, చదువుకోవడానికి వీల్లేదు.
******
అయితే మా నాన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఈ గ్రామానికి చెందిన కొంతమంది బాలికలకు ఇంట్లోనే ఉచితంగా పాఠాలు చెప్పేవారు. అది కూడా రహస్యంగానే! ఆ వాతావరణంలో పెరగడం వల్ల నాకూ చదువంటే మక్కువ పెరిగింది. అలా నాన్న పాఠాలు వింటూనే పదో తరగతి వరకూ చదువుకున్నా. సిటీకి వెళ్లి పరీక్షలు రాసేదాన్ని..! ఇక టెన్త్ పూర్తయ్యాక పైచదువుల కోసం జలాలాబాద్‌లోని అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉండి చదువుకున్నా. అక్కడా నా చదువుకు కొన్ని ఆటంకాలు ఎదురైనా ఎలాగోలా డిగ్రీ పూర్తి చేశా. అయితే పోలీస్ అధికారిణిని కావాలన్నది నా చిన్ననాటి కల. ఇదే విషయం నాన్నకు కూడా చెప్పా! ఆయన చాలా సంతోషించి నన్ను ప్రోత్సహించారు. ఇంతలోనే పోలీస్ ఆఫీసర్ పోటీ పరీక్షల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అయితే ఈ పోస్టు కోసం అప్లై చేసే అమ్మాయిల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు.. అంటే ఇక్కడ పురుషాధిక్యం అంత తీవ్రంగా ఉందన్నమాట!

అయినా నేను వెనుకంజ వేయలేదు. ఏదైతే అదవుతుంది.. ఎలాగైనా నేను పోలీసవ్వాలి.. నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. ఈ మాటల్నే పదే పదే స్మరిస్తూ ధైర్యంగా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నా. ఏ పనైనా మనం ఇష్టపడి చేసినప్పుడు అందులో కష్టమున్నా కనిపించదంటారు. నేనూ ఇలా పోలీస్ పరీక్షల కోసం ప్రిపేరయ్యేటప్పుడు ఎంతో కష్టపడి చదివా. కోచింగ్ కోసం బయటికి వెళ్లే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఇంట్లోనే ఇంటర్నెట్ సహాయంతో రోజుకు 16 గంటలు కష్టపడి చదివేదాన్ని. ఏదైతేనేం.. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. అది చూసి నాన్న కళ్లు మతాబుల్లా వెలిగిపోయాయి. ప్రతికూల పరిస్థితులున్నా వాటిని దాటుకుంటూ నా కూతురు గొప్ప విజయం సాధించిందంటూ ఎంతో సంబరపడిపోయారాయన!
******
పోలీస్నయ్యానని ఎంతగా సంబరపడిపోయానో.. అంతే సంతోషంగా డ్యూటీలో చేరాను. జలాలాబాద్ సిటీలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఉదయం ఎంత హ్యాపీగా డ్యూటీకి వెళ్లేదాన్నో.. వచ్చేటప్పుడు అంతకుమించిన ఆనందంతో ఇంటికి తిరిగొచ్చేదాన్ని. ఇలా దాదాపు ఐదు నెలలు గడిచిపోయాయి. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! రోజూలాగే ఆ రోజు కూడా డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చేద్దామని బయల్దేరా. అయితే ఓ ముఖ్యమైన పని ఉండడంతో స్టేషన్లోనే చీకటి పడిపోయింది. ఎట్టకేలకు పని ముగించుకుని ఇంటికి బయల్దేరా.. ఇలా ఆ వీధి చివరికి వెళ్లానో లేదో.. ఓ ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి నా కంట్లో కారం కొట్టి.. రెండు కళ్ల పైన కత్తులతో దాడి చేశారు. దాంతో స్పృహ కోల్పోయిన నేను మెలకువ వచ్చే సరికి ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా. చూద్దామంటే చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ‘అసలు నాకేమైంది డాక్టర్ అని అడిగా.. రెండు కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. బ్యాండేజ్ వేశాం’ అని డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా నా మనసంతా పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోయింది.

ఒకవేళ నేను కంటి చూపు కోల్పోతే నా కెరీర్ ఏం కావాలి? మరొకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతుకుదామనుకున్న నేను ఇక చీకట్లోనే మగ్గాల్సి వస్తుందేమోనన్న భయం, ఆలోచనలు నా మనసును తొలిచేశాయి. అయినా నాకు కంటి చూపు తిరిగొస్తుందేమోనన్న చిన్న ఆశ నాకు ఆ క్షణం కాస్త ధైర్యాన్ని, ఓదార్పునిచ్చింది. కానీ డాక్టర్ నాన్నతో మాట్లాడే మాటలు విన్నాక నా ఆశలు ఆవిరయ్యాయి.. జీవితాంతం పోలీస్‌గా సేవలందించాలన్న నా లక్ష్యం నా నుంచి దూరమవుతున్నట్లనిపించింది. నేను భయపడిందే నిజమైంది. నాకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పే మాటలు విన్నాక ఒక్కసారిగా నా మనసులో నిరాశా నిస్పృహలు ఆవహించాయి. దీనికి తోడు అనుకోకుండా వచ్చిన శారీరక లోపంతో నేనెంతో కష్టపడి ఇష్టంగా సంపాదించుకున్న ఉద్యోగం కూడా పోయింది. ఈ బాధలోనే నెల రోజులు గడిపా. అమ్మానాన్నలు ధైర్యం చెప్పినా నా మనసంతా ఏదో వెలితి!
******
ఇలా ఈ బాధ నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకోవడానికి నాకు మూడు నెలలు పట్టింది. అలాగని శారీరక లోపం ఉందన్న కారణంతో నేను ఇంటికే పరిమితమవ్వాలనుకోలేదు. నాలుగ్గోడల మధ్య ఖాళీగా కూర్చోవాలనుకోలేదు. నా కథను నలుగురితో పంచుకుంటూ ఇతర అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాలనుకున్నా. ఈ క్రమంలోనే భయం గుప్పిట బతుకీడుస్తోన్న ఎందరో బాలికలకు అండగా నిలవాలనుకున్నా. భయం కంటే బలం గొప్పది.. అది విద్యతోనే మనకు సొంతమవుతుందని వారిలో చదువు పట్ల ఇష్టాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నా. ఈ క్రమంలోనే ఆడపిల్లలపై వివక్ష చూపే ప్రాంతాలలో తిరుగుతూ వారిని బడికి పంపే దిశగా వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇలా నేను చేస్తోన్న పనితో కొంతమంది దుండగుల నుంచి నాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయినా ఇలాంటి నక్కజిత్తులకు నేను బెదరను. చివరిగా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒక్కటే! ఇతరుల బెదిరింపులకు లొంగకండి.. మీ మనసు చెప్పేది వినండి.. ఆడపిల్లలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు!