‘పుట్టుకతోనే తల్లిని పొట్టన పెట్టుకుంది’ అనే అపవాదును మూటగట్టుకుందామె! తల్లి లేని తన బాగోగులు చూడాల్సిన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పీజీ పూర్తి చేసింది. ఇలా అడుగడుగునా కష్టాలే పరిచయమైన ఆమెకు.. మహేష్ ఓ వెలుగు రేఖలా కనిపించాడు. అతడిని వలచింది.. అతనూ ఆమెను ఇష్టపడ్డాడు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఓ వీర జవాను భార్యగా గర్వపడుతూనే.. విధి నిర్వహణలో తన భర్తకేమీ కాకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కిందామె. అలా మూడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో అనుకోని ఉపద్రవం.. తన భర్త వీర మరణం! మరికొన్ని రోజుల్లో వస్తాను.. నిన్ను తీసుకెళ్తాను.. అని బాస చేసిన భర్త దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడుతున్నా.. అతను లేని నా జీవితం శూన్యమంటూ, ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ కంటికి ధారగా విలపిస్తోంది. ఆ వీర జవాను భార్య కన్నీటి గాథే ఇది!
దేశ సేవ చేసే అవకాశం చాలా తక్కువమందికి వస్తుంది. అలాంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో నా భర్త మహేష్ ఉన్నాడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తను దేశాన్ని ఎంతగా ప్రేమించేవాడో.. నాకు, వాళ్ల అమ్మానాన్నలకు అంతే సమానంగా ప్రేమ పంచేవాడు. చిన్నప్పట్నుంచి కష్టాల్లోనే పెరిగిన నాకు జీవితంలో ఆనంద క్షణాలు కూడా ఉంటాయన్న విషయం మహేష్ ను ప్రేమించాకే అర్థమైంది.
******
నా పేరు సుహాసిని. మాది విశాఖలోని ఓ పల్లెటూరు. నేను పుట్టగానే అమ్మ కన్నుమూసింది. దాంతో అందరూ ‘పురిట్లోనే అమ్మను పొట్టన పెట్టుకున్నావుగా!’ అని ఆడిపోసుకునే వారు. అసలు దానికి అర్థం ఏంటో, వాళ్లెందుకు అలా అంటున్నారో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అలా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయా! అమ్మ తర్వాత అన్నీ కావాల్సిన నాన్న నా బాధ్యత తీసుకోవాలనుకోలేదు. చిన్న పిల్లనని చూడకుండా నన్నొదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా అమ్మమ్మ వాళ్లే నన్ను చేరదీశారు. బడికెళ్లడం దగ్గర్నుంచి డిగ్రీ దాకా అక్కడే ఉండి చదువుకున్నా. అమ్మమ్మ-తాతయ్య నన్ను ఒక్క మాట కూడా అనకుండా అమ్మ లేని లోటు తెలియకుండా పెంచారు. కానీ ఇరుగుపొరుగు వాళ్లు అనే మాటలు నా మనసుకు తూటాల్లా తగిలేవి. ‘అమ్మను పోగొట్టుకున్నావ్.. నాన్నా వదిలేశాడు.. దురదృష్టమంటే నీదే!’ అని మొహమ్మీదే అనేవారు.

Image for Representation
నిజానికి ఆ రెండూ నేను చేసిన తప్పులు కాదు. అయినా ఎదుటివాళ్లు తమ మాటలతో ముల్లులా గుచ్చుతుంటే బాధపడడం తప్ప మరేమీ చేయలేకపోయా. ఇక ఇలాంటి మాటలు అమ్మమ్మ వాళ్లు విన్నారంటే ఈ వయసులో వారు తట్టుకోలేరు. అందుకే నా బాధను ఎవరితో పంచుకోకుండా నేనే భరించేదాన్ని. ఈ కష్టాల నడుమే డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో మా బాబాయి వాళ్ళింట్లో ఉంటూ పీజీ పూర్తి చేశా. అక్కడే బాబాయి ద్వారా మహేష్ నాకు పరిచయమయ్యాడు. తను అప్పటికే ఆర్మీలో పనిచేస్తున్నాడు. సెలవుల్లో బాబాయి వాళ్ళింటికి వస్తుండేవాడు. ఆ కొద్ది సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మహేష్‌తో మాట్లాడుతున్నంత సేపు ఇప్పటిదాకా నేనెదుర్కొన్న కష్టాలు, బాధల ఊసే రాలేదు. తన ఆత్మీయ పలకరింపు, ప్రేమతో నిండిన మాటలు నన్ను కట్టిపడేశాయి.
******
మహేష్ వెళ్ళిపోయినా అతనితో మాట్లాడిన మాటలే నాకు గుర్తొచ్చేవి. ఎందుకో మళ్లీ ఓసారి అతడితో మాట్లాడే అవకాశమొస్తే బాగుండేది అనుకున్నా. అంతలోనే మా బాబాయి నాకో విషయం చెప్పాడు. ‘మహేష్ నీ గురించి అడిగాడు.. నీకిష్టమైతే పెళ్లి చేసుకుంటానన్నాడు. అతనిపై నీ అభిప్రాయమేంటో తెలుసుకోమన్నాడు..’ అనగానే అతనిపై గౌరవం మరింతగా పెరిగింది. తన మనసులోని మాటను నేరుగా నాతో కాకుండా పెద్దల సమక్షంలో వ్యక్తపరిచి నా అభిప్రాయం అడగడం, అతని విధేయత నాకు చాలా బాగా నచ్చాయి. ఎంతైనా సోల్జర్ కదా! నేనూ సరేనంటూ నా అభిప్రాయం చెప్పేశాను. ఇక ఆపై అమ్మమ్మ-తాతయ్యలు కూడా అబ్బాయిని చూడడం, ఓకే చెప్పేయడంతో నెల తిరక్కుండానే మా పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత నెల రోజులకు మహేష్ తిరిగి విధుల్లోకి వెళ్లిపోయాడు.

Image for Representation
బోర్డర్లో తానెంత బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతలను, ప్రత్యేక సందర్భాలను తానెప్పుడూ మర్చిపోలేదు. పెళ్లైన దగ్గర్నుంచి నా ప్రతి పుట్టినరోజుకి, మా పెళ్లి రోజుకి ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్‌తో నన్ను సర్ప్రైజ్ చేసేవాడు. అలా ఈసారి తన పుట్టినరోజుకి నేను ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తను కూడా ఓ మూడు నెలల పాటు సెలవు పెట్టి నీతోనే గడుపుతానని నాకు మాటిచ్చాడు. దాంతో తనెప్పుడెప్పుడొస్తాడా అన్న ఆతృతతో ఎదురుచూస్తున్నా. అదే హుషారుతో రోజూలాగే ఆ రోజూ నిద్ర లేచా. కానీ కాసేపటికే గుండె బద్దలయ్యే వార్త నా చెవిన పడింది. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో నా భర్త వీరమరణం పొందాడన్న విషయం ఫోన్ ద్వారా నాకు తెలిసింది. అసలేం జరిగిందో, ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో, అలాంటి సందర్భంలో ఎలా స్పందించాలో అర్థం కాక నిశ్చేష్ఠురాలినయ్యా. బోరున విలపించా. ఎంత ఏడ్చినా నా కన్నీళ్లు తరిగిపోతాయేమో గానీ నా గుండె కోత మాత్రం తీరదు.
******
ఈసారి వచ్చినప్పుడు నిన్నూ తీసుకెళ్తానని మాటిచ్చాడు. అంతలోనే నన్ను ఇక్కడే వదిలేసి తను నాకు అందనంత దూరం వెళ్లిపోయాడు. మేం కన్న కలల్ని, చేసుకున్న బాసల్ని నాకొదిలి, నన్ను ఒంటరిని చేశాడు. దేశ సేవలో ప్రాణాలర్పించాడని ఓ వీర జవాను భార్యగా గర్వంగా చెప్పగలనేమో గానీ.. ఓ భార్యగా ఇది నాకు ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం! ఈ సమయంలో ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాను. ఓ వీరుడా! శోకతప్త హృదయంతో నీ భార్య నీకిచ్చే చివరి వీడ్కోలు!
జైహింద్!!