సారీ.. చెప్పడానికి లేదా వినడానికి రెండే అక్షరాలు అయినా అది మన మనసు మీద చూపించే ప్రభావం మాత్రం మాటలకు అందనిది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఎదుటివారిని నిస్సంకోచంగా క్షమించేద్దాం.. అంటోంది ఓ అమ్మాయి. అలా క్షమించడం వల్ల మనమే హాయిగా, ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా జీవించవచ్చని, అందుకు తానే ఓ సాక్ష్యం అని చెబుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? అసలు ఏం జరిగింది.. ఎందుకు క్షమాపణ గురించి ఇంతగా మాట్లాడుతోంది.. తెలియాలంటే ఇది చదవాల్సిందే..
హాయ్..
నా పేరు ధరణి. మాది బెంగళూరు. అమ్మానాన్నకి నేనొక్కదాన్నే సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, నేను కూడా చిన్నప్పట్నుంచీ ఎక్కువగా హాస్టల్స్‌లో పెరగడం.. మొదలైన కారణాల వల్ల స్వతంత్రంగా ఆలోచించుకునే స్వభావం నాకు మొదట్నుంచీ అలవాటైపోయింది. అలా నా స్నేహితులు, కెరీర్.. ఇప్పటివరకు ప్రతి విషయంలో నిర్ణయాలన్నీ పూర్తిగా నావే. అమ్మానాన్న కూడా ఏనాడూ నాకు అడ్డుచెప్పలేదు. ఒక్కోసారి మాత్రం అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో అనే కోణంలో తమ ఆలోచనలను వ్యక్తం చేసేవారు. అలా వారి సమ్మతితో నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఈ క్రమంలో అందరిలానే నాకు కూడా చాలా ఒడిదొడుకులు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటిలోనూ స్టెఫానీ నాకు చేసిన ద్రోహం మాత్రం నన్ను బాగా కుంగదీసిందనే చెప్పాలి.
మీకు చెప్పలేదు కదూ! నేను ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒక మంచి ఎమ్మెన్సీలో జాబ్ సంపాదించుకున్నా. అలా కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగంలో చేరిన నాకు ఆ సంతోషం ఆవిరవడానికి కేవలం ఆరు నెలలు మాత్రమే పట్టింది. జాబ్‌లో జాయిన్ అయిన మొదటి మూడు నెలలు చాలా త్వరత్వరగా గడిచిపోయాయి. అందరితోనూ సరదాగా ఉంటూ, హుషారుగా పని చేసుకుంటూ రోజులు గడిపేసేదాన్ని. ఆ తర్వాత ఒకరోజు మా సంస్థలో నిర్వహించిన ఇంటర్వ్యూలకి స్టెఫానీ అనే ఒక అమ్మాయి వచ్చింది. నిజానికి తనది ఈ దేశం కాదు. ఆస్ట్రేలియా. కానీ మన దేశం మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఇక్కడ పని చేయడానికి వచ్చిందట! అదీకాక ఆన్లైన్లో పరిచయమైన తన ప్రియుడు కూడా బెంగళూరులోనే ఉంటున్నాడని తెలియడంతో ఇక్కడ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పింది. తన మాటల్లో ఉన్న అమాయకత్వం, తీయదనం.. నన్ను తనకి మరింత త్వరగా దగ్గర చేశాయి. ఆ తర్వాత స్టెఫానీ ఇంటర్వ్యూలో సెలక్ట్ కావడం, మా బ్రాంచ్‌లోనే పోస్టింగ్ ఇవ్వడంతో మా మధ్య బంధం మరింత బలపడి స్నేహంగా మారింది.
[[[[[
తను మా సంస్థలో చేరిన మొదటి నెల అసలు ఎలా గడిచిందో కూడా గుర్తు లేదు. పని చేసినా, బయటకి వెళ్లినా, కబుర్లు చెప్పుకున్నా.. ఇద్దరం కలిసి తెగ నవ్వుకునేవాళ్లం. మేమిద్దరం మంచి స్నేహితులమని ఆఫీసులో అందరికీ తెలుసు. ఇక్కడ మీకు మరొక వ్యక్తి గురించి చెప్పాలి. అతడే నేను ప్రేమించిన వ్యక్తి అజయ్. కాలేజీలో జరిగిన మా పరిచయం క్రమంగా స్నేహంగా మారడం, అది ప్రేమగా రూపాంతరం చెందడం.. సినిమాలో చూపించినట్లే జరిగిపోయింది. తను నన్ను చాలా బాగా చూసుకొనేవాడు. మా అమ్మానాన్నకి కూడా మా విషయం తెలుసు. ఒకరోజు ఆఫీసు అయిపోయిన తర్వాత అతన్ని కలవడానికి వెళ్తుంటే నా బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేస్తా రా అంటూ నన్ను స్టెఫానీ తన వెంట తీసుకెళ్లింది. ఒక కేఫ్‌కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏవేవో కబుర్లు చెబుతోంది. కానీ నా మనసు మాత్రం అజయ్ గురించే ఆలోచిస్తోంది. ఈలోగా వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్‌లో ఓ వ్యక్తి మా వైపుగా నడుచుకుంటూ రావడం చూశా. అతన్ని చూడగానే ఎక్కడో చూసిన వ్యక్తిలానే అనిపించాడు. కానీ ఎక్కడ చూశానో నాకు గుర్తు రాలేదు. ఈలోగా స్టెఫానీ ఆ అబ్బాయిని నాకు పరిచయం చేయడం, అతడు నా వైపు కంగారుపడుతూ చూడడం.. జరిగింది. దాంతో నేను మరింత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టా. అప్పుడు గుర్తొచ్చింది. అతడి పేరు అవినాష్. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అబద్ధపు పేరు, వివరాలతో ఫేస్బుక్లో నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. అంతేకాదు.. స్నేహం మాటున తన అవసరాలు తీర్చుకునే స్వభావం అతనిది. అవినాష్‌తో మాట్లాడిన కొద్ది రోజుల్లోనే ఆ స్వభావం నాకు అర్థమై ముందే జాగ్రత్తపడ్డా. అతనితో మాట్లాడడం పూర్తిగా ఆపేశా. ఇప్పుడు ఈ విషపు పురుగు వలలో ఈ విదేశీయురాలు చిక్కుకుందని అర్థమైంది.
వెంటనే ఈ విషయం స్టెఫానీకి చెప్పడానికి ప్రయత్నించా. కానీ అతడు మళ్లీ కలుద్దాం అంటూ ఆమెని తన వెంట తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను అజయ్‌ని కలిసి విషయం చెప్పా. స్టెఫానీకి అన్ని విషయాలు వివరంగా చెప్పి అప్రమత్తం చేయమని సలహా ఇచ్చాడు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయడం ప్రమాదమని తలచి అదే రోజు రాత్రి స్టెఫానీకి నేను ఫోన్ చేసి జరిగిందంతా చెప్పా. తను మౌనంగా ఉండిపోయింది తప్ప అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. దాంతో నేను కాస్త షాకయ్యా. బహుశా తనకి నేను చెప్పింది అర్థం కాలేదేమో.. మళ్లీ మర్నాడు ఆఫీసుకి వెళ్లి చెబుదామని అనుకున్నా. కానీ మరుసటి రోజు నేను ఆఫీసుకి వెళ్లేసరికే నా గురించి ఆమె అందరికీ చాలా నెగెటివ్‌గా చెప్పడం ప్రారంభించింది. తట్టుకోలేకపోయా. అసలు ఎందుకలా చేసిందో అర్థం కాలేదు. తర్వాత నేను తనతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె సుముఖత చూపలేదు. దాంతో మా మధ్య దూరం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నాకు ఇంతకుముందే పెళ్త్లెందని, అమ్మానాన్నలకు విషయం తెలియదని.. ఇలా ఏవేవో చెప్పిందని తెలిసి నా మనసు ముక్కలైపోయింది. తన మీద కోపం పెరిగిపోయింది.
[[[[[
ఇలా ఉండగానే నాకు మరో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు.. పాత గాయం మానేందుకు బాగా తోడ్పడ్డారు. తిరిగి నా ఆశయాలు, లక్ష్యాలను చేరుకునే దిశగా పని చేయడం ప్రారంభించిన నాకు అక్కడ రెండేళ్ల కాలం రెండు క్షణాల్లా గడిచిపోయింది. గతం మరిచి భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్న ఆ తరుణంలో ఒక రోజు మా ఆఫీసులో నా కళ్ల ముందు స్టెఫానీ ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా షాకయ్యా. అయితే ఆమెతో మాట్లాడేందుకు నా మనసు ఒప్పుకోలేదు. అందుకే మిన్నకుండిపోయా. ఆమె కూడా నాతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో నా మనసు కాస్త వూపిరి పీల్చుకుంది. కానీ ఆమెను చూసినప్పటి నుంచి మనసులో అప్పుడప్పుడే మానుతున్న పాత గాయం మళ్లీ పచ్చిగా మారింది. దాంతో నాకు తెలియకుండానే కొన్ని వందల కిలోల బరువు నా కాలికి చుట్టుకున్నట్లు, అది నన్ను బాధ అనే పాతాళంలోకి లాగుతున్నట్లు అనిపించింది. వెంటనే అమ్మకి చెప్పా. తన స్నేహితురాలైన ఒక మానసిక నిపుణురాలి అడ్రస్ ఇచ్చి, అక్కడికి వెళ్లమంది.
[[[[[
ఆ చిరునామాకి వెళ్లి, ఆ వైద్యురాలిని కలుసుకొని జరిగినదంతా చెప్పా..! అది విన్న ఆమె 'ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?' అని నన్ను అడిగారు. 'నా ఉద్యోగంలో నేను ప్రశాంతంగా ఉంటే చాలు. తన గురించి నేను పట్టించుకోవాలని అనుకోవడం లేదు.. దాని వల్ల నాకు మనశ్శాంతి కరువవుతోంది..' అని చెప్పా. దానికి సింపుల్‌గా అయితే ఆమెని 'క్షమించెయ్' అందామె. మొదట నాకు అర్థం కాలేదు. 'అవును.. నువ్వు ఆమెని మనస్ఫూర్తిగా క్షమించిన మరుక్షణం నీ గతం నిన్ను బాధించదు. ఎందుకంటే అది గతం. ఎప్పుడో జరిగిపోయింది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. గతం గురించి ఇలా వర్తమానాన్ని, తద్వారా భవిష్యత్తుని వృథా చేసుకోవడం కన్నా మరొక తెలివితక్కువ పని ఏమైనా ఉంటుందా? అసలు ఇది ఎంత వరకు న్యాయం?? తప్పు చేసింది ఆమె అయినప్పుడు నువ్వెందుకు చింతించాలి??' అంటూ ఆమె ఇచ్చిన కౌన్సెలింగ్‌కి నా మనసు దూదిపింజలా తేలికగా మారిపోయింది. ఆమె నింపిన ఆత్మవిశ్వాసంతో ఒక కొత్త ధరణిగా ఆ గది నుంచి బయటకి అడుగుపెట్టా. స్టెఫానీ నా గురించి ఇప్పుడు ఏం అనుకుంటుందో, ఎలా ఆలోచిస్తుందో నాకు తెలియదు.. కానీ నేను మాత్రం గతంలో తను చేసిన తప్పిదాన్ని మనస్ఫూర్తిగా క్షమించేశా. మళ్లీ సంతోషంగా జీవిస్తున్నా. ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు కావస్తోంది. నాకు, అజయ్‌కి పెళ్లి కూడా జరిగిపోయింది. మరి, మీకెందుకు చెప్తున్నా అంటే.. మనలో చాలామంది విషయం చిన్నదైనా, పెద్దదైనా.. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ తెగ మధనపడిపోతూ ఉంటారు. మనకు బాధ కలిగించిన వారి గురించే ఆలోచిస్తూ కుమిలిపోతూ మనశ్శాంతిని దూరం చేసుకునే బదులు ఒక్కసారి మనస్ఫూర్తిగా వారిని క్షమించి చూడండి.. తప్పకుండా మీ ఆలోచనాతీరులో మార్పు కనిపిస్తుంది. అందుకేనేమో 'క్షమాగుణం చాలా గొప్పదని' పెద్దలు చెబుతుంటారు!
ఇట్లు,
ధరణి.