‘వద్దమ్మా.. వద్దు..! అసలే నువ్వు పచ్చి బాలింతవి.. ఇలాంటి సమయంలో డ్యూటీకి వెళ్తే.. అటు నీకు, ఇటు పాపాయికి ఇద్దరికీ ముప్పే!’ అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. వృత్తే దైవంగా భావించే ఆ నర్సు.. తన కుటుంబ సభ్యులను ఎలాగోలా ఒప్పించి కరోనాతో పోరుకు కదిలింది. కరోనాకు ముందు మెటర్నిటీ సెలవు కోసం తన సొంతూరుకు చేరుకున్న ఆమె.. ప్రసవానంతర సెలవు పూర్తయ్యే సరికి లాక్డౌన్ ఆంక్షల వల్ల ఇక్కడే ఆగిపోయింది. ఓవైపు డ్యూటీ చేయాలన్న తపన.. మరోవైపు వెళ్లలేని పరిస్థితి! అయినా మనసుంటే మార్గముంటుందన్నట్లు ఇంట్లో వాళ్లను ఎలాగోలా ఒప్పించి రాష్ట్ర సరిహద్దులు దాటింది.. తిరిగి విధుల్లో చేరింది..! అటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా విధుల్లో పాల్గొంటూనే, ఇటు తన చిన్నారినీ జాగ్రత్తగా చూసుకుంటున్నానంటోంది. మరి, చంటి బిడ్డతో కరోనాతో పోరు చేస్తోన్న ఈ కొవిడ్ వారియర్ కథేంటో మనమూ విందాం రండి..!
ఏంటో.. ఈ ఏడాదంతా అగమ్యగోచరంగా తయారైంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామన్న సంతోషాన్ని మర్చిపోకముందే కరోనా వచ్చి మన ఆలోచనల్ని, ఆశయాల్ని తలకిందులు చేసేసింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! నేను మృదుల. మా సొంతూరు తిరుపతి.. ప్రస్తుతం తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. అందరిలాగే నేనూ ఈ ఏడాది ఎన్నో చేయాలనుకున్నా. ముఖ్యంగా నాకు పుట్టబోయే బిడ్డతో మరింత సమయం గడపాలని, ఇటు విధులకు హాజరవుతూనే అటు చిన్నారి ఆలనా పాలన చూసుకోవాలని ఆరాటపడ్డా. అయినా అన్నీ మనం అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది చెప్పండి!
******
సాధారణంగా డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి వెళ్తుండేదాన్ని. ఇక గర్భం ధరించాక ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని రాకపోకలు కాస్త తగ్గించినా.. డెలివరీ కోసం రాక తప్పలేదు! ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో తిరుపతికి వచ్చాను. ఆరు నెలలు ఎలాగూ మెటర్నిటీ లీవ్ ఉంది కాబట్టి కొన్నాళ్లు అమ్మా వాళ్లింట్లో, ఇంకొన్నాళ్లు అత్తయ్య వాళ్లింట్లో ఉండాలనుకున్నా. ఆ సమయంలోనే చైనాలో కరోనా వైరస్ విజృంభణ గురించి ఒక్కొక్కటిగా వార్తలొస్తున్నాయి. ఒక నర్సుగా దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకునే లోపే దాని ప్రభావం మన దేశంలోనూ ప్రారంభమైంది. ఈ ఆలోచనల నడుమ, చంటి పిల్లాడి ఆలనా పాలనతోనే ఆరు నెలల ప్రసవానంతర సెలవులు పూర్తయ్యాయి.

******
ఇక తిరిగి విధుల్లో చేరదామంటే ఇంట్లో వాళ్లు వద్దని గొడవ. ‘అసలే బయట కేసులు పెరిగిపోతున్నాయి. పైగా తమిళనాడులో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. నువ్వేమో పచ్చి బాలింతవి! ఇంత చిన్న పిల్లాడిని పట్టుకొని ఊరు దాటి వెళ్లడం, డ్యూటీ చేయడం, మళ్లీ ఇంటికొచ్చి పిల్లాడిని చూసుకోవడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల నీకు, పిల్లాడికి వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.. వద్దంటే వద్దు’ అని మొండికేశారు. ఇక వాళ్ల పోరు భరించలేక నెల పాటు అదనంగా సెలవు కోరుతూ మా ఆస్పత్రికి మెయిల్ పంపాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న వారు సరేనన్నారు. అయినా నా మదిలో ఏదో వెలితి.. అపరాధ భావం నన్ను వేధించేవి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఓ నర్సుగా నా వంతు డ్యూటీ నేను చేయలేకపోతున్నానే అన్న మానసిక వేదన నాలో కలిగింది. అలా నెల గడిచిపోయింది.
******
ఇక వెళ్తానంటే మళ్లీ వద్దని గొడవ! ఇక లాభం లేదనుకొని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. మా అమ్మను తీసుకొని మా కార్లోనే తమిళనాడుకు బయల్దేరా. ఇక ఆ మరుసటి రోజు నుంచే విధుల్లో చేరిపోయా. తిరిగి డ్యూటీకి వెళ్తున్నానని, అదీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా వంతుగా సహకారం అందించడానికన్న ఆనందం నాలో ఉన్నా.. నా బుజ్జాయి గురించిన భయం కూడా నన్ను వెంటాడేది. అయినా ‘నాకేం కాదు.. ఇలాంటి కష్టకాలంలో నేను నలుగురికీ సహాయపడితే ఆ దేవుడు నన్ను, నా బాబును చల్లగా చూస్తాడు’ అన్న నమ్మకంతో, ధైర్యంగా అడుగు ముందుకేశా. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ నర్సుగా.. మా ఆస్పత్రిలో పనిచేస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి.. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, పీపీఈ ధరించడం.. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం నా విధి. ఇలా నా పని నేను చేసుకుపోతూనే.. మరో వైపు కొవిడ్ వార్డుల్లో వైద్య సిబ్బంది సరైన నాణ్యతా ప్రమాణాలను, పరిశుభ్రతను పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాలు కూడా నేను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
******
ఇక రోజూ బాబును అమ్మ దగ్గర వదిలి డ్యూటీకి వెళ్తున్నా. ఈ క్రమంలో వాడికి పాలిచ్చి.. బ్రెస్ట్ పంప్ సహాయంతో పాలు తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అలవాటు చేసుకున్నా. ఆస్పత్రిలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. ఇంటికొచ్చాక నాతో తీసుకెళ్లిన వస్తువులు శానిటైజ్ చేసుకోవడం, నీట్‌గా స్నానం చేశాక గానీ వాడిని నా దగ్గరికి తీసుకోవట్లేదు. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ కరోనాపై పోరులో నా వంతు పాత్ర పోషిస్తున్నా.. ఇటు అమ్మతనాన్నీ అనుభవిస్తున్నా. ప్రస్తుత ప్రతికూల సమయంలో నేను ఈ మంచి పని చేస్తున్నానని నాకు నేను గొప్పలు చెప్పుకోవడానికే నా కథను పంచుకోలేదు.. ఒక శ్రేయోభిలాషిగా మీ అందరికీ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలనుకుంటున్నా..!

మొదట్లో కరోనా బారిన పడకుండా అందరూ ఎంత జాగ్రత్తగా ఉన్నారో.. ఇప్పుడు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగో నెల, రెండు నెలల వ్యవధిలో వ్యాక్సిన్ వస్తుందన్న చాలామంది ఆలోచన ఇందుకు ఒక కారణమైతే.. మాకేం కాదులే అన్న అతి విశ్వాసం మరో కారణం! కానీ ఒక నర్సుగా నాకున్న వైద్య అనుభవంతో చెబుతున్నా.. రాబోయేది చలికాలం.. అంటే వైరస్‌కు చాలా అనువైన కాలం. కాబట్టి తీసుకునే జాగ్రత్తల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అలసత్వం ప్రదర్శించినా వైరస్ ముప్పును మీకు మీరే కొని తెచ్చుకున్న వాళ్లవుతారు. మీ వల్ల మీరే కాదు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోన్న మీ కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న వాళ్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మసలుకోండి.. కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడండి..! కరోనా రెండో దశ ముప్పును మీ వంతుగా తగ్గించే ప్రయత్నం చేయండి.. తద్వారా పరోక్షంగా మాకూ సహాయం చేసిన వారవుతారు.