కరోనా దూకుడుకు కళ్లెం వేయాలంటే దాని అంతు చూసే వ్యాక్సిన్ రావాలి. మరి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు.. అంతదాకా అన్ని పనులూ ఆపుకొని ఇంట్లో కూర్చుందామంటే కుదరదు. అందుకే కరోనాతో సహవాసం చేయడానికే అలవాటు పడిపోయారంతా! అయితే అటు గృహిణులు, ఇటు ఇంటి నుంచి పనిచేసే మహిళలు వైరస్ ముప్పు ఉందని తెలిసినా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి రావచ్చు. అలా అనుకోకుండా తాను చేసిన ప్రయాణం వల్ల కరోనా బారిన పడ్డానంటోంది హైదరాబాద్కి చెందిన నీరజ. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేమని ఓవైపు అందరినీ అలర్ట్ చేస్తూనే.. మరో వైపు వైరస్ సోకిందని ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మలచుకుంటే కరోనా మహమ్మారిని జయించవచ్చనడానికి తననే ఉదాహరణగా చూపుతోందామె. ఈ క్రమంలోనే తాను కరోనాపై గెలిచిన తీరును, తన అనుభవాలను మనందరితో ఇలా పంచుకుంది.
ప్రస్తుతం మన చుట్టూ కరోనా వైరస్ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు కొందరుంటే.. ఎవరి కారణంగా తాము ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతున్నారు మరికొందరు..! అయితే ఒకవేళ దీని బారిన పడినప్పటికీ వైద్యుల సలహా మేరకు సరైన మందులు వాడుతూ.. చక్కటి పోషకాహారం తీసుకుంటూ, ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ మూడే మనల్ని కరోనా నుంచి బయటపడేస్తాయన్న విషయం నా స్వీయానుభవంతో చెబుతున్నా. అందుకే ఈ క్రమంలో నేను పాటించిన చిట్కాలు మీలో కొంతమందికైనా ఉపయోగపడినా చాలనుకొని ఇలా మీ అందరితో పంచుకోవడానికి ముందుకొచ్చాను.
******
మాది కాకినాడ. కానీ పెళ్లయ్యాక నా భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. ఆ తర్వాత కొన్నాళ్లకు నేనూ ఇక్కడ ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మా పదేళ్ల వైవాహిక బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఏడు నెలల నుంచి నేను, మా వారు ఇంటి నుంచే పని చేస్తున్నాం.. పిల్లలు కూడా ఆన్లైన్లోనే క్లాసులు వింటున్నారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అందరిలాగే మేము కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తున్నాం. అయితే ఇటీవలే మా బంధువు ఒకరు చనిపోతే నేను కాకినాడ వెళ్లాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, అక్కడ ఇతర బంధువుల్ని కలిసే క్రమంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా. అయినా రిస్క్ చేయడం ఎందుకన్న ఉద్దేశంతో తిరిగి హైదరాబాద్ వచ్చాక ఓ పది రోజుల పాటు నా భర్త, పిల్లలకు దూరంగా ప్రత్యేకమైన గదిలో ఐసొలేషన్లో ఉండాలనుకున్నా.

అనుకున్న ప్రకారమే నేను విడిగా ఉండడం, నా వరకు నేనే వంట చేసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడం.. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. నాలుగో రోజు నాకు పొడిదగ్గు, జలుబు మొదలయ్యాయి. అయితే నాకు ముందు నుంచే డస్ట్ అలర్జీ ఉంది. పైగా నేనుండే గది రోడ్డు వైపు ఉంటుంది. దానివల్లే ఇలా జరుగుతుందేమో అనుకున్నా. ఇక మరుసటి రోజు తలనొప్పి, జ్వరం, రుచి-వాసన కోల్పోవడం.. వంటి సమస్యలెదురయ్యాయి. దీంతో కనీసం వంట చేసుకోవడానికి కూడా నా శరీరం సహకరించలేనంత నీరసం నన్ను ఆవహించింది. అప్పుడనిపించింది.. ఇదేదో అనుమానించాల్సిన విషయమే అని! వెంటనే మాకు దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి శాంపిల్స్ ఇచ్చాను. సాయంత్రానికల్లా ఫలితాలొచ్చాయి. నా అనుమానమే నిజమైంది. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాల తీవ్రత కూడా కాస్త ఎక్కువగానే ఉండడంతో వారం పాటు ఆస్పత్రిలో ఉండాలని సూచించారు వైద్యులు. ఎందుకైనా మంచిదని నా భర్త, పిల్లలు కూడా పరీక్ష చేయించుకున్నారు.. దేవుడి దయ వల్ల వాళ్లందరికీ నెగెటివ్ రావడంతో హమ్మయ్య అనుకున్నా.
******
అయితే ఆస్పత్రిలో చేరిన నాకు వైద్యులు హెచ్సీక్యూ, అజిత్రోమైసిన్.. వంటి మందులిచ్చారు. ఇలా ఈ కోర్సు వాడుతున్న కొద్దీ తలనొప్పి తగ్గుముఖం పట్టింది. నా ఆరోగ్యం కొద్దికొద్దిగా మెరుగవుతున్నట్లనిపించింది. అయితే కొవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరూ ఇవే మందులు వాడాలని లేదు. ఎలాంటి మెడిసిన్ వాడినా వైద్యుల సలహా మేరకే వాడాలన్న విషయం గుర్తుంచుకోండి. అది కూడా మీ ఆరోగ్య పరిస్థితి, మీకున్న లక్షణాలను బట్టే సరైన మందులు సూచిస్తారు. కాబట్టి మీ అంతట మీరు ఎలాంటి మందులూ వాడకపోవడమే మంచిది. ఒకవేళ విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవాలనుకున్నా వైద్యుల సలహా తీసుకున్నాకే వేసుకోవాలన్న విషయం గుర్తు పెట్టుకోండి. ఇక మందులతో పాటు పాలు, గుడ్లు, నట్స్, పండ్లు.. వంటివి ఎక్కువగా తీసుకున్నా. ఎలాగైతేనేం.. పది రోజుల తర్వాత చేసిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఇంటికి చేరుకున్నా.. అయినా అందరితో కలవకుండా మరో వారం పాటు స్వీయ ఐసొలేషన్ లోనే ఉన్నాను.

ఈ క్రమంలో నా పని నేను చేసుకోవడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాను. ఉదయం యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నా. ఇక రాత్రుళ్లు ఒంటరితనం వేధించకుండా ఉండేందుకు.. నిద్రొచ్చేదాకా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం.. వంటివి చేశా. ఈ చిట్కాలు నా మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా చేశాయి. నాలో పాజిటివిటీ పెరిగింది. ఇలా ఈ ఒక్క మలుపుతో నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి.
మీరు కూడా కరోనా గురించి అనవసర భయాందోళనలు పెట్టుకోకండి.. అలాగని దీన్ని నిర్లక్ష్యమూ చేయద్దు. ముందుంది చలికాలం.. పైగా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందన్న వార్తలు మనల్ని ఆందోళనలో పడేస్తున్నాయన్న మాట వాస్తవమే.. కానీ మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం.. వంటి కనీస జాగ్రత్తలే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఆయుధాలు! కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకోండి. బహుశా.. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది.. మీ వద్ద ఎప్పుడూ థర్మామీటర్, ఆక్సీ మీటర్ ఉంచుకొని.. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.. ఏ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ చుట్టూ ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అందరూ ఇలా జాగ్రత్తపడితే కరోనా గొలుసును తెంచడం పెద్ద కష్టమేమీ కాదు!