రెండు చేతులు కలిస్తే స్నేహం.
రెండు మనసులు కలిస్తే ప్రేమ.
అలా చిన్నతనంలోనే ఒకబ్బాయి, ఒకమ్మాయి మనసులు కలుసుకున్నాయి. సినిమాలు, షికార్లు లేకపోయినా, ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు చెప్పుకోకపోయినా విడిపోలేనంతగా వారి మనసులు పెనవేసుకున్నాయి. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆ జంట విడిపోవాల్సి వచ్చింది. ఎవరిదా జంట? అసలు ఎందుకు విడిపోయింది? తర్వాత ఏమైంది?? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
నా పేరు అనిత. మాది శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పదో తరగతి వరకు మా వూరిలోనే చదువుకున్నాను. మా క్లాస్‌లో అందరికంటే హుషారుగా ఉంటూ, బాగా చదివే 'సూర్య' అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి, ఏ సందేహమున్నా చిటికెలో తీర్చేసేవాడు. మేమిద్దరం చిన్నప్పట్నుంచీ కలిసే చదువుకున్నాం. అందుకే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎందుకో తెలీదు కానీ తనంటే నాకు ముందునుంచీ చాలా ప్రత్యేకం. మేం అలా కలిసి ఆడుకుంటూ, చదువుకుంటుండగానే పదో తరగతికి వచ్చేశాం. పబ్లిక్ పరీక్షలు కదా..! జాగ్రత్తగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి నేను సూర్య ఇంటికి వెళ్లి చదువుకునేదాన్ని. ఒక్కోసారి అక్కడే నిద్రపోయేదాన్ని కూడా. అవకాశం దొరికినా నా పట్ల తను ఏనాడూ అనుచితంగా ప్రవర్తించింది లేదు. కష్టపడి చదివి పరీక్షలన్నీ నిరాటంకంగా రాసేశాం.

అలా పరీక్షలు పూర్త్తెన మరుసటి రోజు మా క్లాస్‌లోని స్నేహితులమంతా కలిసి సినిమాకి వెళ్లాం. అనుకోకుండా నేను, సూర్య పక్కపక్కనే కూర్చున్నాం. అప్పటికే నేను తనని ప్రేమిస్తున్నానని నా మనసులో ఉన్న విషయం చెప్పాలని చాలా ప్రయత్నించా. కానీ కుదరలేదు. ఒకవేళ చెప్తే ఇన్నేళ్ల మా స్నేహం కూడా నిలవదేమో అని భయం కూడా వేసింది. కానీ ఇంటర్వెల్ సమయంలో 'నీతో మాట్లాడాలి.. ఇక్కడే ఉండు..' అని బయటకెళ్లిన సూర్యతో చెప్పా. అలా అందరూ లోపలికి వెళ్లిపోయిన తర్వాత నా మదిలో మాటను ఎలా చెప్పాలో తెలియక తెగ సతమతమైపోయా. మళ్లీ తేరుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని మనసులో ఉన్న మాట తనకు చెప్పేశా. తనవైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి నేను మళ్లీ కదిలిస్తే అప్పుడు- 'నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ మనది చాలా చిన్న వయసు. ఈ విషయం మన పెద్దలకు తెలిస్తే బాగుండదు. అందుకే ముందు చదువు మీద శ్రద్ధ పెట్టి చక్కగా స్థిరపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం' అనగానే నా సంతోషం సంద్రమై ఉరకలేసింది.
ఇంటి దగ్గర ఈ విషయాలేవీ చెప్పకుండా ఇద్దరం వూళ్లోనే ఇంటర్లో జాయినయ్యాం. మొదటి సంవత్సరం బాగానే పూర్త్తెంది. రెండో సంవత్సరంలో ఓ రోజు మా అమ్మ వచ్చి 'నీకు మంచి సంబంధం వచ్చింది. నిన్ను చూడటానికి వాళ్లు ఈరోజు మధ్యాహ్నమే వస్తున్నారని' చెప్పేసరికి నా గుండెల్లో అలజడి మొదలైంది. వెంటనే విషయం సూర్యకి తెలియజేశా. ఈ విషయం విన్న సూర్య విపరీతమైన నిరుత్సాహానికి లోనయ్యాడు. తర్వాత కాసేపటికి తేరుకుని 'అనితా- మనం ప్రేమించుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు మనం ఇంట్లో మన పెళ్లికి ఒప్పించలేం. అలాగని బయటకెళ్లి జీవించలేం. మన వయసులు అందుకు అస్సలు సరిపోవు. మన పెద్దవాళ్లు ఏం చేసినా మన మంచికే చేస్తారు.. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు మరొకటి తలిచాడు. అందుకే నువ్వు మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధమే చేసుకో. అది ఇద్దరికీ మంచిది' అంటూ సర్దిచెప్పబోయాడు. కానీ సూర్య మాటలు నాకు నచ్చలేదు. 'నేనంటే నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావంటూ' తనని తిట్టి వెళ్లిపోతుంటే సూర్య ఏడుస్తూ తనని అర్థం చేసుకోమని, ఈ పెళ్లికి ఒప్పుకోమని నన్ను బలవంతం చేశాడు.

నేను మా విషయం ఇంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తే వద్దని వారించాడు. ఈ రహస్యం బహిర్గతమైతే రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం దెబ్బతింటుంది. పెద్దల మనసులు కూడా బాధపడతాయని అన్నాడు. దాంతో నేను ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నా. ఈలోపే పెళ్లిచూపులు, నిశ్చితార్థం, పెళ్లికి ముహూర్తాలు ఖరారు చేసేయడం చకచకా జరిగిపోయాయి. కానీ నా మనసులో మాత్రం ఇంకా ఏదో మూల ఆశ.. ఎలాగైనా సరే- సూర్యకి, నాకు పెళ్లవుతుందని. ఇంతలో పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. సూర్య కూడా పెళ్లి పనుల్లో సహకరిస్తూనే, ఓ పక్క నన్ను గమనిస్తూనే ఉన్నాడు. అతని ముఖంలో మాత్రం రక్తపుబొట్టు లేదు. చాలా బాధగా ఉన్నాడని తెలుస్తోంది. ఈలోగా ముహూర్తం రానే వచ్చింది. పీటల మీద కూర్చుని తాళి కట్టించుకునేటప్పుడు కూడా తన అభిప్రాయం మారుతుందేమోనని సూర్యవైపు ఓసారి ఆశగా చూశాను. తను 'తాళి కట్టించుకో..' అంటూ సైగ చేసే సరికి నేను ఏం చేయలేకపోయాను. కళ్లు మూసి తెరిచే సరికి మరొకరికి అర్ధాంగినైపోయాను.

పెళ్త్లెనా నా మనసు సూర్య మీదే ఉండిపోయింది. అందుకేనేమో పెళ్త్లెన మూడో రోజు నుంచే మా ఆలుమగల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి భర్తతో నేను కాపురం చేయలేనని తెగేసి చెప్పేసి కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండిపోయాను. అప్పటికే సూర్య ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాడు. తనకి ఫోన్ చేసి 'నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. నీ దగ్గరికి వచ్చేస్తా. కాదంటే చస్తా' అన్నాను. తను తెలివిగా నాకు నాలుగు సంవత్సరాలు సమయం కావాలి. ఈలోపు ఇంజినీరింగ్ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదిస్తా అన్నాడు. దానికి నేను కూడా సరే అన్నా. కానీ దీనికీ ఒక షరతు పెట్టాడు. అదేంటంటే నేను మా అత్తారింటికి వెళ్లాలని, నా భర్తతో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదని మాట తీసుకున్నాడు. దాంతో నాలో కొత్త ఉత్సాహం నిండింది. తను కోరుకున్నట్లుగానే మా అత్తారింటికి వెళ్లి భర్తతో గొడవలు పడకుండా మెలిగాను. సూర్యకి కూడా రోజూ ఫోన్ చేసేదాన్ని. కానీ ఓ రోజు సూర్య నువ్విలా రోజూ ఫోన్ చేయడం మీ వారు గమనిస్తే ఇద్దరికీ మంచిది కాదని.. వారానికోసారి మాట్లాడదామని అన్నాడు. మనసుకి కష్టం అనిపించినా ఎప్పటికైనా నావాడే కదాని నేను కూడా సరే అన్నాను. అయితే ఈలోపే భర్తతో సన్నిహితంగా మెలిగినందుకు ప్రతిఫలంగా గర్భం దాల్చా. విషయం తెలిసిన వెంటనే సూర్యకి ఫోన్ చేసి అబార్షన్ చేయించుకుంటానని చెప్పా. అలా చేయద్దని, పుట్టిన బిడ్డని కూడా తను చూసుకుంటానని అనడంతో ఏమీ చేయలేక వూరుకున్నాను. తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబు పుట్టిన తర్వాత ఇంటిపనులు చేసుకుని వాడిని చూసుకునే సరికి రోజులు గడిచిపోయేవి. అలా కాలక్రమేణా నా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చి సూర్య ఎందుకు నాకు షరతులు పెట్టాడో అర్థమైంది. నేను, నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలనే తను అంతగా తాపత్రయపడ్డాడని అర్థమైంది. అప్పట్నుంచి నా కుటుంబమే లోకంగా మారిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటున్నా.
సూర్య ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పటికీ నేను, సూర్య మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడూ 'నీతో వచ్చేస్తా' అన్న నా మాటలు గుర్తొస్తే కాస్త సిగ్గనిపించేది. కానీ సూర్య మంచితనం, ఆలోచనా ధోరణి, అతని పరిణతి తలుచుకుంటే అతని పట్ల నాకు గౌరవం రెట్టింపవుతుంది. నా పెళ్లి రోజు సూర్య నాకు ధైర్యం చెప్పకుండా వేరే ఏ నిర్ణయం తీసుకున్నా ఈపాటికి మా జీవితాలు నాశనమైపోయేవి. చిన్నతనంలోనే అంత ఉన్నతంగా ఆలోచించిన అతని వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్.. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వేధించే కసాయిలున్న ఈ రోజుల్లో సూర్యలాంటి నిజమైన ప్రేమికులు చాలా అరుదనే చెప్పచ్చు. మీ జీవితంలోనే కనుక ఇలాంటి వ్యక్తి తారసపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకండి. అలాంటి వ్యక్తి జీవితభాగస్వామిగా లభిస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అలాగని చిన్న వయసులోనే ఆకర్షణకు లోనై, దానినే ప్రేమనుకుని, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోకూడదని గుర్తుంచుకోండి. 'ప్రేమంటే పెద్దల్ని ఎదిరించడం కాదు.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు.. అదే ప్రేమతో జీవితాల్ని బాగుచేసుకోవడం కూడా తెలిసుండాలి!' సూర్య నుంచి నేను నేర్చుకున్న ఈ జీవిత పాఠాన్ని మీ అందరితోనూ పంచుకోవాలనే ఇలా మీ ముందుకొచ్చా.
ఇట్లు,
అనిత