ఆడపిల్లకు అంతంత పెద్ద పెద్ద చదువులెందుకన్నారంతా! అయినా ఆ మాటలు ఆమె చెవికెక్కించుకోలేదు. కారణం ఆమెకు చదువంటే ప్రాణం. వయసొచ్చింది కదా పెళ్లి చేయమని బంధువులు పోరు పెట్టారు.. అయినా తన పూర్తి ధ్యాసను కెరీర్ పైనే ఉంచిందామె. ఇలా ఆమె సంకల్ప బలానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో ఉద్యోగం సంపాదించింది. తాను కోరుకున్న కెరీర్, చక్కటి జీతం.. రెండేళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించింది. అక్కడే తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీవితం సుఖంగా సాగుతోంది.. పిల్లలు పుడితే ఆ సంతోషం రెట్టింపవుతుందనుకుందా జంట. కానీ అంతలోనే మెనోపాజ్ రూపంలో ఆమెకు అనుకోని ఉపద్రవం ఎదురైంది. అప్పటికి ఆమె వయసు కేవలం ముప్ఫై అంటే ముప్ఫై ఏళ్లే! ‘ఇంత చిన్న వయసులోనే ఏంటి నాకీ కష్టం’ అని పిల్లల కోసం పరితపించిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వ మాధురిమలను ఆస్వాదించలేకపోయానే అని బాధపడింది.అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇక చేసేది లేక ఓ పిల్లాడిని దత్తత తీసుకుందామె. అకాలంలో వచ్చిన మెనోపాజ్.. తల్లిని కావాలన్న తన కలను ఎలా కల్లలు చేసిందో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
మెనోపాజ్.. నాకు తెలిసి నలభైలు దాటి ౫౦ ఏళ్ళు సమీపిస్తుండగా మహిళలు ఈ దశలోకి అడుగుపెడుతుంటారు. కానీ మన దేశంలో 1-5 శాతం మంది కనీసం 40 ఏళ్లయినా నిండకముందే మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారు. ఆ జాబితాలో నేనూ ఉన్నా. నా పేరు కావ్య కుల్కర్ణి.. కోల్‌కతాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. సాధారణ కుటుంబమంటే ఎలా ఉంటుందో మీకూ తెలిసే ఉంటుంది. ఆడపిల్లలుంటే ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపితే అంత త్వరగా వారి భారం దిగుతుందని భావిస్తుంటారు. నా అదృష్టం కొద్దీ నా తల్లిదండ్రులు మాత్రం నన్ను, చెల్లిని ఎప్పుడూ అలా భారంగా అనుకోలేదు. అయితే ఈ విషయంలో మా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు మాత్రం మమ్మల్ని, మా పేరెంట్స్‌ని కాస్త ఇబ్బంది పెట్టేవారు.
******
నాకో అన్నయ్య కూడా ఉన్నాడు. వాడు పైచదువులు చదువుతుంటే మాత్రం వాళ్లెవరూ అభ్యంతరం తెలపలేదు కానీ నేను, చెల్లి చదువుకుంటానంటే మాత్రం ‘అయినా ఆడపిల్లలకు అంత పెద్ద చదువులెందుకు? పైగా మీరు ఎక్కువగా చదువుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు కూడా ఉన్నత విద్యావంతులే కావాలంటారు.. దాంతో కట్నం కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది’ అంటూ ఎవరి నోటికొచ్చినట్లు వాళ్లు మాట్లాడేవారు. కానీ నాకేమో చదువంటే ప్రాణం. అమ్మానాన్నలు కూడా వాళ్ల మాటలు పట్టించుకోకుండా ముందు చదువు మీద ధ్యాస పెట్టు అనేవారు. అలా వారి మాటలు నాకు ప్రోత్సాహకరంగా అనిపించాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యా. దీంతో కోల్‌కతాలోనే ఓ టాప్ కాలేజీలో ఇంజినీరింగ్ సీటొచ్చింది. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి.. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తిచేశాను. నా ప్రతిభను గుర్తించి ఓ విదేశీ కంపెనీ నాకు ఉద్యోగం కూడా ఇచ్చింది. యూకేలో ఉద్యోగం, ఆరంకెల జీతం.. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కళ్లముందుకొచ్చినట్లనిపించింది. అమ్మానాన్నలు కూడా ఫుల్ హ్యాపీ..!

ఉద్యోగం కోసం యూకే వెళ్లిపోయాను. అక్కడే పరిచయమయ్యాడు ఛార్లెస్. తనూ అక్కడే వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచోడు.. అందుకే నా మనసుకు నచ్చేశాడు. నేనూ తనకు నచ్చడంతో ఓ బీచ్‌లో ప్రపోజ్ చేశాడు. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. మా ప్రేమ విషయం అమ్మానాన్నలకు చెప్పడంతో వాళ్లు ముందు ‘దేశం కాని దేశం.. అతనెలాంటి వాడో!’ అని కాస్త సందేహించినా ఆ తర్వాత ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా ఇండియాలోనే పెళ్లి చేసుకొని తిరిగి యూకే వెళ్లిపోయాం. హనీమూన్ కోసం గ్రీస్ వెళ్లాం.. జీవితంలో ఎలాంటి లోటూ లేదు.. పైగా ఇద్దరం కెరీర్లోనూ స్థిరపడ్డాం.. పిల్లలు పుడితే మా ఆనందం రెట్టింపవుతుందని డిసైడయ్యాం. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే ముందుగా హెల్త్ చెకప్ కూడా చేయించుకున్నాం.. అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్ చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఆ నెలలో పిరియడ్స్ ఎప్పటిలాగే వచ్చాయి. ఆ తర్వాత నెలకు రావాల్సిన నెలసరి.. ఈసారి పదిహేను రోజులకే వచ్చింది. పని ఒత్తిడి, వల్ల అలా జరిగిందేమో అనుకున్నాం.. ఆ తర్వాత మళ్లీ మూడు నెలల దాకా నెలసరి జాడే కనిపించలేదు.
******
ఈసారి నేను కచ్చితంగా నెల తప్పే ఉంటానేమో అనిపించింది. ఇంట్లోనే పరీక్ష చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. అంతలోనే పిరియడ్స్ రావడంతో మా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇలా ఈ ఏడాదంతా నెలసరి ఒక్కోసారి ముందే రావడం, ఒక్కోసారి నెలల తరబడి రాకపోవడం, నెలసరి వచ్చినా రోజుల తరబడి బ్లీడింగ్ అవడం, ఒక్కోసారి అసలే అవకపోవడం.. వంటి లక్షణాలు చాలా సార్లు గమనించాను. ఇది పెద్ద సమస్య కాదేమోనని ముందు కొన్ని నెలలు నిర్లక్ష్యం చేసినా.. ఆ తర్వాత మాత్రం నా మనసులో ఏదో అనుమానం కలిగింది! అసలు ఎందుకిలా అవుతోందో తెలుసుకోవడానికి ఓసారి వీలు కుదుర్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాను. డాక్టర్ పరీక్ష చేసి నా శరీరంలో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ స్థాయులు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది మెనోపాజ్‌కు ఓ సంకేతమని చెప్పారు. దీంతో ఒక్కసారిగా నేను, మా ఆయన షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే అప్పటికి నా వయసు 30 ఏళ్లే. నాకు తెలిసి మెనోపాజ్ 40-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో వస్తుందన్న విషయం చాలా సార్లు చదివే ఉంటాను. అంతేకానీ ఇంత చిన్న వయసులో మెనోపాజ్‌కు దగ్గరవడమనేది ఇప్పటిదాకా నేనెక్కడా వినలేదు. అయినా ఇప్పటికీ 5-10 శాతం వరకు నేను గర్భం ధరించే అవకాశం ఉందని డాక్టర్ చెప్పడంతో ఏదో చిన్న ఆశ నాలో చిగురించింది.

కానీ రోజులు గడుస్తోన్న కొద్దీ నాలో ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోయాయి.. అంతకంతకూ బరువూ పెరుగుతూ వచ్చాను. దీనికి తోడు తెలిసిన వాళ్లు 'ఇక నీకు పిల్లలు పుట్టే మార్గం లేదేమో' అంటూ సానుభూతితో కూడిన వ్యంగ్యాన్ని ప్రదర్శించేవారు. అన్నింటికంటే ఇవే నన్ను ఎక్కువ బాధ పెట్టేవి. అలా రాన్రానూ పిరియడ్స్ మొత్తానికే ఆగిపోయాయి.. మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టాను. ఇక ఈ జన్మకు నాకు తల్లినయ్యే యోగం లేదన్న విషయాన్ని అతి కష్టం మీద జీర్ణించుకున్నా. చాలా రోజులు నాలో నేనే కుమిలిపోయా. ఈ మానసిక ఒత్తిడితో ఉద్యోగం చేయలేక కొన్ని నెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికే పరిమితమయ్యా.
ఈ ఒత్తిడి నుంచి నేను బయటపడి తిరిగి సాధారణ జీవితం ప్రారంభించానంటే అందుకు ఛార్లెసే కారణం. ‘మనకు పిల్లలు పుట్టకపోతేనేం.. ఓ బాబును దత్తత తీసుకుందాం!’ అన్నాడు. అందుకు అతి కష్టమ్మీద సరే అన్నా.. ఎందుకంటే నేనంటూ సొంతంగా పిల్లల్ని కనలేకపోయానే అన్న బాధ నాలో అలాగే ఉండిపోయింది. మూడేళ్లు గడిచిపోయాయి. నా బాబును చూస్తూ ఆ బాధను మర్చిపోయినా.. ఇప్పటికీ పాత జ్ఞాపకాలు, మెనోపాజ్‌తో నేను ఎదుర్కొన్న మానసిక వేదన అప్పుడప్పుడూ నా మనసును తడుముతూనే ఉంటాయి.
******
ఏదేమైనా మెనోపాజ్ అనేది మన శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఇది కొంతమందిలో జన్యుపరంగా ముందే రావచ్చు.. మరికొందరు ఏ సమస్యా లేకపోయినా ముందే ఈ దశలోకి అడుగుపెట్టచ్చు. అలాంటి వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు.. దానికి తోడు మెనోపాజ్ లక్షణాలతో ఒక్కోసారి మన జీవితం మీద మనకే విరక్తి వస్తుంటుంది.. అలాగని ఆ సమయంలో మన ఆరోగ్యం పట్ల మనమే నిర్లక్ష్యం వహిస్తే మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది.. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి. మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టే క్రమంలో తలెత్తే అనారోగ్యాల్ని ఎదుర్కోవడానికి, మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.. ప్రస్తుతం నేనూ అదే పని చేస్తున్నా. అలాగే చక్కటి ఆహారపుటలవాట్లు కూడా మనల్ని ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వస్తోన్న మార్పుల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం కూడా ముఖ్యమే. ఎందుకంటే నా అనుభవమే ఈ విషయం చెబుతోంది.. నెలసరిలో వచ్చిన మార్పుల్ని ముందు కొన్ని నెలల పాటు నేను అంతగా పట్టించుకోలేదు. ఒకవేళ ముందే నేను ఆస్పత్రికి వెళ్లి ఉంటే తల్లినయ్యేదాన్నేమో! ఏదేమైనా జరిగిందేదో జరిగిపోయింది.. మీరన్నా ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటారని, మెనోపాజ్ గురించి అవగాహన పెంచుకుంటారనే ఉద్దేశంతోనే నా కథను మీతో పంచుకున్నా.. ఉంటాను మరి!