ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..
పొత్తిళ్లలో అమ్మ ప్రేమ, పెరిగి పెద్దయ్యే కొద్దీ నాన్న ప్రేమ, ఆటపాటల్లో తోబుట్టువుల ప్రేమ, జీవితాన్ని పంచుకునే క్రమంలో భాగస్వామి ప్రేమ, అమ్మగా పిల్లలకు పంచే ప్రేమ.. ఇలా జీవితంలో ప్రేమ లేని దశ లేదు. అలాంటి ప్రేమను చిన్నతనం నుంచి నేనూ అనుభవించాను. అమ్మానాన్నలకు నేను, చెల్లి.. మాకు వాళ్లిద్దరూ అన్నట్లుగా ఉంటుంది మా ఇల్లు.. మమతల కోవెలకు ఏమాత్రం తక్కువ కాదు! ఖమ్మంలోని ఇల్లందులో పుట్టిపెరిగాం నేను, చెల్లి. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాం. నా టెన్త్ పూర్తయ్యాక పైచదువుల కోసం అమ్మానాన్న హైదరాబాద్‌కి మకాం మార్చారు. అప్పటిదాకా ఊర్లోనే వ్యాపారం చేసిన నాన్న.. ఇక్కడికొచ్చాక అదే వ్యాపారం కొనసాగించడం మొదలుపెట్టారు. ఏ పని చేసినా ముందుగా నాతోనే మొదలుపెట్టించడం నాన్నకు అలవాటు. నేను మా ఇంట్లో పుట్టిన లక్ష్మీ దేవిని అని, నాతోనే అదృష్టం కలిసొస్తుందని నాన్న ఎప్పుడూ చెబుతుంటే చెప్పలేనంత ఆనందం కలిగేది.
******
నిజానికి నాకు మా నాన్నతో, చెల్లికి మా అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ. అలా మా అందరి ప్రేమాప్యాయతల మధ్య రోజులు క్షణాల్లా గడిచిపోయేవి. ఈలోగా వేసవి సెలవులు పూర్తై.. నేను కాలేజీలో చేరే రోజు రానే వచ్చింది. ‘చదువుకోవాలన్న తపన ఉంటే ఏ కాలేజీలో చదివినా మంచి మార్కులొస్తాయి’ అన్న ఉద్దేశంతో మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఓ జూనియర్ కాలేజ్‌లో నన్ను చేర్పించారు నాన్న. సిటీ లైఫ్‌స్టైల్, కొత్త వాతావరణం, కొత్త కొత్త వ్యక్తులు.. ఎంతైనా కాస్త బెరుగ్గానే ఉంటుంది కదా! కాలేజీలో అడుగుపెట్టిన తొలి రోజు నా ఫీలింగ్ కూడా ఇదే! అలా కొన్ని రోజులు పోయాక అంతా మామూలైపోయింది. ఓ రోజు కాలేజీలో నేను బైక్ పార్క్ చేస్తున్నప్పుడు నన్ను చూశాడు వరుణ్. వెంటనే నా దగ్గరికొచ్చి.. ‘నువ్వు పక్కింట్లో ఉండే మోహన్‌రావు అంకుల్ కూతురివి కదా?’ అనడిగాడు. ‘అవును.. నీకెలా తెలుసు?’ అని ఎదురు ప్రశ్నించా. ‘మీ ఇంటి పక్కనే మా ఇల్లు.. నేనూ ఈ కాలేజీలోనే చదువుతున్నా.. సెకండ్ ఇయర్ స్టూడెంట్‌ని! మొన్న నిన్ను మీ ఇంటి ఆవరణలో చూశా.. మీ నాన్న గారు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు.. అలా వాళ్లిద్దరూ ఫ్రెండ్సయ్యారు!’ అన్నాడు. ఇక అప్పట్నుంచి కాలేజీలోనే కాదు.. ఇంటి దగ్గరా కలిసేవాళ్లం. మ్యాథ్స్‌లో సందేహాలుంటే వరుణే నివృత్తి చేసేవాడు. తను మా కాలేజీలోనే బ్రిలియంట్ స్టూడెంట్. మంచి వ్యక్తిత్వం, నలుగురికీ సహాయం చేసే గుణం అతని సొంతం. తనలో నాకు అది బాగా నచ్చింది.

అలా మేమిద్దరం కొన్ని రోజుల్లోనే మంచి స్నేహితులమయ్యాం. మా ఇంట్లో వాళ్లలాగే వరుణ్ని కలిసినప్పుడల్లా ఎంతో ఆత్మీయ భావన కలిగేది. ఇంతలోనే వరుణ్ సెకెండ్ ఇయర్, నా ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాయి. తనకు వేరే రాష్ట్రంలో ఐఐటీ సీటు రావడంతో చదువు కోసం అక్కడికి వెళ్లిపోయాడు. వాళ్ల కుటుంబం కూడా వేరే చోటికి మారిపోయింది. ఇలా వరుణ్ నాకు దూరంగా వెళ్లిపోయినా అప్పుడప్పుడూ ఫోన్లో నాతో మాట్లాడేవాడు. అయినా నా మనసంతా ఏదో వెలితిగా అనిపించేది. తనూ ఓసారి ఫోన్ చేసి నాతో ఇదే మాట చెప్పాడు. వెంటనే ‘బహుశా.. ఇదేనేమో ప్రేమంటే!’ అనేశాడు. తను అలా అంటుంటే నాలో తెలియని ఆనందం ఉప్పొంగిపోయింది. ముసిముసిగా నవ్వుతూ ఏమీ మాట్లాడుకుండానే ఫోన్ కట్ చేసేశాను. ‘నేను కాస్త బిజీగా ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను’ అని మెసేజ్ చేశాను. తనూ అందుకు సరేనన్నాడు. వరుణ్ తన ప్రేమ విషయం బయటపెట్టినప్పట్నుంచి తనకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేనేమో అనిపించింది. ఆ తర్వాత రెండు రోజులకు నేనే వరుణ్‌కి ఫోన్ చేశా. ‘నువ్వు మొన్న ప్రేమ గురించి చెప్పినప్పట్నుంచి నా మనసు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండనంటోంది.. నువ్వెప్పుడొస్తావ్!’ అని అడిగేశా. వచ్చే నెలలో సెమిస్టర్ పరీక్షలున్నాయి. అవి అయిపోగానే వచ్చేస్తా. ముందు నిన్నే కలుస్తా అన్నాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండిపోయా.
******
రెండు నెలలు క్షణమొక యుగంలాగా గడిచాయి. అంతలోనే వరుణ్ వచ్చేశాడు. నాకు ఫోన్ చేసి మా ఇంటికి దగ్గర్లోని ఓ పార్క్‌కి రమ్మన్నాడు. తను తెచ్చిన ఉంగరంతో అక్కడే నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే నేనూ ఓకే చెప్పేశా. ‘నా చదువు పూర్తయ్యాక పెద్దలతో మాట్లాడి ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అని మాటిచ్చాడు. అలా తన ఐఐటీ పూర్తయ్యాక ఇక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నేనూ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నా. ‘ఎలాగూ వరుణ్‌కి ఉద్యోగం ఉంది.. పైగా నాన్నకు నేనంటే చచ్చేంత ప్రేమ.. నేనడిగితే నాన్న అస్సలు కాదనడు..’ అన్న నమ్మకంతో ఒక రోజు నాన్న దగ్గర వరుణ్ ప్రస్తావన తెచ్చాను. ‘నాన్నా.. ఒకప్పుడు మన పక్కింట్లో వరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు గుర్తుందా? ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.. అప్పుడప్పుడూ అతడు నాకు మ్యాథ్స్‌లో సందేహాలుంటే నివృత్తి చేసేవాడు.. గుర్తొచ్చాడా?’ అని చెప్పగానే.. ‘అవునవును.. చాలా మంచి అబ్బాయి!’ అన్నాడు నాన్న. ‘అతనంటే నాకు చాలా ఇష్టం నాన్నా.. తనకూ నేనంటే ఇష్టం.. ఈ మధ్యే ఇక్కడో కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.. మీరు ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం’ అని ఉండబట్టలేక నాన్నను అడిగేశా. ‘అతని కులం వేరు, మన కులం వేరు.. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే మన బంధువుల మధ్య నేను తలెత్తుకు తిరగలేను.. కావాలంటే మన బంధువుల్లో ఎవరైనా నచ్చితే చెప్పు పెళ్లి చేస్తా.. అంతేకానీ ఇంకోసారి ఆ అబ్బాయి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు.. ఇదే లాస్ట్ వార్నింగ్’ అంటూ కాస్త కోపంగానే బదులిచ్చాడు నాన్న. నిజానికి నాతో మాట్లాడేటప్పుడు నాన్న అంత కోపంగా ఉండడం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు.

ఇదే విషయం వరుణ్‌కి చెబితే.. ‘సరే.. నేను ఓసారి మీ నాన్నగారితో మాట్లాడతాను’ అన్నాడు. ఆ మరుసటి రోజే వరుణ్ ఇంటికి రావడం, నాన్న అతడిని హెచ్చరించి పంపించడంతో నాకు చాలా భయమేసింది. మా పెళ్లికి వరుణ్ అమ్మానాన్నల నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నాన్నను ఎన్నిసార్లు బతిమాలినా ‘దయచేసి నా పరువు పోయే పని చేయకు తల్లీ.. నీకు దండం పెడతా!’ అని అసహనంగా బదులిచ్చేవాడు. అలాగని మేమిద్దరం ఒకరు లేకుండా మరొకరు బతకలేం. ఇక లాభం లేదనుకొని వరుణ్‌కి ఫోన్ చేశా.. ‘వరుణ్.. మా నాన్న ఎంత చెప్పినా వినట్లేదు.. నన్ను తీసుకెళ్లిపో!’ అన్నా. ఇలా నా గదిలో నేను మాట్లాడుతున్న మాటలు నాన్న చెవిన పడతాయనుకోలేదు. వెంటనే కోపంతో నా గదిలోకొచ్చిన నాన్న.. ‘ఎక్కడికే వెళ్తావు.. ఇకపై నిన్ను వరుణ్‌తో అస్సలు కలవనివ్వను!’ అని గదిలో పెట్టి తాళం వేసేశాడు. నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఇలా వారం పాటు ఆ గదిలోనే ఒంటరిగా, భారంగా గడిపాను. ఆ తర్వాత ఎలాగోలా ఇంటి నుంచి పారిపోయి బయటి నుంచి వరుణ్‌కి ఫోన్ చేశా. వెంటనే తను అక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు. మా అత్తమామలే మా ఇద్దరికీ పెళ్లి చేశారు.
******
అది తెలుసుకున్న మా నాన్న అమ్మతో కలిసి పెళ్లి మండపం దగ్గరికే వచ్చి పెద్ద గొడవ చేశారు. ‘సరేలెండి.. జరిగిందేదో జరిగిపోయింది.. కొన్నాళ్లైతే అంతా సర్దుకుంటుంది.. వారిని ఆశీర్వదిద్దాం రండి..’ అని అమ్మ ఎంత ప్రాధేయపడినా నాన్న అసలు మాట వినడే! పట్టరానంత కోపంతోనే అమ్మను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరేలే.. నాన్న కోపం ఎంత సేపు.. నా మీదున్న ప్రేమతో తను అన్నీ అర్థం చేసుకుంటాడు.. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి.. అందరం కలుస్తాం.. అనుకున్నా. ఆ గొడవల మధ్యే ఒక్కటైన మేము కొత్త కాపురం మొదలుపెట్టాం. నిజంగా చెప్పాలంటే.. పెళ్లయ్యాక వరుణ్‌కి నాపై మరింత ప్రేమ పెరిగింది. నన్ను చాలా అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తన ప్రేమ మా అమ్మానాన్నల్నే మరిపించిందంటే తను నన్ను ఎంతగా ప్రేమించేవాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలా అన్యోన్యంగా, ఆనందంగా సాగిపోతోన్న మా జీవితాల్ని చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. ఒక్క రోజులోనే అంతా తారుమారైపోయింది. రోజురోజుకీ నాన్న కోపం తగ్గతుందేమో అనుకొని ఎదురుచూశాను. కానీ ‘నన్ను కాదని నాకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటావా? అందరి ముందు నా పరువు తీస్తావా? నిన్నేం చేస్తానో చూడు!’ అంటూ కోపం పెంచుకుంటూ పోయాడు నాన్న. ఇదే కోపాన్ని వరుణ్ మీద తీర్చుకున్నాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న వరుణ్‌పై దుండగులతో దాడి చేయించాడు. నా వరుణ్ని నాకు కాకుండా చేశాడు. అతడిని నాకు శాశ్వతంగా దూరం చేశాడు. ఈ వార్త విని నా గుండె పగిలింది. నా జీవితమంతా ఒక్కసారిగా శూన్యమైపోయినట్లనిపించింది. నన్నెవరో అగాథంలోకి తోసేసినట్లనిపించింది.
******
వరుణే నా జీవితం అనుకున్నా.. తను లేని జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించుకోలేకపోతున్నా. నాన్నా.. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడమే అదృష్టమన్నావు.. అలాంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కులం కాని కులమని మా పెళ్లిని వ్యతిరేకించావు. ఇప్పుడు మా మానాన మేము బతుకుతుంటే చూడలేకపోయావు.. పరువు పరువు అని నా ఐదో తనాన్ని నాకు కాకుండా చేశావు.. క్షణికావేశంలో నువ్వు విచక్షణ కోల్పోయి చేసిన ఈ పని నీకు పరువు తక్కువ కాదా? సొంత అల్లుడినే పొట్టన పెట్టుకొని నువ్వు నేరస్థుడిగా మారడం వల్ల నీ పరువు పోలేదా? ఇలా చేస్తే సమాజం నిన్ను గౌరవిస్తుందనుకుంటున్నావా? నా ప్రాణాన్నే నా నుంచి వేరు చేస్తే నేను నీ దగ్గరికొస్తాననుకున్నావ్ కదా! నువ్వు చెప్పినట్లుగానే నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాననుకున్నావ్.. ఇదీ నిజమే కదా.. కానీ నేను అలా ఎప్పటికీ చేయను.. చేయలేను! ఎందుకంటే నా జీవితం ఉన్నంత వరకు వరుణే నా భర్త. రోజులు గడుస్తున్నా అతని జ్ఞాపకాలే నన్ను మెలిపెడుతున్నాయి. నేను తిరిగి కొత్త జీవితం ప్రారంభించడానికి అవే నాకు పునాది. ఇక చేసింది చాలు నాన్నా.. దయచేసి ఇప్పటికైనా నన్ను ఇలా ఒంటరిగా వదిలెయ్.. భవిష్యత్తు గురించి వరుణ్-నేను కన్న కలల్ని నెరవేర్చడమే ప్రస్తుతం నా ముందున్న తక్షణ కర్తవ్యం. నాకు ఆ శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా..!
******
ఇక చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రేమ అనేది శాశ్వతమైనది. పరువు పేరుతో చేసే ఇలాంటి హింసాత్మక చర్యలతో దాని విలువ తెలుసుకోకుండా ప్రవర్తించద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రేమ విషయం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ‘నేను ఫలానా అబ్బాయిని/అమ్మాయిని ప్రేమించాను.. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. మీ అనుమతి కావాల’ని అడిగితే ముందూ వెనకా ఆలోచించకుండా కోపంతో విరుచుకుపడకండి.. కులం, మతం, జాతి, రంగు.. ఇవన్నీ మనకు మనం సృష్టించుకున్నవే! కాబట్టి వాటిని సాకులుగా చెప్పే కంటే మీ పిల్లలు ఇష్టపడే వారి నేపథ్యం మంచిదా? కాదా?, వారిని చేసుకుంటే సుఖపడతారా? అనే విషయంలో అన్ని కోణాల నుంచి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. అవసరమైతే వారు సెటిలయ్యేదాకా ఆగి ఆపై వారిని ఒక్కటి చేయండి. అంతేకానీ.. వారిపై అనవసరంగా కక్ష పెంచుకొని, క్షణికావేశం ప్రదర్శించి వారి జీవితాలు నాశనం చేయద్దు.. మిమ్మల్ని మీరు నష్టపరచుకోవద్దు.. నా స్వీయానుభవంతో చెబుతున్నా.. దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా!
ఇట్లు,
ఓ అభాగ్యురాలు