వారిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఉండే ప్రదేశాలు, ఆఫీస్ సమయాలు కూడా ఒకటే కావడంతో రోజూ కారులో కలిసే ఆఫీస్‌కి వచ్చి వెళ్తుంటారు. కరోనా కారణంగా బయట తగిన రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ‘హమ్మయ్య.. నాకు నా కొలీగ్ కారైనా ఉంది.. ఈ సౌకర్యం కూడా లేక తిప్పలు పడే వారు ఎందరో!’ అంటూ సంతోషించిందా అమ్మాయి. కానీ ఆ సంతోషం అంతలోనే ఆవిరవుతుందని, తాను సౌకర్యం అనుకున్న ఆ కారే తన పాలిట కామ పాశమవుతుందని ఊహించలేదా యువతి. ఒక తోబుట్టువుగా తాను నమ్మిన వ్యక్తే తన కోరిక తీర్చమంటూ అడిగే సరికి జీర్ణించుకోలేకపోయిందామె. ఇక ఈ ఘోరాన్ని ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలైంది మరో మహిళ. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయానికి కుంగిపోవాలో, తన వల్ల సాటి మహిళ కోరి కష్టాలు కొని తెచ్చుకుందని బాధపడాలో తెలియని అయోమయంలో ఆ చేదు జ్ఞాపకాన్ని పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

ఎటు పోతోంది మన సమాజం.. ఏమైపోతోంది మనుషుల్లోని మానవత్వం..! ఆడపిల్ల అంటే ఆ దృష్టితో చూసే వారే తప్ప.. నాకూ ఓ అక్క/చెల్లి ఉంది.. వారినీ ఇతరులు అలా చూస్తే నేను తట్టుకోగలనా..? అని ఆలోచించే మగాళ్లు అసలున్నారా అనిపిస్తుంది మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే! ఇప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి మాత్రమే నేను మీ ముందుకు రాలేదు.. నమ్మకస్తుడంటూ నమ్మి వారి చేతుల్లో మోసపోకుండా ముందుగానే ప్రతి ఆడపిల్లా జాగ్రత్తపడాలని, ఆపద ఎదురైతే తిప్పికొట్టే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెప్పడానికే నా కథను మీ అందరితో పంచుకుంటున్నా.
******
నా పేరు శాలిని. మాది హైదరాబాద్. నాన్న ఉద్యోగ రీత్యా పదేళ్ల క్రితమే పుణే వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. మా ఇంట్లో అమ్మా, నాన్న, నేను, చెల్లి.. హాయిగా, ఆనందంగా రోజులు గడిచిపోయేవి. ఎంటెక్ పూర్తి చేసి మూడేళ్ల క్రితమే పుణేలోనే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఐదంకెల జీతం, అమ్మానాన్నకు భారం కాకుండా నా కాళ్లపై నేను నిలబడ్డానన్న సంతృప్తి.. ఒక ఆడపిల్లకు ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించింది. అలాగని చిన్ననాటి నుంచి నాతో పాటే పెరుగుతూ వచ్చిన నా ఐఏఎస్ కలను నేను మర్చిపోలేదు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. ఇంటికొచ్చాక సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేరయ్యేదాన్ని. ఇలా బిజీబిజీగా జీవితం గడిచి పోతోంది. అంతలోనే కరోనా వచ్చి అందరి జీవన శైలినీ మార్చేసింది. హాయిగా, ఓ పద్ధతి ప్రకారం సాగుతోన్న జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసేసింది.
******
సరిగ్గా కరోనా లాక్డౌన్ విధించడానికి రెండు నెలల ముందు మా ఆఫీస్‌లో జాయినయ్యాడు సాకేత్. తనదీ హైదరాబాదేనట! అయితే ఉద్యోగ రీత్యా తనొక్కడే పుణే వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదీ మా కాలనీలోనే ఉందని తను పరిచయమయ్యాక గానీ నాకు తెలియలేదు. రెండు నెలల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. అంతలోనే కరోనా లాక్డౌన్ విధించడంతో ఇంటి నుంచే పనిచేసే ఆప్షన్ ఇచ్చింది మా కంపెనీ యాజమాన్యం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు రెండు విధాలుగా కలిసొచ్చింది. ఒకటి.. నేను రోజూ బస్‌లో ఆఫీస్‌కి వెళ్లొచ్చేదాన్ని.. కాబట్టి లాక్డౌన్ విధించడంతో ఆ సౌకర్యం లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. ఇక రెండోది.. నా సివిల్స్ ప్రిపరేషన్ కోసం నాకు మరింత సమయం దొరికినట్లయింది.

ఇలా ఇంటి నుంచి పనిచేస్తున్నా కూడా.. ఆఫీస్ మీటింగ్స్‌లో భాగంగా రోజూ సాకేత్ నాతో మాట్లాడేవాడు. అప్పుడప్పుడూ తన వర్క్ విషయంలో సందేహాలున్నాయని మా ఇంటికొచ్చేవాడు. అలా ఇద్దరం కలిసి నా గదిలోనే వర్క్ చేసుకునేవాళ్లం. ఇక లాక్డౌన్ ముగిసి తిరిగి ఆఫీస్ ప్రారంభమయ్యే నాటికి మా ఇద్దరికీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎందుకో తనను కలిసినప్పుడల్లా, తనతో మాట్లాడినప్పుడల్లా నాకు అన్నయ్య లేని లోటు తీరిపోయేది. ఇక క్రమంగా లాక్డౌన్ సడలింపులివ్వడంతో మా ఆఫీస్ కూడా తిరిగి ప్రారంభమైంది. అంతా బాగానే ఉంది.. కానీ బస్సులు, ఆటోలు లేకుండా ఆఫీస్‌కి వెళ్లేదెలా? అని ఆలోచించా. ఒకట్రెండు రోజులు నాన్నే నన్ను ఆఫీస్ దగ్గర వదిలిపెట్టినా సాయంత్రం వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఒక రోజు ఏదో మాటల సందర్భంలో ‘అవును.. బస్సులు లేవు కదా! నువ్వు రోజూ ఎలా వస్తున్నావ్?’ అని అడిగాడు సాకేత్. నేను పడుతోన్న తిప్పలేంటో అతనికి చెప్పా. ‘ఎందుకంత కష్టపడడం.. నాతో కారులో రావచ్చుగా!’ అన్నాడు.. ‘ఉండేది ఒకే చోట.. ఇద్దరి టైమింగ్స్ కూడా ఒకటే.. థ్యాంక్ గాడ్’ అని ఆ దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని సాకేత్‌తో సరేనని చెప్పా.
******
ఇలా ఇద్దరం కలిసి కారులో ఆఫీస్‌కి రావడం, వెళ్లడం.. మాకు షరా మామూలైపోయింది. అమ్మానాన్నలు కూడా సాకేత్‌ని కన్న కొడుకులా చూసుకునే వారు. అయితే ఓ రోజు ఆఫీస్‌లో మీటింగ్ ఉండడంతో కాస్త ఆలస్యమైంది. ముందే ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పాను కాబట్టి వాళ్లు కంగారు పడలేదు. ఎప్పటిలాగే నేను, సాకేత్ కారులో ఇంటికి బయల్దేరాం. అంతలోనే వర్షం కూడా మొదలైంది.. దానికి గాలి కూడా తోడవడంతో రిస్క్ చేయడం ఎందుకొని మధ్యలో ఒక దగ్గర కారు ఆపాడు సాకేత్. ఆ సమయంలోనే ఆఫీస్ విషయాలతో మొదలైన మా మాటలు వ్యక్తిగత విషయాల దాకా చేరుకున్నాయి. ఎందుకో రోజులా కాకుండా ఆ రోజు సాకేత్ మాటలు చాలా తేడాగా అనిపించాయి. అవసరం లేకపోయినా నా దగ్గరగా జరగడం, నా మీద చేయి వేయడం.. ఇలా తన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. అంతలోనే ‘శాలూ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. ఈ విషయం ఎప్పట్నుంచో చెబుదాం అనుకుంటున్నా.. నా కోరిక తీరుస్తావా ప్లీజ్.. ప్లీజ్.. ఒక్కసారే! ’ అంటూ నా మీదమీదకొచ్చాడు. వద్దని వారించినా వినకుండా.. నా అరుపులు ఎవరికీ వినిపించకుండా కారు అద్దాలన్నీ లాక్ చేసేశాడు.

కనీసం నా అభిప్రాయం చెప్పే సమయం కూడా ఇవ్వకుండా నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే అదే సమయంలో నా అరుపులు అటుగా కారులో వెళ్తోన్న భార్యాభర్తల చెవిన పడ్డాయి. ‘ఇక్కడెక్కడో ఆడపిల్ల అరుపులు వినిపిస్తున్నాయి..’ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిందావిడ. నా మీద జరుగుతోన్న అత్యాచారాన్ని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో కారు గ్లాస్ డోర్స్ బద్దలు కొట్టడానికి ఆ భార్యాభర్తలిద్దరూ ప్రయత్నిస్తుండగా.. అది గమనించిన సాకేత్.. కారులో నుంచి నన్ను బయటికి తోసేశాడు. అదే కారుతో ఆమెను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను.. వాళ్ల కారులోనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాం. పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు.. నా లాంటి అభాగ్యురాలిని కాపాడడానికి వచ్చి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారావిడ. ఈ ఘటన జరిగి నెల రోజులైంది.. జరిగిందంతా అమ్మానాన్నలకు చెప్పి సాకేత్ మీద కేసు పెట్టాం.. తోబుట్టువులా భావించి నమ్మిన నన్ను తేనె పూసిన కత్తిలా గాయపరిచాడంటే ఇప్పటికీ నాకు ఇదంతా కలలాగే అనిపిస్తోంది. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నాకు జరిగిన అన్యాయానికి బాధపడి కుమిలిపోవాలో.. లేదంటే నా వల్ల మరొకరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని బాధపడాలో.. ఇలా నా జీవితమంతా అగమ్యగోచరంలా తయారైంది.
******
అలాగని నేను ఈ బాధలోనే ఉండిపోవాలనుకోవట్లేదు. నాకు జరిగిన ఈ అవమానంతో నాలుగ్గోడలకే పరిమితం కావాలనుకోవట్లేదు. ఎలాగైనా సాకేత్‌కు శిక్ష పడేలా చేస్తా. ఐఏఎస్ కావాలన్న నా జీవితాశయాన్ని నెరవేర్చుకుంటా. కలెక్టర్‌నై ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనే మొన్నటిదాకా నా మనసులో ఉండేది. కానీ ఇప్పుడు దానికి తోడు ఆడపిల్లల రక్షణ కూడా నా ముందున్న లక్ష్యాల్లో ఒకటనిపిస్తోంది. అయితే అమ్మాయిలందరికీ మరో విషయం చెప్పాలి.. ఎంత పరిచయం ఉన్నా బయటి వ్యక్తుల్ని పూర్తిగా నమ్మకండి.. బంధువులూ పక్కలో బళ్లాలయ్యే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి.. నా అనుభవం నాకు నేర్పిన పాఠమిది! ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేకపోతున్నా!