పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, అధిక రక్తస్రావం, మూడ్ స్వింగ్స్.. ఇలా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని తీసుకొస్తుంది నెలసరి. ఇలాంటి ప్రతికూల సమయంలో మనమైతే ఏం చేయాలనుకుంటాం.. హాయిగా వేడివేడి నీళ్లతో స్నానం చేసి.. రోజంతా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. కనీసం మనకు ఆ అవకాశమైనా ఉంది.. కానీ రాత్రింబవళ్లు కరోనా బాధితులకు సేవ చేయడంలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు పిరియడ్స్ సమయంలోనూ విధులకు హాజరు కావాల్సిందేనని అంటోంది ఓ యువ వైద్యురాలు. రక్తస్రావం ఎక్కువైనా ఏడెనిమిది గంటల పాటు శ్యానిటరీ న్యాప్కిన్ మార్చుకోవడానికి కూడా వీల్లేని దుర్భర స్థితి ఒకవైపు, వేడి పుట్టించే పీపీఈ కిట్లు మరోవైపు.. అంటూ కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో తనకెదురైన కొన్ని సవాళ్లను, అనుభవాలను మన ముందుంచే ప్రయత్నం చేశారామె.

హాయ్.. నా పేరు సౌధామినీ కౌర్. గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో గత నాలుగేళ్లుగా డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నతనం నుంచి నేను కలలు కన్న వైద్య వృత్తిలోకి ప్రవేశించానన్న ఆనందం ప్రస్తుత పరిస్థితుల్లో మరింత రెట్టింపవుతోంది. ఇందుకు కారణం.. కరోనా రోగులకు సేవలందించడమే! ఈ క్రమంలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని అందరూ దేవుళ్లుగా భావిస్తున్నారు. నిజానికి అందరిలో ఉన్న ఈ ఫీలింగే ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అయినా ఈ క్రమంలో నాకెదురైన కొన్ని అనుభవాలను, సవాళ్లను మీ అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చా.
******
వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టి ఐదు నెలలవుతోన్నా.. దాని తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. అన్ని ఆసుపత్రుల్లాగే మా ఆసుపత్రికీ మొదట్లో వైరస్ బాధితులు పదుల సంఖ్యలో వచ్చేవారు. కానీ రోజురోజుకీ ఈ సంఖ్య వేలల్లోకి చేరుకోవడంతో మా పని గంటలూ పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రోజుకు 12-16 గంటలు విధుల్లోనే గడపాల్సి వస్తోంది. అయినా నాకు బాధ లేదు. కానీ నెలకోసారి వచ్చే పిరియడ్స్ సమయంలో మాత్రం నాలాంటి మహిళా వైద్యులు, నర్సుల బాధ వర్ణనాతీతం! ఓవైపు పీపీఈ కిట్లు, మరోవైపు నిర్ణీత సమయంలో శ్యానిటరీ న్యాప్కిన్లు మార్చుకునే వెసులుబాటు లేకపోవడంతో ఆ రోజులు ఎంత త్వరగా గడిచిపోతే అంత బాగుండనిపిస్తుంటుంది.

వైరస్ మన దేశంలోకి వచ్చిన తొలినాళ్లలో కొన్ని రోజుల పాటు పీపీఈ కిట్లు లేకుండానే కేవలం మాస్కులు, గ్లౌజులు ధరించి విధులు నిర్వర్తించాం. కానీ తీవ్రత పెరుగుతున్న కొద్దీ పీపీఈ కిట్లు మా రోజువారీ జీవితాల్లో భాగమయ్యాయి. గాలి ప్రసరించని ఈ కిట్లు ధరించి ఏడెనిమిది గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దాంతో శరీరం ఉక్కపోతతో ఉడికిపోతుంటుంది.. అలాగని వీటిని మధ్యలో తొలగించుకోకుండా గరిష్టంగా ఎనిమిది పాటు అలాగే ఉంచుకోవాలి. కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో డైపర్లు ధరిస్తున్నాం. అయితే నెలసరి సమయంలో డైపర్లతో పాటు శ్యానిటరీ న్యాప్కిన్ కూడా వేసుకోవాల్సిందే! సాధారణంగానే నాకు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటుంది. అలాంటిది ఒక్క న్యాప్కిన్లోనే అన్ని గంటలు గడపడమంటే కష్టం. అందుకే రెండు న్యాప్కిన్లు ఉపయోగిస్తున్నా. ఒక్కోసారి ట్యాంపూన్స్ని కూడా వాడుతున్నా.
******
న్యాప్కిన్స్ అయినా ట్యాంపూన్స్ అయినా.. నిర్ణీత వ్యవధిలో మార్చుకోకపోతే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇక ఈ సమయంలో ఎదురయ్యే శారీరక నొప్పులు భరించి విధుల్లో కొనసాగడమంటే కత్తి మీద సామే! అలాంటి అనుభవం ఈ మధ్యే నాకు ఎదురైంది. అది నాకు పిరియడ్స్ మొదటి రోజు. ఎప్పటిలాగే తగిన జాగ్రత్తలతో విధులకు హాజరయ్యా. కడుపునొప్పి, నీరసం నన్ను నిల్చోనివ్వట్లేదు.. కూర్చోనివ్వట్లేదు. అదే సమయంలో ఓ కరోనా రోగి ఐసీయూలో చేరాడు. ఆ బాధ్యత నా భుజాలపై పడింది. అయినా దాదాపు ఆరు గంటల పాటు ఆ వ్యక్తికి చికిత్స అందిస్తూ నిరంతరం కనిపెట్టుకుంటూ ఉన్నా. దీంతో రోగి ఆరోగ్య పరిస్థితిలో కాస్త పురోగతి రావడంతో ఊపిరి పీల్చుకున్నా. సదరు వ్యక్తికి చికిత్స చేసే క్రమంలో నా శారీరక నొప్పులు, అసలు నేను పిరియడ్స్‌లో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయా.. నిజానికి ఇలాంటి సీరియస్ కేసులొచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా.. ఎదుటివారికి అపాయం కలగకుండా కాపాడగలిగితే ఆ ఆనందం, సంతృప్తి ఎలా ఉంటుందో అప్పుడు నాకు అర్థమైంది.

పిరియడ్స్ అనే కాదు.. కొందరు కొత్తగా తల్లైన మహిళా వైద్యులు కూడా కొవిడ్ రోగులకు చికిత్స చేసే వైద్య సిబ్బందిలో ఉంటారు. వారి పరిస్థితి మరీ దయనీయం! ఓవైపు విధుల్లో కొనసాగాలన్న తపన, మరోవైపు తమ వల్ల తన చిన్నారికి ఎలాంటి ప్రమాదం వస్తుందోనన్న భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నా స్నేహితురాలిదీ ఇదే పరిస్థితి! తను ఇక్కడే మరో ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఏడు నెలల క్రితమే తల్లైన ఆమె.. వైరస్ భయంతో తన చిన్నారికి పాలివ్వడానికి కూడా భయపడుతోంది. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బ్రెస్ట్ఫీడింగ్ని కొనసాగిస్తోంది. ఉదయం హాస్పిటల్‌కి వచ్చేటప్పుడు, ఇంటికెళ్లాక.. రాత్రుళ్లు నిర్ణీత వ్యవధిలో నిద్ర లేచి మరీ తన బాబుకు పాలు పడుతోంది. అయితే ఈ క్రమంలో తనకు రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇక తల్లికి పాలు ఉత్పత్తి కావాలంటే నిర్ణీత వ్యవధిలో ఆహారం తీసుకోవాలి.. నీళ్లు ఎక్కువగా తాగాలి.. కానీ తాను విధులకు హాజరయ్యాక ఏడెనిమిది గంటల పాటు పీపీఈలోనే ఉండడం వల్ల ఆహారం తీసుకునే అవకాశమే లేకుండా పోతోంది.
******
అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ విధులు నిర్వర్తించడం అనేది మేం బాధగా ఫీలవ్వట్లేదు.. అది మా బాధ్యత అనుకుంటున్నాం. మరి, ఇలా మాకు ఎదురయ్యే సవాళ్లను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే.. అందుకూ ఓ కారణముంది. ప్రస్తుతం చాలామంది వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని వార్తలు రావడంతో ఆ అలక్ష్యం మరింతగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొంతమందైతే కనీసం మాస్క్ కూడా ధరించట్లేదు. నలుగురిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే సామాజిక దూరం పాటించట్లేదు. కొందరైతే పార్టీలు, పెళ్లిళ్లకూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం మిమ్మల్నే కాదు.. మీ కుటుంబ సభ్యులను, మీ చుట్టూ ఉన్న వారిని సైతం ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా వైద్యులపై పడుతోంది. అయినా మాకు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఎంతమందికైనా సేవ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం..! కానీ తెలిసి తెలిసి ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం కంటే ముందుగానే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌కు దూరంగా ఉండడం మంచిది కదా! అందుకే ఓ వైద్యురాలిగా కాదు.. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా.. అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి.. లేదంటే ఇంట్లోనే ఉండండి.. మీ వల్ల మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి..! ఇలా మేం పడుతోన్న కష్టాన్ని గుర్తించి కనీసం కొంతమందిలో అయినా మార్పొచ్చి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తపడతారన్న సదుద్దేశంతోనే నా అనుభవాలను మీ అందరితో పంచుకున్నా.. థ్యాంక్యూ!!