గత ఆరు నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. కొవిడ్ రోగులకు సేవలందించే క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో కేరళకు చెందిన ఓ నర్సు కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్న ఆమె ఇటీవల కరోనాను జయించింది. ఈ సందర్భంగా హోం ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే కొవిడ్ నుంచి వేగంగా కోలుకున్నానని చెబుతున్న ఆమె కరోనా కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...
ఆ వార్త వినగానే ఎంతో వూరట కలిగింది!
‘నా పేరు షెర్లీ జాయ్. కేరళ రాష్ట్రంలోని పూలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పని చేస్తున్నా.. ఈ నెల 5న నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓ దంత వైద్యుడి తల్లికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. ఆమెతో కాంటాక్ట్ అయినందుకు నాకూ ఈ మహమ్మారి అంటుకుంది. ఈ విషయం తెలియగానే నాకు కొంచెం భయమేసింది. నా భర్త, ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరినీ వదిలి ఆస్పత్రికి వెళ్లాలంటే కొంచెం టెన్షన్‌కు గురయ్యాను. ఇదే సమయంలో జిల్లా వైద్యాధికారి నుంచి నాకో సమాచారం అందింది. ఏవిధమైన కరోనా లక్షణాలు కనిపించని ఆరోగ్య సిబ్బంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చనేదే ఆ సమాచార సారాంశం. ఈ వార్త వినగానే నా మనసుకు కొంచెం వూరట కలిగింది.’

ఆడియో సందేశం ద్వారా అలర్ట్ చేశాను!
‘నాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగానే స్థానిక వైద్యులు మా కుటుంబ సభ్యులందరి శాంపిల్స్ కూడా సేకరించారు. దురదృష్టవశాత్తూ మా నాన్నకూ కరోనా సోకిందని తేలింది. వయసు రీత్యా ఆయనను వెంటనే కరోనా ఆస్పత్రికి తరలించారు. నేను మాత్రం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాను. ఇక నాకు కరోనా సోకిందనే విషయాన్ని వాట్సప్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాను. ఇందులో భాగంగా ఒక ఆడియో సందేశాన్ని అన్ని గ్రూపుల్లో షేర్ చేసి నన్ను కలిసిన వారందరూ హోం క్వారంటైన్లో ఉండిపోవాలని విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అప్డేట్స్ ఇచ్చాను. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారందరూ నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. కరోనాపై పోరులో నాకు అండగా నిలిచారు.’

మరింత కుంగుబాటుకు గురయ్యేదాన్నేమో!
‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక కూడా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. వైద్యుల సూచనలతో పాటు ఎప్పటిలాగే నా డైలీ ఆహారపు అలవాట్లను ఫాలో అయ్యాను. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవడం వల్ల నా మనసు మరింత తేలికైందనుకుంటాను. ఎందుకంటే ఆస్పత్రికి వెళ్లి ఉంటే నా భర్త, పిల్లల గురించిన ఆలోచనలు నన్ను మరింత కుంగుబాటుకు గురిచేసేవి. ఫలితంగా నేను ఇంత త్వరగా కరోనా నుంచి కోలుకునేదాన్ని కాదేమో!’

ఇంట్లో చికిత్స తీసుకుంటే ఒత్తిడిని జయించవచ్చు!
‘ప్రస్తుతం దేశంతో పాటు కేరళలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఎంతోమంది వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ కారణంగా పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు బెడ్లు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కరోనా పాజిటివ్‌గా తేలి ఎలాంటి లక్షణాలు లేనివారు ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోం ఐసోలేషన్ ట్రీట్మెంట్ కారణంగా కరోనా బాధితులు కుంగుబాటుకు గురికాకుండా కాపాడవచ్చు. దీంతో వారు వేగంగా వైరస్‌పై విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఇంట్లో స్వీయ నిర్బంధం పాటించే కరోనా బాధితులు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో ఎడం పాటించాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవడం వల్ల నేను వారంలోనే కరోనా నుంచి కోలుకున్నాను. నాకు నెగెటివ్ వచ్చినప్పటికీ కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం మరో వారం రోజులు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. త్వరలోనే నేను మళ్లీ నర్సుగా రోగులకు సేవలందిస్తాను’ అని చెబుతోంది షెర్లీ జాయ్.