కరోనా...పేరు వింటేనే వెన్నులో వణుకు తెప్పిస్తోన్న ఈ వైరస్ ఏ మాత్రం శాంతించడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. ప్రత్యేకించి లాక్డౌన్ సడలింపుల తర్వాత కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ మహమ్మరి పేరు వింటేనే హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ 130 రోజుల పాటు కరోనాతో పోరాడి కోలుకుంది. తన చికిత్సా కాలంలో 105 రోజులు వెంటిలేటర్‌పైనే ఉన్న ఆమె మానసిక స్థైర్యంతో ఈ మహమ్మారిని ఓడించింది. తద్వారా తనలాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, కరోనా బాధితులకు వూరటనిచ్చింది.
105 రోజులు వెంటిలేటర్ పైనే...!
కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. గతంతో పోల్చితే ప్రస్తుతం కేసులు తగ్గినా... మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఈ వైరస్ అక్కడ స్వైరవిహారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలాదిమంది ఈ రాకాసి వైరస్‌కు బలయ్యారు. ఈ క్రమంలో సౌతాంప్టన్‌లో నివాసముంటున్న 35 ఏళ్ల ఫాతిమా బ్రిడిల్ కూడా మార్చిలో కరోనా బారిన పడింది. అదే సమయంలో న్యుమోనియా, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు ఆమెను చుట్టుముట్టడంతో మృత్యువు అంచుల దాకా వెళ్లింది. 130 రోజుల చికిత్సా కాలంలో 105 రోజులు వెంటిలేటర్‌పైనే గడిపిన ఆమె ఎట్టకేలకు కరోనా నుంచి కోలుకుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ తమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెబుతూ ఆమె భర్త ట్రేసీ మీడియాతో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

అక్కడ చాలామంది దగ్గుతూనే ఉన్నారు!
‘హాయ్... నా పేరు ట్రేసీ. ఫాతిమాకు, నాకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మా దాంపత్య బంధానికి గుర్తుగా నలుగురు పిల్లలు ఉన్నారు. మార్చి ప్రారంభంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో అంతకుముందే మేం నా సతీమణి సొంతదేశమైన మొరాకో వెళ్లాం. అయితే మేం మళ్లీ సౌతాంప్టన్‌కు రావాలనుకుని విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. మార్చి 6న మేం మొరాకో నుంచి బయలుదేరి లండన్‌లో ల్యాండ్ అయ్యాం. అక్కడి నుంచి సౌతాంప్టన్‌కు బయలుదేరే సమయంలో లండన్‌లోని విమానాశ్రయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. అక్కడ చాలామంది చైనీయులు, హాంకాంగ్ దేశస్థులు ముఖానికి మాస్కులు ధరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లోకి వస్తుండడాన్ని గమనించాం. అందులో చాలామంది దగ్గుతూ కనిపించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు కానీ, సిబ్బంది కానీ కరోనా గురించి మాకెలాంటి జాగ్రత్తలు వివరించలేదు. దీంతో మేం ఎప్పటిలాగానే ప్రయాణం చేసి తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు సౌతాంప్టన్ లోని మా ఇంటికి చేరుకున్నాం. ప్రయాణంలో బాగా అలసిపోవడంతో నాకు బాగా నిద్రపట్టేసింది. బాగా చలిగా అనిపించడంతో శరీరాన్ని దుప్పట్లతో కప్పేసుకున్నా. అయితే సుమారు 24 గంటల పాటు బెడ్‌పై నుంచి కదల్లేకపోయాను. దీంతో నా భార్య కొంచెం కలవరపడింది. దీంతో ‘ఇది సాధారణ ఫ్లూనే.. భయపడొద్దు’ అని తనకు ధైర్యం చెప్పాను. అలా ఐదురోజులు గడిచిపోయాయి. అయితే మార్చి 12న నా భార్య కూడా తీవ్ర అనారోగ్యానికి గురయింది. తన బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. తనకు శ్వాస కూడా సరిగా ఆడడం లేదని చెప్పడంతో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాను.’
అలా ఆస్పత్రికి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు!
‘అప్పటికే దేశమంతా లాక్డౌన్లో ఉంది. బ్రిటన్‌లో సుమారు 590 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది చనిపోయారు. ఇక నేను ఫోన్ చేయగానే హజ్మత్ సూట్లు ధరించిన కొంతమంది వైద్యులు మా ఇంటి ముందు దిగారు. దీంతో నేను కొంచెం ఆందోళనకు గురయ్యాను. వారు ఫాతిమాకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయాలన్నారు. అయితే నేను కూడా ఫాతిమా వెంట ఆస్పత్రికి వస్తానని వాళ్లను కోరాను. అయితే నాకు వెన్నెముకకు సంబంధించిన సమస్యలుండడంతో నిబంధనల ప్రకారం నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వారు అంగీకరించలేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ఆస్పత్రికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక నా భార్యను జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వారితో పంపించాను.’

ఇక నా భార్య నాకు దక్కదేమో అనుకున్నా!
‘మార్చి 12న సౌతాంప్టన్‌లోని జనరల్ ఆస్పత్రిలో నా భార్యకు చికిత్స ప్రారంభమైంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆరు రోజుల అనంతరం ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. రెండోవారంలో న్యుమోనియా కూడా సోకడంతో తన హెల్త్ కండిషన్ మరింత విషమించింది. చికిత్సకు స్పందించేలా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు నాతో చెప్పారు. అదే సమయంలో ప్రపంచమంతటా పెరుగుతున్న కొవిడ్ కేసులు, చికిత్స పొందుతూనే చనిపోతున్న వారిని చూసి నాకు చాలా భయమేసింది. ఫాతిమా ఇలా ఆస్పత్రి పాలుకావడానికి నేనే కారణమనుకుని మనసులో నన్ను నేను నిందించుకున్నా. ఇక మూడోవారంలో కూడా తన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు. తన వూపిరితిత్తులు కూడా దెబ్బతినడంతో 40 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ సమయంలో ఫాతిమా ఇక నాకు దక్కదేమో అనుకున్నా.! తన ఆరోగ్యం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉన్నా. అదే సమయంలో నా ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు.’

నాలుగు నెలలు ఆస్పత్రిలోనే !
‘ఏప్రిల్ నెలంతా నా భార్య కోమాలోనే ఉండిపోయింది. దీంతో నేను నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే ఆ మాసాంతంలో ఫాతిమాలో కరోనా లక్షణాలు తగ్గిపోయాయని అక్కడి వైద్యులు నాకో తీపి కబురు చెప్పారు. అయితే న్యుమోనియా కారణంగా మరికొన్ని రోజులు వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందించాలన్నారు. తన శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించడానికి అవసరమైన ప్రత్యేక చికిత్సను ప్రారంభించారు. దీంతో క్రమంగా తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. రెండున్నర వారాల క్రితం తనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శ్వాస కూడా సులభంగా తీసుకుంటోంది. అలా నా భార్య నాలుగు నెలలు కరోనాతో పాటు ఇతర సమస్యలతో పోరాడి విజయం సాధించింది. తను కోలుకోవడం చూసి తనకు చికిత్స అందించిన వైద్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నా సతీమణిని ఇంటికి తీసుకెళ్లబోతున్నా’ అంటూ చెబుతున్నాడు గ్రేసీ.
ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది!
ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ వైద్యులే తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారంటోంది. ‘ ఈ ఉపద్రవం నుంచి కోలుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు వైద్యం చేసి వూపిరి పోసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ కొత్త జీవితం మీరందించిన వరమే. ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది’ అని చెబుతోంది ఈ కరోనా యోధురాలు.
ఈక్రమంలో బ్రిటన్ దేశానికి సంబంధించి అత్యధిక రోజుల పాటు చికిత్స తీసుకుని కరోనాను జయించిన మహిళగా గుర్తింపు పొందారు ఫాతిమా. మరి ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక స్థైర్యంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ఏంటి...ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోవచ్చని ఈమెను చూస్తే అర్థమవుతుంది కదూ...!