ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒక అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు కలవడం వల్ల, ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడుతున్నారా? లేక కేవలం ఆకర్షణతోనే ఒక్కటవుతున్నారా? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !

హాయ్.. నా పేరు రాగిణి. నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నాకు రాజేష్ పరిచయం. మొదట్లో తోటి స్నేహితుల్లో ఒకడిగా ఉండేవాడు కానీ పదో తరగతికి వచ్చే సరికి మాత్రం నా మనసులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇలా ఎందుకు జరిగిందో నాకే అర్థమయ్యేది కాదు. బహుశా.. ఇదేనేమో ప్రేమంటే అనుకునేదాన్ని. ఉదయం ఇంటి నుంచి స్కూలుకి వెళ్లినా, సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లే వాళ్లం. ఆరోగ్యం బాగోలేక ఎప్పుడైనా స్కూల్ మానేసినా సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం ఇద్దరం కలవాల్సిందే. ఇలా స్కూల్లోనే మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి ఎంతో కాలం అయింది. ఇద్దరి మనసులోని మాట పెదవులు దాటి బయటకి రాలేదంతే! చూస్తుండగానే పదో తరగతి పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే అప్పుడే విధి మా ప్రేమకు పరీక్ష పెట్టింది.
*****
ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ ఒకే కాలేజీలో చదువుదామని ఎంతగానో ప్రయత్నించాం. కానీ అనుకోకుండా నేను హైదరాబాద్‌లో, తను విజయవాడలో చదవాల్సి వచ్చింది. అయినా ఆ దూరం మా ప్రేమను కరిగించలేదు.. సరికదా.. నా మనసులో రాజేష్ పట్ల ఉన్న ప్రేమ మరింతగా పెరిగింది. ఈ సమయంలోనే ఇక నా జీవితం రాజేష్‌తోనే అనుకున్నా. అయితే విధి నాకు మరో పరీక్ష పెట్టింది. కళ్లు మూసి తెరిచే లోపు ఇంటర్ పూర్తయింది. కానీ రెండు సంవత్సరాల్లోనే నేను బాగా లావయ్యాను. ఈ వయసులో ఉండాల్సిన వెయిట్ కంటే రెండు రెట్ల బరువు పెరిగాను. ఇప్పటి వరకు నన్ను ఓ అందగత్తెలా చూసిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ‘ఎంతగానో మారిపోయావ్!’ అన్నారు. ఆ మాట వెనుక ఉన్న వ్యంగ్యం నాకు అర్థమైంది. అదేమంత పెద్దగా నన్ను బాధించలేదు కానీ రాజేష్ ఇంతకు ముందు ఉన్నంత చనువుగా ఇప్పుడు లేడు. అది నన్ను నేను అసహ్యించుకునేలా చేసింది. మొదట్లో ‘నువ్వెక్కడ చదివితే అక్కడే చేరతా’ అన్నవాడు తనకు వేరే కాలేజీలో సీటు వచ్చిందని వెళ్లిపోయాడు. ఫోన్లో కూడా ఏదో పాత స్నేహితురాలిగానే పైపైన మాట్లాడేవాడు.

రాజేష్ నన్ను పట్టించుకోకపోవడం చాలా బాధగా అనిపించినా.. బి-ఫార్మసీ అంటే నాకున్న ఆసక్తితో ఆ ప్రభావం నా కెరీర్‌పై పడకుండా జాగ్రత్తపడ్డా. ఈ సమయంలో నా క్లాస్మేట్ వికాస్ వల్ల నా మనసుకు కాస్త ఊరట లభించేది. క్లాస్‌లో ఉన్న అమ్మాయిలందరికంటే తను నాతో కొంచెం ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాడు. అందుకు కారణం లేకపోలేదు. అతడు ఇష్టపడే వైశాలి నా పక్కనే కూర్చుంటుంది. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నమే అది ! చూడ్డానికి బాగానే ఉంటాడు. ఫిట్‌నెస్‌పై కాస్త శ్రద్ధ ఎక్కువ. అప్పుడప్పుడూ వెయిట్ లాస్ కోసం అతడి వద్ద నేను సలహాలు కూడా తీసుకునేదాన్ని. వైశాలి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నన్ను జిమ్‌కి కూడా తీసుకెళ్లేవాడు. ఈ వయసులో అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఫిట్నెస్ మీద శ్రద్ధ ఉండాలనేవాడు. అదంతా వైశాలి కోసం అనుకునేదాన్ని కానీ అతడన్నదాంట్లో నిజం లేకపోలేదు. అమ్మాయి ఫిట్‌గా ఉంటే ఇంట్లో అందరూ ఫిట్‌గానే ఉంటారు. నేను అమ్మ నుంచి వేరుగా ఉన్న ఆ రెండు సంవత్సరాల్లోనే బాగా వెయిట్ పెరిగా. లేదంటే రాజేష్ నాకు దూరమయ్యేవాడు కాదేమో !

వికాస్ పుణ్యమా అని జిమ్‌కి వెళుతూ, ఆహారపుటలవాట్లలో అతడి సలహాలు తీసుకోవడం వల్ల నా శరీర బరువులో చాలా తేడా వచ్చింది. అలా రెండేళ్లలోనే నా బరువు చాలా వరకు తగ్గింది. నాలో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం ! అందుకు వికాసే కారణం అని అతడికి లోలోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇటు వికాస్-వైశాలి మధ్య స్నేహం కూడా పెరిగింది. ఇప్పుడు వికాస్‌కు నా స్నేహంతో పనిలేదు. ఏదో హాయ్, బాయ్ వరకే పరిమితమైంది. అయినా అతడిచ్చిన ఆత్మవిశ్వాసం ముందు అదేం పెద్ద బాధగా అనిపించలేదు. చూస్తుండగానే మా చదువు పూర్తయింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నేను, వికాస్ ఒకే కంపెనీలో ఉద్యోగం సంపాదించాం. అయితే అతడికి అది సంతోషంగా అనిపించలేదు.
*****
ముందు వైశాలి సాధించిన కంపెనీలో జాబ్ రాలేదని బాధపడుతున్నాడనుకున్నా. కానీ తర్వాత తెలిసింది, వికాస్‌ను ఒక స్నేహితుడిగానే చూశానని చెప్పి వైశాలి అతడి ప్రేమను కాదందట. అయితే ఆమె అలా ఎందుకు అందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ప్రేమకు, స్నేహానికి మధ్య అంతరం నాకు తెలుసు. వైశాలి వికాస్‌తో అంతరానికి మించి ప్రవర్తించిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక నేను రాజేష్ మీద దిగులుతో ఎలా అయితే కాలేజీలో చేరానో.. ఇప్పుడు వికాస్ కూడా అలానే వైశాలి మీద దిగులుతోనే కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. కానీ ఒక విషయంలో మటుకు మేమిద్దరం ఒక్కటే అని చెప్పాలి. మనసులో ఎంత బాధ ఉన్నా కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడనివ్వలేదు. ఇదిలా ఉండగా మేము ఉద్యోగంలో చేరిన మొదటి రోజే నాకో షాక్ తగిలింది !

అదే కంపెనీలో రాజేష్ కూడా చేరాడు. ఒక్క క్షణం పాటు, నా ప్రేమలో నిజాయతీ ఉంది కనుకనే రాజేష్ మళ్లీ నా జీవితంలోకి వచ్చాడని అనిపించింది. కానీ మరుక్షణమే నా మనసులో రాజేష్‌పై ద్వేషం అలుముకుంది. అతడు నా నుంచి విడిపోయినప్పటి పలకరింపుకి, ఇప్పటి పలకరింపుకి చాలా తేడా ఉంది. ఇన్ని రోజులూ ఏమైపోయింది ఈ ఆత్మీయ పలకరింపు ? అని అతడ్ని కాలర్ పట్టుకుని అడగాలనిపించింది. కానీ కొత్త ఉద్యోగం, ఇష్టం లేకపోయినా అందరి ముందూ నవ్వుని ప్రదర్శించాలి. అందుకే అతడితో చేయి కలపక తప్పలేదు. కొంతకాలానికి వికాస్, రాజేష్ మంచి స్నేహితులయ్యారు. వారి మధ్య నా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను కూడా వారి వాదులాటలో భాగమయ్యేదాన్ని. దీంతో రాజేష్‌పై ఉన్న ద్వేషం పోయింది. బహుశా ప్రేమలో ఉన్న చెడ్డ గుణం ఇదేనేమో ! మనం ప్రేమించిన వారి మీద ఎక్కువ కాలం పాటు ద్వేషాన్ని ఉండనివ్వదు. అలాగని రాజేష్ మీద మునుపటిలా ప్రేమ ఉందని చెప్పలేను.
*****
ఇదంతా జరిగి దాదాపు అయిదారు నెలలవుతోంది. అయితే- ఇలా ప్రేమ, స్నేహం మధ్య నలిగిపోతున్న నాకు ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. ఈ మధ్యే లాక్ డౌన్ ముగిశాక ఉన్నట్టుండి వికాస్ నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. వైశాలితో ప్రేమ విఫలమైన తర్వాత ఇక ప్రేమిస్తే తన జీవిత భాగస్వామినే ప్రేమించాలనుకున్నానని తెలిపాడు. నాకిష్టమైతే తన ప్రేమను పంచడానికి సిద్ధమన్నాడు. అయితే అంతకుముందే రాజేష్ నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పడం నన్ను మరింత ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు నేనేం చేయాలి ? రాజేష్ ప్రేమను అంగీకరించాలా ? లేక వికాస్ పెళ్లి ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేయాలా ? ఆలోచిస్తుంటే - ఇద్దరికీ నేనో సెకెండ్ ఆప్షన్ అయిపోయాననిపిస్తోంది. అది నా మనసుకి నచ్చడం లేదు. ఏ అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామికి బెస్ట్ ఆప్షన్ అవ్వాలనుకుంటుంది కదా ! మరిప్పుడు నేనేం చేయాలి ? నా కన్ఫ్యూజన్ను తీర్చే మంచి సలహా ఇవ్వగలరా? మీ జవాబు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటా..!