కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..
హాయ్.. నా పేరు కావ్య జోసెఫ్. మాది కేరళలోని కొట్టాయం. ఇక్కడే ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. నిజానికి ఈ వృత్తిలో ఉన్న గొప్పతనమేంటో కరోనా రోగులకు చికిత్స చేసే క్రమంలోనే నాకు అర్థమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రోగులకు సేవ చేసే అవకాశం రావడం, అందరూ వైద్య సిబ్బందికి నీరాజనాలు పట్టడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ వృత్తిలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. నాకు చిన్నతనం నుంచే వైద్య వృత్తిలోకి రావాలన్న కోరిక ఉండేది. అందుకే నర్సింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా. అయితే బాధితులకు సేవలందించే క్రమంలో కరోనాతో పోరాడడమనేది అంత సులభమైన విషయం కాదు.. వారాలకు వారాలు కుటుంబాన్ని, ఎమోషన్స్‌ను పక్కనపెట్టి రోగులకు సేవ చేయాలి. షిఫ్టు పూర్తయినా మా వల్ల కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకూడదని హాస్పిటల్లోనే ఆగిపోవాల్సిన పరిస్థితి. ఇక ఈ క్రమంలో మాకూ వైరస్ ముప్పు పొంచి ఉంటుంది.

పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్.. ఇవన్నీ మేం వైరస్ బారిన పడకుండా ఉండడానికి తాత్కాలిక రక్షణ కవచాలే. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మాలో చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని కరోనా మహమ్మారి వదలట్లేదు. అందులో నేనూ ఉన్నా. ఓ రోజు డ్యూటీలో ఉండగానే ఉన్నట్లుండి నా ఆరోగ్యం విషయంలో ఏదో తేడాగా అనిపించింది. నిరంతరాయంగా డ్యూటీ చేయడం వల్ల ఇలా అనిపిస్తుందేమో అనుకున్నా. ఆ మరుసటి రోజు చలిజ్వరం, తలనొప్పితో బాధపడ్డా. ఏ ఆహార పదార్థం చూసినా వికారంగా అనిపించేది. మరోవైపు నీళ్ల విరేచనాలు! ఇదేదో అనుమానించాల్సిన విషయమే అని భావించిన నేను.. మా ఆసుపత్రిలోనే కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నా. నా అనుమానమే నిజమైంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.
******
అప్పటిదాకా కరోనా రోగులకు ధైర్యం చెప్పిన నేను.. ఒక్కసారిగా డీలా పడిపోయా. ఎంత పాజిటివ్‌గా ఆలోచించినా నా మనసులో ఏదో ఓ మూల కాస్త భయం, బెరుకు ఆవహించాయి. దీనికి తోడు ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెబుదామంటే.. అసలే అమ్మకు బీపీ ఉంది.. నాకు పాజిటివ్ అని తెలిస్తే తను మరింత కంగారు పడిపోతుందని ఆగిపోయా. అలాగని ఇంట్లో చెప్పకుండా దాయలేను. అందుకే మా నాన్నకు, అన్నయ్యకు ఈ విషయం చెప్పి.. అమ్మకు చెప్పొద్దని చెప్పా. దాంతో నా మనసు కాస్త తేలికపడింది. ఇక నేను పనిచేస్తోన్న ఆసుపత్రిలోనే కరోనాకు చికిత్స తీసుకున్నా.

నా తోటి స్టాఫ్, ఇతర డాక్టర్లు.. అందరూ నాకు తెలిసిన వారే కావడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న ఫీలింగ్ కలిగింది.. నా కుటుంబ సభ్యుల మధ్యే ఉన్నట్లనిపించింది. పైగా వారందరి సపోర్ట్ నాలో మరింత ధైర్యాన్ని నూరిపోశాయి. మందులు వాడుతూనే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకున్నా. ఫలితంగా కరోనా లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ నా ఆరోగ్యం మెరుగుపడింది. ఇక పది రోజుల తర్వాత చేసిన రెండు వరుస టెస్టుల్లో నెగెటివ్‌గా తేలింది. అప్పటిదాకా నా ఆరోగ్యం గురించి లోలోనే మథన పడుతోన్న నాన్న, అన్నయ్యలు ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేసినంత పనిచేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని మొదట్లో కాస్త ఆందోళనకు గురైనా.. ఆ తర్వాత గుండె ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ఈ మహమ్మారిపై విజయం సాధించా. తిరిగి విధుల్లో చేరా.
******
ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే.. చాలామంది తమకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ‘ఇక మా పని అయిపోయింది..’ అంటూ తీవ్ర మనో వేదనలో కూరుకుపోతుంటారు. వైరాగ్యపు మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజానికి కరోనా కంటే ఇలాంటి భయమే మనల్ని మరింత కుంగదీస్తుంది. కాబట్టి ‘నాకేం కాదు..’ అన్న ధైర్యమే ప్రతి ఒక్కరికీ కావాలి. అప్పుడే వైరస్ తోకముడుచుకొని పారిపోతుంది. తీవ్ర లక్షణాలు, ఇతర అనారోగ్యాలున్న ఎంతోమంది కూడా కోలుకొని ఇంటికి చేరుకుంటున్నారు. అలాంటి వారిని ఓసారి గుర్తుచేసుకోండి.. ధైర్యంగా ఉంటుంది. మన దేశంలో నమోదవుతోన్న కేసుల్లో చాలా మటుకు లక్షణాలే కనిపించట్లేదు. అలాంటి వారు ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారిలో కొందరు ‘మాకు లక్షణాలు లేవు కదా.. ఏం కాదులే’ అని బయటికి వెళ్తున్నారు. సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. అలాంటి వారి నిర్లక్ష్యం మరికొందరి పాలిట శాపమవుతుంది.. కాబట్టి దయచేసి కాస్త అనారోగ్యంగా అనిపిస్తే అలక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోండి.. ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నా కరోనా నెగెటివ్ వచ్చేంత వరకు బయటకు వెళ్లకండి.. ఇతరులను ప్రమాదంలో పడేయకండి..! కరోనా బారిన పడిన వారిని వివక్షతో చూడకండి!
కరోనా అంటే చావు కాదు.. మహా అయితే అది మనల్ని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టచ్చు.. కానీ అంతిమ విజయం మాత్రం మనదే! స్టే సేఫ్.. స్టే స్ట్రాంగ్!