మౌనం అంగీకారసూచకమంటారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఎన్నో గొడవలు తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. తర్వాత ఎంత బాధపడ్డా ఆ క్షణాన్ని తిరిగి తీసుకురాలేం. అలాంటి సంఘటనే నా జీవితంలోనూ జరిగింది. నా మౌనం వల్ల నన్ను ఎంతగానో ప్రేమించిన వ్యక్తికి నేను దూరమయ్యాను.
నా పేరు స్పందన. మాది కాకినాడ దగ్గర్లోని ఓ పల్లెటూరు. అమ్మా, నాన్నా, అక్కా, నేను ఇదే మా కుటుంబం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఆడపిల్లల చదువే వారికి జీవితాంతం తోడుంటుందని నమ్మేవారాయన. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా మమ్మల్ని బాగా చదివించేవారు. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ చేయడానికి కాకినాడలోని ఓ కాలేజీలో చేరాను. అక్కడ మా కెమిస్ట్రీ లెక్చరర్ సందీప్ తొలిచూపులోనే నా స్నేహితురాళ్లందరికీ నచ్చేశాడు. ఆయన అందం, తెలివితేటలు, పాఠాలు చెప్పే తీరు అందరికీ నచ్చేవి. నాకు ఇష్టం లేదని చెప్పను గానీ నా స్నేహితురాళ్లంత కాదు. అయితే ఎంతమంది ప్రపోజ్ చేసినా ఆయన్నుంచి సమాధానం మాత్రం నో అనే వచ్చేది.
*****
పీజీ రెండో సంవత్సరం పరీక్షలయ్యాక ఇంటికి వెళ్తున్నాను. దారిలో కలిశారాయన. నాతో ఓ పది నిమిషాలు మాట్లాడాలంటే పక్కనే ఉన్న ఓ బేకరీకి వెళ్లాం. రెండు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని, నేనొప్పుకుంటే ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడతానని చెప్పారు. ఏమీ అర్థం కానట్టు చూస్తున్న నాకు 'ఇప్పుడే సమాధానం చెప్పాల్సినవసరం లేదు... మీకు కావాల్సినంత సమయం తీసుకొని చెప్పండి' అని చెప్పి వెళ్లిపోయాడు. నాకేం చేయాలో పాలుపోలేదు. వెంటనే నా స్నేహితులకు విషయం చెప్పాను. రెండు మూడురోజుల్లో వాళ్లు ఆయన వివరాలన్నీ కనుక్కున్నారు. వాళ్లది మా పక్క వూరే. కులాలు రెండూ ఒకటే. ఎమ్మెస్సీ పూర్తయ్యాక తల్లిదండ్రులను విడిచి దూరప్రాంతాలకు వెళ్లడం ఇష్టంలేక వూరికి దగ్గర్లోనే ఉన్న కాలేజీలో పనిచేస్తున్నారు. స్కూలు, కాలేజీ రోజుల్లోనూ అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడేవారు కాదని తెలిసింది. దీంతో ఆయన మీద నాకు ఇష్టం ఏర్పడింది. నాన్నకు చెప్తే ఒప్పుకుంటారని అనుకున్నాను. సందీప్‌కి నా ప్రేమ విషయం చెప్పి మా నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను.
*****
ఇంతలో నాన్న నాకు మంచి సంబంధమంటూ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నా మనసులో ఉన్న మాట ఆయనకు చెప్పాలనుకున్నా.. కానీ అది నా గొంతు వరకూ వచ్చి ఆగిపోయింది. దానికి కారణం నాన్నంటే భయమో, లేక ఆయన మీద గౌరవమో నాకు ఇంతవరకు తెలియలేదు. మర్నాడు పెళ్లిచూపులు జరిగాయి. నేను వాళ్లకు నచ్చడంతో కట్నం లేకుండానే పెళ్లి చేసుకోడానికి వాళ్లు సిద్ధమయ్యారు. ఇదంతా నా అదృష్టమంటూ అందరూ ఆనందిస్తున్నా నాకు సంతోషమనిపించలేదు.
*****
నా స్నేహితుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్న సందీప్ పెళ్లి సంబంధం మాట్లాడటానికి వాళ్ల తల్లిదండ్రులను మా ఇంటికి పంపించాడు. వాళ్లు అబ్బాయి వివరాలు, వాళ్ల ఆస్తిపాస్తుల గురించి చెప్పి వెళ్లాక నాన్న రెండు సంబంధాలను బేరీజు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనైనా నేనాయనకు చెప్పాల్సింది నాకతనంటే ఇష్టమని.. చెప్పలేకపోయాను. చెబితే పరిస్థితులు ఎలా ఉండేవో? హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ముందు లెక్చరర్ తక్కువగా కనిపించాడేమో, ముందొచ్చిన సంబంధమే ఖాయం చేశారు నాన్న. దీంతో ఇష్టం లేని వ్యక్తితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను.
*****
నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ ఆయన దగ్గర లేనిది నాతో గడపడానికి కాస్త సమయం! ఇంట్లో ఉన్నా ఆఫీసు పనులతోనే బిజీగా ఉంటారు. అప్పుడప్పుడూ అనిపిస్తుంది నేను సందీప్‌ని పెళ్లి చేసుకొని ఉంటే తను నాకు పూర్తి సమయం కేటాయించేవాడు కదా అని. ఈ మధ్యే డెలివరీ కోసం ఇంటికి వెళ్లినప్పుడు తెలిసింది సందీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదని. నా స్నేహితుల ద్వారా తెలిసిందేమిటంటే నన్ను మర్చిపోలేక అతడు జీవితంలో ఇంకే అమ్మాయినీ పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాడని. అవకాశం వస్తే నా మనసులో ఉన్న మాటలన్నీ తనతో చెప్పాలనిపించింది. 'సందీప్, నువ్వు నచ్చావని నాన్నకు చెప్పలేని ఈ పిరికిదాన్ని క్షమించు. ఇంత మంచి మనసున్న నీకు అంతే మంచి అమ్మాయి భార్యగా రావాలి. పిల్లాపాపలతో నువ్వు ఆనందంగా ఉండాలి. ఇదే నా కోరిక !'
- స్పందన