ప్రస్తుతం ఎవరిని కదిపినా కరోనా వైరస్ గురించి తప్ప మరో మాట మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో కూడా కరోనాకు సంబంధించిన వార్తలే హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడి కోలుకున్న చాలామంది తమ అనుభవాలను ట్వీట్లు, పోస్టుల రూపంలో, పలు ఇంటర్వ్యూల్లో పంచుకుంటూ బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలా తన కొవిడ్ స్టోరీని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా పంచుకుంది కేప్‌టౌన్‌కు చెందిన సమంతా పిన్ అనే మహిళ. అప్పటికే ఆస్తమా, అధిక బరువు.. వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతోన్న ఆమె.. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందంటూ చెప్పుకొచ్చింది. ఒక దశలో విపరీతమైన భయాందోళనలకు గురయ్యానని, కొవిడ్ తనకు జీవితం విలువేంటో తెలియజేసిందంటూ.. కరోనా వైరస్ నుంచి తాను బయటపడిన విధానాన్ని మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
హాయ్.. నా పేరు సమంతా పిన్. నా భర్త, ఇద్దరు పిల్లలతో కేప్‌టౌన్‌లో నివసిస్తున్నా. ప్రపంచ దేశాలన్నీ కరోనా కల్లోలంలో చిక్కుకున్నట్లే.. ఇక్కడ కూడా కరోనా వైరస్ తీవ్రత చాలానే ఉంది. ఇక నా విషయానికొస్తే.. నేను ముందు నుంచీ కాస్త లావుగానే ఉంటాను. నాకు ఆస్తమా సమస్య కూడా ఉంది. ఆరోగ్యంగా ఉన్న వారినే కుంగదీస్తోన్న ఈ మహమ్మారి నాలాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారికి త్వరగా సోకే అవకాశం ఉంది. అందుకే చాలా రోజులుగా నేను, నా భర్త ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాం. ఇక పిల్లలకు కూడా స్కూలుకు సెలవులివ్వడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఇలా అందరం ఇంట్లో ఉంటూనే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, బయటికి వెళ్లొచ్చినా, బయటి నుంచి ఏవైనా వస్తువులు తెచ్చినా శానిటైజ్ చేసుకోవడం.. వంటి జాగ్రత్తలన్నీ పాటిస్తున్నాం. అయినా ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అంతు చిక్కట్లేదు.. కానీ కరోనా మాత్రం మా ఇంట్లో ప్రవేశించింది.

ఓ రోజు నా ఆరోగ్య పరిస్థితిలో నాకేదో తేడా ఉన్నట్లుగా అనిపించింది. జ్వరం, ఒంటి నొప్పులు, కడుపునొప్పి, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి కోల్పోవడం, వికారం.. ఇలా ఒకటా రెండా కరోనా లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయేమో అనిపించింది. వెంటనే అనుమానించి నేను మా ఇంటికి దగ్గర్లోని ఓ క్లినిక్‌కి వెళ్లాను. అక్కడి డాక్టర్ నన్ను కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. దాంతో వేరే హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఆ క్షణం నా పరిస్థితి కంటే నా పిల్లల గురించి తలచుకుంటే చాలా భయమేసింది. వెంటనే నా భర్త, పిల్లలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు అక్కడి వైద్యులు. అయితే ఈ ఫలితాల్లో నా భర్తకు పాజిటివ్ అని వచ్చింది.. ఆయనలో లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు. ఇక దేవుడి దయ వల్ల నా పిల్లలిద్దరికీ నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నా.
******
ఓవైపు దీర్ఘకాలిక వ్యాధులు, మరోవైపు కరోనా లక్షణాలు.. దేవుడా దీన్నుంచి నేను బయటపడతానా అని ఓ దశలో చాలా భయమేసింది. నాకు కరోనా పాజిటివ్ అని తేలగానే నా ఆక్సిజన్ స్థాయుల్ని పరిశీలించారు అక్కడి వైద్యులు. 95-100 శాతం ఉండాల్సిన ఆక్సిజన్ స్థాయులు 89, 88, 91 ఇలా తగ్గుతూ, పెరుగుతూ వచ్చాయి. దాంతో డాక్టర్ వెంటనే నన్ను ఆసుపత్రిలో చేరమన్నారు. కానీ నాకేమో పిల్లలపై బెంగ. అయినా తప్పదు! దాదాపు రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. మా వారికి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకునే క్రమంలోనే నా ఆరోగ్య పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతున్నట్లనిపించింది. అయినా ఏదో ఒక మూల భయం. తోటి రోగుల నుంచి నాకు ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువవుతుందేమోనన్న ఆందోళనతో ఆసుపత్రిలో ఉన్న రెండు వారాలూ బిక్కుబిక్కుమంటూ, క్షణమొక యుగంలా గడిపాను. ఆఖరికి మళ్లీ కొవిడ్ పరీక్ష చేసే సమయం రానే వచ్చింది. దేవుడి దయ వల్ల ఈ పరీక్షల్లో నాకు, మా వారికి నెగెటివ్ రావడంతో గుండె భారం ఒక్కసారిగా దిగినట్లయింది.

నాకున్న దీర్ఘకాలిక సమస్యలతో అసలు ఈ మహమ్మారి నుంచి బయటపడతానా అనిపించింది. కానీ దాన్ని జయించి ఇంటికెళ్లాక ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలిగింది. అయినా నేను, మా వారు మరో రెండు వారాల పాటు మా పిల్లలకు దూరంగా ప్రత్యేక గదిలోనే ఉన్నాం. ఇలా వాళ్లను కనీసం తాకనైనా తాకకుండా, దూరంగా ఉండడం ఓ తల్లిగా నేను తట్టుకోలేకపోయాను. నా పిల్లలే మా రూమ్ దగ్గరికొచ్చి హాయ్ చెప్పి వెళ్లిపోయేవారు. ఇలా వాళ్లు మా బాధను, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం నేను చేసుకున్న మరో అదృష్టం. నేను వైరస్ బారిన పడ్డానని తెలిశాక మా స్నేహితులు, కుటుంబ సభ్యులు.. రోజూ నాకు ఫోన్లో టచ్‌లోనే ఉండేవారు.. నా క్షేమ సమాచారం అడిగి తెలుసుకునే వారు. ‘నువ్వు త్వరగా కోలుకోవాలి..’ అని ప్రార్థిస్తూ సందేశాలు కూడా పంపేవారు. కానీ ఒక్కోసారి చిరాకు, టెన్షన్‌తో ఆ కాల్స్‌కి, సందేశాలకు సరిగ్గా స్పందించకపోయేదాన్ని. ఆ సమయంలో కరోనా నన్ను మానసికంగా, శారీరకంగా అంతలా కుంగదీసింది మరి! ఏదేమైనా ఈ మహమ్మారిని జయించడంలో మాకు అండగా నిలిచిన వారికి, మా ఆరోగ్యం గురించి ఆ దేవుడికి ప్రార్థనలు చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిజంగా దేవుడి ప్రార్థనలకు అంతటి మహత్తర శక్తి ఉందని నాకు ఈ మహమ్మారిని జయించినప్పుడే అర్థమైంది.

అందరి ఆశీర్వాదాలతో దేవుడు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ అనుభవం నాకు జీవితం విలువేంటో తెలియజేసింది. అందుకే నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నా దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి సారిస్తా. నా అధిక బరువును తగ్గించుకునేందుకు చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకుంటా. నాలాగా ఎక్కువ బరువుతో సతమతమయ్యే వారు, ఇతర దీర్ఘకాలిక సమస్యలున్న వారికి కొవిడ్ త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కరోనా బారిన పడకుండా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల దృక్పథంతో ఉండండి. ‘ఆశే మన జీవితంలోని చీకట్లను పారదోలి వెలుతురును ప్రసాదిస్తుంద’ని పెద్దవాళ్లు చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాటలతో నా కథను ముగిస్తున్నా.. మీరూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని అలవర్చుకోండి.. కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి..!