ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన ఇంటి బయటే కాచుక్కూర్చుంది. అందుకే ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, బయటి నుంచి తిరిగొచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇంటికే పరిమితమైతే కరోనా సోకదా? బయటి నుంచి ఇంటికి తెచ్చిన వస్తువులన్నీ శానిటైజ్ చేస్తే ఇక కొవిడ్ ముప్పు తప్పినట్లేనా? వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి సామాజిక దూరం పాటించడం వరకు ప్రతిదీ తు.చ. తప్పకుండా పాటిస్తే ‘హమ్మయ్య ఇక కరోనా రాదు’ అని గుండెల మీద చెయ్యేసుకొని నిద్ర పోవచ్చా? అంటే.. అదీ చెప్పలేమంటోంది చెన్నైకి చెందిన ఓ యువతి. ఎందుకంటే తన కుటుంబం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెతో పాటు వాళ్ల ఇంట్లో వాళ్లందరికీ కరోనా సోకిందని, ఈ మహమ్మారిని తక్కువ అంచనా వేయడం తగదంటూ చెబుతోందామె. ఓవైపు తన కొవిడ్ అనుభవాలను పంచుకుంటూనే, మరోవైపు కరోనా బారిన పడకుండా ఉండడానికి తనకు తెలిసిన సలహాలు కూడా సూచిస్తోందీ యువతి.
హాయ్.. నా పేరు మైథిలి. మాది చెన్నై. మా ఇంట్లో అమ్మ, నాన్న, నేను, చెల్లి.. నలుగురం ఉంటాం. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర్నుంచి మేమంతా ఇంటికే పరిమితమయ్యాం. నేను, చెల్లి మాత్రం లాక్డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బిజీబిజీగా మారిపోయాం. ఇక నిత్యావసర సరుకుల కోసం వారానికోసారి నాన్న దగ్గర్లోని షాపుకెళ్లి తీసుకొచ్చేవారు. అదీ అత్యవసరమైతేనే తప్ప నాన్నను బయటికి పంపలేదు. ఎందుకంటే ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయి. ఒకవేళ నాన్న బయటికి వెళ్లాల్సి వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించేవారు.. తగిన జాగ్రత్తలు పాటించేవారు. ఇక ఇంటికొచ్చాక స్నానం చేసి గానీ లోపలికి రాకపోయేవారు. ఇంట్లో ఉన్నా కూడా మేమంతా సామాజిక దూరం పాటిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్లం.
******
అయితే కొన్నిసార్లు కాయగూరలు, ఇతర వస్తువుల్ని ఆన్లైన్లోనే తెప్పించుకునే వాళ్లం. రెండుమూడు సార్లు ఆహారం కూడా బయటి నుంచే ఆర్డర్ చేసుకున్నాం. ఇలా ఇతర వ్యక్తుల ద్వారా ఏది మా ఇంటికి వచ్చినా ఆ వస్తువులు/ప్యాకెట్స్ తప్పకుండా శానిటైజ్ చేసేవాళ్లం. ఆపై చేతుల్ని శుభ్రంగా కడుక్కునే వాళ్లం. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే ఒక రోజు అనుకోకుండా మా చెల్లి అనారోగ్యానికి గురైంది. బాగా నీరసించిపోయిన ఆమె.. ఇక నా వల్ల కావట్లేదంటూ విశ్రాంతి తీసుకోవడానికి తన బెడ్రూమ్లోకి వెళ్లి పడుకుంది. ఆపై కొన్ని గంటల్లోనే తనకు జ్వరం వచ్చింది. శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తే వంద డిగ్రీలు దాటింది. జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, విరేచనాలు.. వంటి సమస్యలు కూడా తనలో నెమ్మదిగా బయటపడడం ప్రారంభమయ్యాయి. ఇదేదో అనుమానించాల్సిన విషయమే అనుకున్నాం.

ఆ మరుసటి రోజు నుంచి నాకూ ఒంట్లో నలతగా అనిపించడం ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరం వచ్చింది. మా ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేసి మా ఇద్దరి అనారోగ్యం, లక్షణాల గురించి చెబితే మందులు సూచించారు. నీళ్లు ఎక్కువగా తాగాలంటూ సలహా ఇచ్చారు. అయినా నా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ తర్వాత నెమ్మదిగా దగ్గు, గొంతునొప్పి, విరేచనాలు ఒకదాని తర్వాత ఒకటి నా చుట్టుముట్టాయి. వీటితో బాగా నీరసించిన నేను నిరంతరాయంగా పడుకొనే ఉండేదాన్ని. అయితే ఈ క్రమంలో నాకు, చెల్లికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందేమీ లేకపోవడంతో ఇవి సీజనల్ మార్పుల వల్ల వచ్చిన అనారోగ్యాలేమో అనుకున్నాం. అయితే అంతలోనే అమ్మానాన్నలు కూడా అనారోగ్యం పాలవడంతో ఒక్కసారిగా భయపడిపోయాం. నాన్న విషయంలో మరింత కంగారు పడిపోయాం.. ఎందుకంటే ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయి.. కొవిడ్ సోకితే మాకంటే ఆయనకే రిస్క్ ఎక్కువ అని భయపడిపోయాం.
******
ప్రస్తుతం మేముంటున్నది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. అయితే మా బంధువుల ఫ్లాట్ ఒకటి కింది ఫ్లోర్లో ఖాళీగా ఉండడంతో నేను, చెల్లి అందులోకి మారాం. దాంతో సామాజిక దూరం పాటించడం మరింత సులువైంది. ఈ క్రమంలోనే కొవిడ్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి మా అనారోగ్య లక్షణాల గురించి వారికి వివరించాం. వెంటనే ఆరోగ్య సిబ్బంది స్వాబ్ కలెక్షన్ కోసం మా ఇంటికి వచ్చి నలుగురి శాంపిల్స్ తీసుకొని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చిన కొవిడ్ ఫలితాల్లో మా నలుగురికీ పాజిటివ్ అని తేలింది. అయితే అప్పటికే నాకు, చెల్లికి, అమ్మకు జ్వరం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర లక్షణాలున్నాయి. అయినా మా ముగ్గురినీ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండమని వైద్యులు సూచించారు. మేం వాడాల్సిన మందులు వైద్య సిబ్బంది మా ఇంటికి వచ్చి అందించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచించారు. నాన్నకు పాజిటివ్ వచ్చినా జ్వరం తప్ప మిగతా లక్షణాలేవీ లేవు. అయినా ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి వారం పది రోజులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండడం మంచిదన్నారు వైద్యులు. దాంతో నాన్న రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు.

రెండు వారాల తర్వాత మళ్లీ మా అందరికీ కొవిడ్ టెస్టులు చేశారు. దేవుడి దయ వల్ల మా అందరికీ వరుసగా రెండుసార్లు నెగెటివ్ వచ్చింది. దాంతో నాన్న కూడా ఇంటికి చేరుకున్నారు. అంతకుముందే మేమున్న రెండు ఫ్లాట్లను పారిశుద్ధ్య కార్మికులు శానిటైజ్ కూడా చేశారు. ప్రస్తుతం మేమంతా ఒకే ఇంట్లో సామాజిక దూరం పాటిస్తూ ఉంటున్నాం. క్రమంగా మా ఆరోగ్య పరిస్థితులు కూడా కుదుటపడుతున్నాయి. అయితే నా కొవిడ్ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం వెనుక చాలా కారణాలున్నాయి. అవేంటంటే.. చాలామంది దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం.. ఇవన్నీ సీజనల్ మార్పుల వల్ల వచ్చినవేమో అనుకొని పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొందరు స్వాబ్ కలెక్షన్ టెస్ట్‌కు భయపడి కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. నా స్వీయానుభవంతో చెబుతున్నా.. స్వాబ్ కలెక్షన్ అంటే అంతగా భయపడాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి మీ ఇంట్లో ఏ ఒక్కరిలోనైనా ఇలాంటి అనారోగ్యాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి.. మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడండి.
******
ఇక శానిటైజేషన్ గురించి చెప్పాలంటే.. బయటి నుంచి వచ్చిన మనమే కాదు.. మనతో పాటు తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాల్సిందే! ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ వంటివి అత్యవసరమైతేనే, ఇక వేరే ఆప్షన్ లేదనుకుంటేనే ఆర్డర్ చేయడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లోనే వండుకొని తినడం ఉత్తమం. అలాగే ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకితే పారిశుద్ధ్య కార్మికులు మీ ఇంటిని శానిటైజ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొక్కలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అలాగే వదిలేయడం కాకుండా.. వాటిని ఓ క్లాత్‌తో కవర్ చేయండి.. అప్పుడు ఆ క్రిమి సంహారక ద్రావణం ద్వారా వాటికి ఎలాంటి నష్టం జరగదు.. లేదంటే మా ఇంట్లో మొక్కలు చనిపోయినట్లుగా, నా ల్యాప్‌టాప్ పైభాగం డ్యామేజ్ అయినట్లుగా మీ వస్తువులు కూడా పాడయ్యే అవకాశం ఉంది.. కాబట్టి నా స్వీయ అనుభవంతో చెబుతున్నా.. ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి.. కరోనా బారిన పడకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కాపాడడంలో మీ వంతు బాధ్యత వహించండి.
ఇట్లు,
మైథిలి.