పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్డౌన్, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.
హాయ్.. నా పేరు అంజలీ రంజిత్. ఇటీవలే నాకు విఘ్నేష్‌తో వివాహమైంది. మా ఇద్దరిదీ కేరళనే. అయితే ప్రస్తుతం మేము పుణేలో ఉద్యోగాలు చేస్తున్నాం. అందరమ్మాయిల్లాగే నేనూ.. నా పెళ్లి అలా జరగాలి.. ఇంత ఘనంగా చేసుకోవాలి.. అంటూ కలలు కన్నా. నేను అనుకున్నంత కాకపోయినా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మా వివాహం బాగానే జరిగిందని చెప్పుకోవాలి.

ఉద్యోగ రీత్యా నేను, విఘ్నేష్ పుణేలో ఉంటున్నాం. మా ఇద్దరి పేరెంట్స్ కేరళలో నివసిస్తున్నారు. అయితే గతేడాదే మా ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ ఏడాది మే చివరి వారంలో వివాహ ముహూర్తం ఖరారు చేశారు. మే తొలి వారంలోనే ఇద్దరం సెలవు పెట్టి ఇంటికెళ్లాలని, వెడ్డింగ్ కార్డ్స్, షాపింగ్.. ఇలా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని అనుకున్నాం. అంతలోనే కరోనా కల్లోలంతో దేశమంతా లాక్డౌన్ విధించడంతో ఇక్కడే ఆగిపోయాం. కరోనా లాక్డౌన్ కారణంగా మా పెళ్లి ఇలా మేమిద్దరమే చేసుకోవాల్సి వస్తుందని అప్పుడనుకోలేదు.
******
సరే.. వివాహ ముహూర్తానికి ఇంకా రెండు నెలలు సమయముందిగా.. అప్పటికి పరిస్థితులు సర్దుకుంటాయనుకున్నాం. కానీ క్రమంగా మా పెళ్లి తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. దేశంలో కేసులు పెరుగుతుండడం, లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పాటు కొనసాగించాల్సి రావడంతో పుణేలోనే చిక్కుకుపోయాం. ఇక ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇంటికెళ్లే అవకాశం లేదనుకొని నేను, విఘ్నేష్ కలిసి ఉన్న చోటే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బంధువుల్లో దాదాపు వంద మందికి ఆహ్వాన పత్రికలు కూడా పంపించాం. కంగారు పడకండి.. అవి ఆన్లైన్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ జూమ్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా మా కుటుంబ సభ్యుల్ని, అతిథుల్ని ఒకే ఆన్లైన్ వేదికపైకి తీసుకొచ్చాం.

‘పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. బానే ఉంది.. కానీ అందుకోసం ఏర్పాట్లంటూ కొన్ని ఉంటాయి కదా..’ అంటారా? అక్కడికే వస్తున్నా.. విఘ్నేష్‌కి పుణేలో ఒక ఫ్లాట్ ఉంది. మా పెళ్లి అందులోనే జరిగింది. విఘ్నేష్ స్నేహితులు, తన రూమ్మేట్స్.. మా పెళ్లి పెద్దలయ్యారు. వారే మా పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేశారు. సింపుల్ డెకరేషన్ దగ్గర్నుంచి మా పెళ్లిని ఫొటోలు, వీడియోల్లో బంధించడం వరకు.. అన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారు. ఇక మా పెళ్లి బట్టలు, మంగళసూత్రం.. వంటివన్నీ మా పేరెంట్స్ స్పీడ్‌పోస్ట్ ద్వారా మాకు పంపించారు. కేరళ, పుణేల్లో కొన్ని లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సరిగ్గా పెళ్లి నాటికి ఈ వస్తువులు మాకు అందాయి. మా పెళ్లి అందరికీ దూరంగా సింపుల్‌గా జరిగినప్పటికీ మా పెళ్లి దుస్తుల విషయంలో మేం అస్సలు రాజీ పడలేదు. నేను, విఘ్నేష్.. ఇద్దరం సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యాం. నేను గోల్డెన్ జరీ, బ్లూ బోర్డర్‌తో కూడిన హాఫ్-వైట్ శారీ, బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్ ధరించా. ఇక విఘ్నేష్ హాఫ్-వైట్ ధోతీ, వైట్ షర్ట్ ధరించి ట్రెడిషనల్‌గా మెరిసిపోయాడు.
******
ఇక మా పెళ్లి సమయానికి మా పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు దాదాపు వంద మంది అతిథులను జూమ్ వీడియో యాప్ ద్వారా కనెక్ట్ చేశాం. వారందరూ చూస్తుండగానే విఘ్నేష్ నా మెడలో మూడుముళ్లు వేశాడు. ఆపై ఇద్దరం దండలు మార్చుకున్నాం.. ఇద్దరం పూల బొకేలు ఇచ్చి పుచ్చుకున్నాం. ఇలా మా పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు ఓ మలయాళీ పెళ్లి పాటను కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశారు విఘ్నేష్ స్నేహితులు. ఆ తర్వాత మా పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు, అతిథులంతా మమ్మల్ని ఆన్లైన్లోనే ఆశీర్వదించారు. ఆపై ఇద్దరం మాస్కులు ధరించి ఫొటోలకు పోజిచ్చాం. ఇలా మా వివాహం సింప్లీ సూపర్బ్‌గా జరిగిపోయింది. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మా తల్లిదండ్రులు, బంధువులంతా మా పెళ్లి చూసే అవకాశం దక్కింది.

ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో మా పెళ్లి తంతు ఇలా ఉన్నంతలోనే చక్కగా జరగడం చాలా సంతోషంగా ఉంది.. ఈ వివాహం మాకు ఓ విభిన్నమైన అనుభూతిని అందించింది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్తామా, ఎప్పుడెప్పుడు మా పేరెంట్స్ నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు తీసుకుంటామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాం. సో.. ఇవండీ మా లాక్డౌన్ పెళ్లి విశేషాలు. మరి, మీ ఆశీస్సులూ మాకు అందించండి. ఇక చివరగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ కరోనా వల్ల మీ పెళ్లి, మీకు సంబంధించిన ఇతర వేడుకలు వాయిదా పడుతున్నాయని బాధపడకండి.. మీకున్న అవకాశాలను వినియోగించుకొని, కాస్త క్రియేటివ్‌గా ఆలోచిస్తే.. ఇలా మా పెళ్లిలాగే సింప్లీ సూపర్బ్‌గా ఈవెంట్‌ని ఎంజాయ్ చేయచ్చు.. ఆన్లైన్ సహాయంతో దూరంగా ఉన్న మీ బంధువుల ఆశీర్వాదాలు కూడా తీసుకోవచ్చు.
అన్నిటికన్నా మించి పెళ్లిళ్లు, వేడుకలు పేరుతో అందరూ గుమిగూడకుండా చూడడం మనందరి బాధ్యత. అందుకే ‘ఏమవుతుందిలే’ అని నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ నిబంధనల మేరకు చాలా కొద్దిమందితో మాత్రమే పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రయత్నించండి. కరోనా వ్యాప్తి కాకుండా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి..!