కరోనా.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. మరి, మనకే ఇలా ఉంటే అనునిత్యం కరోనా వార్డులోనే గడుపుతూ ఈ మహమ్మారి బారిన పడిన రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సుల పరిస్థితేంటి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడు, ఎవరి నుంచి తమకు కరోనా సోకుతుందోనన్న భయం అనుక్షణం వారిని వెంటాడుతూనే ఉంటుంది. అయినా సరే.. తమ వృత్తికే ప్రథమ ప్రాధాన్యమిస్తూ విధుల్లో కొనసాగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో వైద్య సిబ్బంది. ఈ క్రమంలో కొందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటోందీ కెనడియన్ నర్సు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటున్నప్పటికీ వరుస టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతోన్న ఆమె.. తన కొవిడ్ పోరాటం గురించి అందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
హాయ్.. నా పేరు ట్రాసీ స్కోఫీల్డ్. నేను కెనడా ఒంటారియోలోని కేంబ్రిడ్జ్ పట్టణంలో నివసిస్తుంటాను. ప్రస్తుతం ఇక్కడి ఓ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నా. నాకు ముగ్గురు పిల్లలు. కరోనా వెలుగు చూసిన దగ్గర్నుంచి మెలకువతో ఉన్నా, నిద్రలోనైనా అందరినీ కలవరానికి గురిచేస్తోందీ వైరస్. కెనడాలోనూ ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అంతా కరోనా రోగులకు సేవలందించడంలో నిమగ్నమయ్యారు. అందరిలాగే నేనూ కరోనా వార్డులో చికిత్స పొందుతోన్న రోగులకు సేవ చేస్తున్నా. ఈ క్రమంలో ఎప్పుడు, ఎవరి నుంచి కరోనా సోకుతుందోనన్న భయం ఉన్నప్పటికీ నా వృత్తిధర్మం ముందు ఆ భయం నన్ను అంతగా ప్రభావితం చేయలేకపోయింది.

అయితే ఇలా కరోనా రోగులకు సేవలందిస్తోన్న క్రమంలోనే ఓ రోజు నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించింది. అదేంటి.. అప్పటిదాకా బాగానే ఉన్న నేను ఇప్పుడెందుకిలా డల్‌గా మారిపోతున్నా అనిపించింది. ఒక్కసారిగా చలి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. శరీర ఉష్ణోగ్రత కూడా 104 డిగ్రీలకు పెరిగిపోయింది. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్ష చేయించుకున్నా. నా అనుమానమే నిజమైంది. ఏప్రిల్ 1న నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వెంటనే నేను మందులు వాడుతూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. అలా రెండు వారాలు గడిచిపోయాయి. మందులు వేసుకుంటున్నా నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీనికి తోడు క్రమంగా నాలో రుచి, వాసన పసిగట్టే సామర్థ్యం కూడా తగ్గిపోయింది. అదెంతలా అంటే.. కనీసం ఉప్పు రుచి కూడా నాకు తెలిసేది కాదు.. దీనికి తోడు వరుసగా ఏడుసార్లు చేసిన కరోనా పరీక్షల్లో అన్నిట్లోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటిదాకా సాధారణంగానే ఉన్న నాలో ఏదో ఓ మూల కాస్త భయంగా అనిపించింది. అయినా సరే.. మళ్లీ పరీక్ష చేస్తే నెగెటివ్ వస్తుందేమోనన్న ఆశతో, ధీమాతో ఉన్నా.
******
అనుకున్నట్లుగానే ఎనిమిదో పరీక్షలో నెగెటివ్‌గా తేలింది. దాంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే 24 గంటల్లో వరుసగా రెండుసార్లు నెగెటివ్ వస్తేనే కొవిడ్ నుంచి కోలుకున్నట్లు లెక్క. నా దురదృష్టమో లేక నా తలరాతో తెలియదు గానీ తొమ్మిదో పరీక్షలో మళ్లీ పాజిటివ్ రావడంతో కాస్త ఆందోళన చెందా. నా భయం కేవలం నా గురించే కాదు.. నేనెక్కడ వైరస్ వాహకంగా మారతానేమోనని ఆందోళన చెందా. కానీ డాక్టర్లు చెప్పిన మాటలతో నా మనసు కాస్త కుదుటపడింది. అదేంటంటే.. చనిపోయిన కరోనా వైరస్ కణాలు ఇంకా నా శరీరంలో తిరుగుతుండడం వల్లే పరీక్షల్లో పాజిటివ్ వస్తోందని, వాటితో ప్రమాదమేమీ లేదని డాక్టర్లు చెప్పడంతో కాస్త ఊరట చెందా. అయితే వరుసగా రెండుసార్లు కరోనా నెగెటివ్ వస్తేనే డిశ్చార్జి చేస్తామని వారు చెప్పడంతో ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా.

మరో రెండు రోజుల్లో నాకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనైనా నెగెటివ్ రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక నా పిల్లలతో ఎప్పుడెప్పుడు సమయం గడుపుతానా, మళ్లీ విధుల్లో ఎప్పుడెప్పుడు చేరతానా అని ఆతృతగా ఉంది. ఇలా 50 రోజులుగా కరోనాతో సావాసం చేస్తోన్న నేను నా కథను మీతో పంచుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. ‘కరోనా వచ్చింది.. ఇక నా పని అయిపోయినట్లే’ అని చాలామంది నిరాశ చెందుతుంటారు. జీవితంపై వైరాగ్యం అలుముకుంటుంది. ఇలాంటి భావనలు మనల్ని మరింతగా కుంగదీస్తాయి. ఇలాంటి నెగెటివ్ ఆలోచనల వల్ల మన మానసిక, శారీరక ఆరోగ్యం మరింతగా క్షీణించి వైరస్ మన శరీరంలో విజృంభించడానికి మనకు మనమే అవకాశం ఇచ్చిన వారమవుతాం. కాబట్టి కరోనా బారిన పడినంత మాత్రాన ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు మీ దరిచేరనివ్వకండి.

ఎంతోమంది వృద్ధులు, వందేళ్లు దాటిన వారు కూడా కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకోండి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మీకు నచ్చిన పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయడం.. ఇలా మీ మనసుకు నచ్చిన పనులు చేయండి.. మీ ధైర్యం చూసి కరోనానే తోకముడుచుకొని పారిపోతుంది. కాబట్టి మన ధైర్యమే మనకు కొండంత అండ. అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడండి. ఓ నర్సుగా, కరోనా బాధితురాలిగా ఇలా నేను చెప్పే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ అందరికీ ఉపయోగపడతాయనుకుంటున్నా..!
Photo: www.facebook.com/tracy.odonnellschofield