భారత్‌లో కరోనా కాలుమోపిన సమయంలోనే ఆమె విదేశాల నుంచి స్వదేశీ గడ్డపై అడుగుపెట్టింది. అయితే తనతో పాటు కరోనా కూడా తన వెంట వస్తుందని అప్పుడు ఆమెకు తెలియలేదు. అలా నాలుగైదు రోజులు గడిచింది.. క్రమంగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆమె అనుమానమే నిజమైంది.. కరోనా పాజిటివ్‌గా తేలింది. 20 రోజులు మహమ్మారితో పోరాడి జయించిన ఆమె.. ఆపై తన ప్లాస్మాను దానం చేసి కరోనా బాధితులకు ప్రాణం పోసింది. కొవిడ్‌పై పోరాటంలో నేను సైతం అలా భాగమయ్యానంటున్న ఆమె హృదయరాగమేంటో మనమూ విందాం రండి..
హాయ్.. నా పేరు ప్రేరణ. మాది కొచ్చి. నేను ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్‌ను. డ్యాన్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లిన నేను.. మార్చి 9న తిరిగి భారత్‌కు చేరుకున్నాను. అయితే ఇక్కడికొచ్చాక నాలుగైదు రోజులు బాగానే ఉన్నాను. ఆ తర్వాతే నాలో కరోనా లక్షణాలు క్రమంగా బయటపడడం గమనించా. మొదట్లో గొంతు పట్టేసినట్లుగా అనిపించడంతో పాటు తలనొప్పి విపరీతంగా వేధించేది. ఆ తర్వాత ఛాతీలో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. మొదలైన లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించా. పరీక్షలు నిర్వహించిన అనంతరం నాకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధరించారు. ఇక ఆసుపత్రికే పరిమితమైన నేను.. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ సుమారు 20 రోజుల పాటు చికిత్స తీసుకున్నా..

అయితే మొదట్లో మందులు వేసుకున్నా నాలో కరోనా లక్షణాలు ఏమాత్రం తగ్గకపోవడంతో చాలా భయమేసింది. అమ్మో.. నాకేమవుతుందో, ఏమో.. నేను అసలు ఇంటికి వెళ్తానో, లేదో.. మా అమ్మానాన్నలను చూస్తానో, లేదో.. ఇలాంటి ఆలోచనలతో నా బుర్రంతా బద్దలయ్యేది. ‘దేవుడా.. నేను త్వరగా ఈ మహమ్మారి నుంచి కోలుకునేలా చేసి నన్ను ఇంటికి పంపించు..’ అని ఆ భగవంతుడిని ప్రార్థించేదాన్ని. నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు నాపై ఉన్నాయనుకుంటా.. అందుకే ఆ మరుసటి రోజు నుంచి నెమ్మదిగా నా ఆరోగ్యంలో మార్పు రావడం గమనించాను. ఇలా 20 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న నాకు రెండుసార్లు కరోనా టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చింది. దాంతో నన్ను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయినా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరం పాటించమని డాక్టర్లు సూచించారు. అలా ఇటీవలే 14 రోజుల హోమ్ క్వారంటైన్‌ను పూర్తిచేసుకున్నా..

అయితే ఇదే సమయంలో ప్లాస్మా థెరపీ గురించి టీవీల్లో వార్తలు రావడం చూశా. మందులేని కరోనా వైరస్‌కు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేయచ్చనే విషయం తెలుసుకున్నా. ఇంకా నాకున్న సందేహాలను మా ఫ్యామిలీ డాక్టర్ సహాయంతో నివృత్తి చేసుకున్నా. ఇప్పటి వరకు ఎలాంటి మందూ లేని ఈ వైరస్ బారిన పడిన వారిని కాపాడాలంటే.. నాలా కరోనా నుంచి బయటపడ్డ వారే కొంతలో కొంత సాయం చేయగలరని తెలుసుకున్నాను. వెంటనే నాకు కొవిడ్ చికిత్స చేసిన వైద్యులను సంప్రదించి నేను ప్లాస్మా దానం చేస్తానని చెప్పాను. నా వల్ల మరొకరు కరోనా నుంచి బయటపడతారంటే నాకు అంతకంటే సంతృప్తి మరేదీ కనిపించలేదు.

అంతేకాదు.. శరీరం నుంచి ప్లాస్మా సేకరించే సమయంలో పెద్దగా నొప్పి కూడా ఏమీ ఉండదు. అలాగే స్వీకరించే వారు కూడా ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాతలకు హెచ్ఐవీ లాంటి వ్యాధులు లేకపోతేనే వారి ప్లాస్మా మరొకరికి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక రోగిని కాపాడుతున్నామన్న భావన, సంతృప్తి ముందు ఏదీ మనకు పెద్ద విషయమనిపించదు కదా!
ఇట్లు,
ప్రేరణ.