కరోనా.. ప్రపంచంలో దీని బారిన పడుతోన్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఈ మహమ్మారిని జయించిన వారూ ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అలాంటి వారి గురించి తెలుసుకుంటే మనసుకు ఎంతో సాంత్వన చేకూరుతుంది.. ధైర్యంగా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసే ఓ మహిళ విదేశీ ప్రయాణం కారణంగా ఈ కరోనా కోరల్లో చిక్కుకుంది. అలాగని తన మనోధైర్యాన్ని కోల్పోలేదామె.. తనని కలిసిన వారిని కూడా అప్రమత్తం చేసింది. దాదాపు 20 రోజుల పాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి విజయం సాధించింది. కొవిడ్-19 సోకితే మరణమే శరణ్యం కాదని.. మానసిక దృఢత్వంతో పోరాడితే ఆ మహమ్మారిని జయించచ్చని అందరిలో ధైర్యం నింపుతూ తన కథను ఇలా మనందరితో పంచుకుంది.

హాయ్.. నా పేరు మహిమ.. నేను బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. అది మార్చి నెల.. అప్పుడప్పుడే కరోనా భారత్‌లో అడుగిడిన సమయమది. నేను కంపెనీ పని మీద జనవరిలోనే న్యూజిలాండ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నా ప్రాజెక్ట్ పనిని పూర్తిచేసుకుని మార్చి 9 కల్లా ఇండియా చేరుకున్నాను. ఆ సమయంలో కరోనా బాధిత దేశాలైన చైనా, సింగపూర్, ఇటలీ.. నుంచి వచ్చిన వారికే ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. నేను న్యూజిలాండ్ నుంచి రావడంతో నాకో ఫామ్ ఇచ్చి.. అందులో వివరాలన్నీ నింపి.. మీరు ఇంటికి వెళ్లిపోవచ్చని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పారు. అలాగే కరోనాకు సంబంధించి ఏదైనా అత్యవసరం ఉంటే ఈ నంబర్‌కి సంప్రదించమని నాకో ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
******
ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల దాకా నాకెలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నట్లనిపించింది. అయినా కూడా ఎందుకైనా మంచిదని నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. కానీ పది రోజులయ్యాక నెమ్మదిగా నా ఆరోగ్యంలో మార్పులు రావడం గమనించా. వాసన, రుచి తెలియడం లేదన్న విషయం పసిగట్టా. ప్రాజెక్ట్ వర్క్, విమాన ప్రయాణం.. ఇలా తీరిక లేని షెడ్యూల్‌తో అలసిపోవడం వల్ల ఇలా అవుతుందేమో అనుకున్నా. కానీ కరోనా వైరస్, దాని లక్షణాల గురించి టీవీలో వచ్చే వార్తలు వింటున్నప్పుడు నాలో ఏదో ఓ మూలన చిన్న అనుమానం కలిగింది. అయినా అలాంటిదేమీ ఉండకపోవచ్చని నన్ను నేను సర్దిచెప్పుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోవడంతో కరోనా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశాను. దాంతో వైద్యులే వచ్చి నన్ను తీసుకెళ్లి కొవిడ్ టెస్టులు చేశారు. రెండు రోజులకు వచ్చిన రిపోర్టుల్లో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అదేంటీ.. నాకు రుచి, వాసన తెలియకపోవడం తప్ప మరెలాంటి కరోనా లక్షణాలు లేవు కదా.. పాజిటివ్ ఎలా వచ్చిందని డాక్టర్లను అడిగా.. అవి కూడా కరోనా లక్షణాలేనంటూ వాళ్లు చెబుతూనే నాకు ట్రీట్మెంట్ అందించడం మొదలుపెట్టారు.

నాకు పాజిటివ్ అని తెలియగానే.. నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన.. నన్ను కలిసిన వారి పరిస్థితి ఏంటి? అని! వాళ్లలో ఎవరికైనా నా వల్ల కొవిడ్ సోకి ప్రాణాపాయం తలెత్తితే.. దీనికంతటికీ నేనే కారణమవుతా.. అంటూ నా మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే నా టీమ్‌కి, కుటుంబ సభ్యులు, నేను కలిసిన వాళ్లందరికీ మెసేజ్ చేశాను. ‘టెస్ట్‌ల్లో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మీరందరూ వెంటనే టెస్ట్‌లు చేయించుకోండి.. అలాగే మీరెవరెవరిని కలిశారో వారినీ అప్రమత్తం చేయండి..’ అని సందేశం పంపించా. అలాగే నేను కలిసిన వారి తాలుకు లిస్ట్‌ని ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ప్రభుత్వ యంత్రాంగానికీ అందించాను. ఈ క్రమంలో వారు అందరి వివరాలు కనుక్కొని టెస్ట్‌లు నిర్వహించారు. అదృష్టవశాత్తూ నేను కలిసిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత నా మనసు కాస్త తేలిక పడింది. అయినా కూడా వారందరినీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం పాటించమంటూ వైద్యులు సలహా ఇచ్చారు.

ఇక మరోవైపు ఆసుపత్రిలో నాకు చికిత్స మొదలైంది. నాలుగు రోజుల చికిత్స అనంతరం మళ్లీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. దాంతో నన్ను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్, ఇతర మందులేవీ లేకపోవడం వల్ల బాధితుని లక్షణాలను బట్టి డాక్టర్స్ చికిత్స చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. నేను ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ నాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. చివరికి 20 రోజుల తర్వాత చేసిన టెస్ట్‌ల్లో నాకు నెగెటివ్ అని వచ్చింది. అప్పుడు ఐసోలేషన్ వార్డు నుండి సాధారణ గదికి మార్చారు. ఆపై మరో రెండుసార్లు నెగెటివ్ వస్తే గానీ నన్ను ఇంటికి పంపించలేదు. ట్రీట్మెంట్ మొదలయ్యాక చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చాక కాస్త భయంగానే అనిపించింది.. కానీ లక్షణాలేవీ లేకపోవడంతో నాకేమీ కాదన్న గుండె ధైర్యంతో ఉన్నా. ఈ క్రమంలో డాక్టర్లు కూడా నాకు ధైర్యం చెప్పారు.. చాలా శ్రద్ధగా చికిత్స చేశారు.

అయితే నేను ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక కూడా మా ఇరుగుపొరుగు వాళ్లు, కాలనీ వాళ్లు నేనేదో తప్పు చేసినట్లు అదోలా చూసేవారు. కరోనా సోకిందన్న నిజం కంటే వారి ప్రవర్తనే నాకు చాలా బాధగా అనిపించింది. కరోనాను నేనేమీ కావాలని తెచ్చుకోలేదు కదా.. పైగా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ముందుగా టెస్టులు చేయించుకోలేదు.. అని నాకు నేను సర్ది చెప్పుకున్నా. అయినా ఇలాంటి వాళ్ల మాటలు, ప్రవర్తనను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఇంట్లో వాళ్లు నాకు ధైర్యం చెప్పారు. ఇక అప్పట్నుంచి ప్రశాంతంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా.. ప్రస్తుతమైతే 14 రోజుల పాటు నేను ప్రత్యేక గదిలో స్వీయ నిర్బంధంలో ఉన్నాను.. మరోవైపు సామాజిక దూరం పాటిస్తూనే కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నా..
******
అయితే ఇక చివరగా మీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది.. కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోండి.. కాస్త అనారోగ్యంగా అనిపించినా కొవిడ్ హెల్ప్‌లైన్‌కు సంప్రదించి వైద్యుల సలహా తీసుకోండి.. అలాగే లక్షణాలున్నా నిర్లక్ష్యం చేయకుండా టెస్టులు చేయించుకోండి. మీరు కలిసిన వారి గురించి నిజాయతీగా ప్రభుత్వానికి తెలియజేయండి. తద్వారా మీరు, మీ కుటుంబాన్ని, ఇతరులనూ అపాయం నుంచి రక్షించిన వారవుతారు. అలాగే కొవిడ్ సోకిన వారిని అంటరాని వారిగా చూడడం సరికాదు.. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని గుండె ధైర్యంతో ఈ మహమ్మారిని జయించండి.. అంతిమ విజయం మనదే..!
ఇట్లు,
మహిమ