ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దావానలంలా వ్యాపిస్తోంది. ఈ కరోనా కార్చిచ్చును ఆపడానికి అక్కడి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతున్నాయి. సామాన్యులే కాదు.. వారిని కాపాడడానికి నిరంతరం శ్రమిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే అమెరికాలో ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదని.. అక్కడ కరోనా ఎన్నో జీవితాలను తలకిందులు చేసిందని చెప్పుకొచ్చిందో అమెరికన్ నర్స్. పండంటి బిడ్డను ప్రసవించాల్సిన సమయంలో కరోనా బాధితురాలిగా మారి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి తల్లడిల్లుతున్న ఈ తల్లి మనోవేదనను మనమూ విందాం రండి..
హాయ్.. నా పేరు బ్రూక్ ప్లాటో.. అమెరికా మిస్సౌరీలోని కేన్సస్ నగరంలో ఓ హాస్పిటల్లో సర్జికల్ నర్సుగా పనిచేస్తున్నాను. అది 2020, జనవరి.. ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అప్పటికే చైనాలో కరోనా గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఆ మహమ్మారి మా నగరంపై కూడా తన పంజా విసురుతుందని ఎవరూ ఊహించలేదు.. అసలు ఆ ఆలోచనలు కూడా మాకు రాలేదు. అందుకే ప్రభుత్వం కొవిడ్-19కు సంబంధించిన హెచ్చరికలు చేసినా మొదట్లో మేం పట్టించుకోలేదు. కానీ కరోనా మా నగరాన్ని తాకిన సమయంలో ఏం జరుగుతుందో అనే భయం మొదలైంది. నెల క్రితం వరకు కూడా అంతా బాగుంది.. కానీ పరిస్థితులన్నీ చాలా త్వరితగతిన మారిపోయాయి. ఒక్కసారిగా అంతా మసకబారినట్లయింది. ప్రతి రెండు గంటలకోసారి ఆసుపత్రి యాజమాన్యం సమావేశాలు నిర్వహించడం, తదుపరి ప్రణాళికల గురించి చర్చించడం.. మొదలుపెట్టింది. అయితే ఉదయం తీసుకున్న నిర్ణయాలు మధ్యాహ్న సమయానికి మారిపోయేవి.. కాదు కాదు పరిస్థితులు అలా మార్చేసేవి.

రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్నీ సిద్ధం చేయడం ప్రారంభించాం. వీటిలో ప్రధానమైనవి మాస్క్‌లు. మాస్క్‌లు ప్రతి సందర్భంలో.. ప్రతి చోటా ధరించాల్సిందే! అయితే మొదట్లో ఒక షిఫ్ట్‌కి ఒక మాస్క్ మాత్రమే ధరించాల్సిందిగా సూచించారు. నేను గర్భవతిని కావడం వల్ల.. కొవిడ్-19 అనుమానితులకు, బాధితులకు చికిత్స అందిస్తున్న సమయంలో N95 మాస్క్‌ను ధరించడానికి అనుమతినిచ్చారు. ఇక పీపీఈ కిట్ల కొరత ఉందని తెలిసి మరింతగా భయపడ్డా. ఇక ఆసుపత్రి లోపలికి రావడానికి కూడా ఎవరికీ అనుమతి లేదు. కేవలం కొవిడ్ లక్షణాలతో బాధపడే వారికి, ఈ మహమ్మారి బారిన పడిన వారితోనే ఆసుపత్రి కిక్కిరిసింది. ఈ పరిస్థితులు ఎంతో భయానకంగా అనిపించాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ముందులా లేవు.. మేము మా పనులకు చాలా హడావిడిగా హాజరవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు.. రోజువారీ డ్యూటీ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా? ఎప్పుడెప్పుడు బయటపడదామా? అన్నట్లుగా అనిపించేది.

ఆపరేషన్ రూంలో పేషెంట్స్‌కి శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులకు అన్నీ సమకూర్చడం, ఆపరేషన్ రూమ్‌ని సిద్ధం చేయడం, కొవిడ్-19 పేషెంట్లను ఆపరేషన్ రూంకి తరలించేటప్పుడు దగ్గరుండి వారిని తీసుకెళ్లడం, ఈ క్రమంలో రోగులకు ‘Foley Catheters’ అమర్చడం.. వంటివి నేను చేయాల్సిన విధులు. నేను ప్రసవించాల్సిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ పరిస్థితులన్నీ నాలో ఆందోళనను మరింతగా పెంచసాగాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను బిడ్డను కనాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులనే ఎదుర్కొన్నా. అప్పుడు మేముంటున్న ప్రదేశంలో టోర్నడోలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు కరోనా కార్చిచ్చు..!

నా బాధంతా నా కడుపులోని బిడ్డ గురించే.. నాకేమైనా పర్లేదు.. నాకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలని కోరుకున్నాను. ఇక ప్రసవానికి సమయం దగ్గర పడిందనగా నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో పరీక్షలు చేయించుకోగా నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.. నా ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్లనిపించింది. నా భయమంతా ఒక్కటే.. నా బిడ్డ పుట్టిన తర్వాత ఆ పసిగుడ్డు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. అప్పటికే చాలామంది అన్నారు.. అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కావు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎందుకు డ్యూటీ చేస్తున్నావ్ అని అడిగేవారు.. కానీ ఓ నర్సుగా ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత మందికి సేవలను అందించడం నా బాధ్యత. అలా కాకుండా పరిస్థితులకు భయపడి నేను తప్పుకుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ప్రస్తుతం నేను ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా.. నాకేమైనా పర్లేదు.. నాకు సోకిన ఈ మహమ్మారి కారణంగా నా బిడ్డకు ఎలాంటి ఆపదా రాకుండా చల్లగా చూడమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. ప్రస్తుతం నేను చేయగలిగింది ఇది ఒక్కటే..
******
ఇక చివరగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. నేనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నాలాంటి నర్సులు, వైద్యులు ఎంతోమంది తమ ఆరోగ్యాలను పక్కన పెట్టి కరోనా రోగుల్ని కాపాడడానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు.. కొంతమంది ఈ మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. దయచేసి మీరంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. మాలాంటి వారికి మీరు చేయగలిగిన సహాయం అదొక్కటే..!