దిల్లీలో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ప్రమాదకరమైన జోన్లలో దిల్లీ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విరామమనేది మరిచి కరోనా బారిన పడిన వారిని కాపాడడంలో నిమగ్నమయ్యారు వారు. అయితే తాము డాక్టర్లమే అయినా రోగులకు సేవలందించే క్రమంలో ఈ వైరస్ తమకెక్కడ సోకుతుందోనన్న భయం, ఆందోళన తమలోనూ ఉంటాయని చెబుతోంది అక్కడి ఓ ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఓ యువ వైద్యురాలు. కొవిడ్-19 వార్డులోని పరిస్థితులను, అక్కడ సేవలందించే డాక్టర్ల మానసిక స్థితిని కళ్లకు కట్టినట్లు చూపేలా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ రూపంలో తాను పంచుకున్న మనోభావాలను తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..
హాయ్.. నా పేరు రిధి. కొవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన అనంతరం.. ఓ రోజు ఉదయం నేను హాస్పిటల్‌కి వెళ్లడానికి బయలుదేరుతున్నా.. ఆ క్షణం ఎప్పుడూ లేని విధంగా మా తల్లిదండ్రుల కళ్లలో మొదటిసారి భయం చూశా. నువ్వు కచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్లాలా అని వారు నన్ను అడిగారు. అందులో అనుమానమే లేదు.. హాస్పిటల్లో సేవలందించడానికే కదా నేను డాక్టర్ అయ్యింది అని సమాధానమిచ్చా. ఇక ఆ రోజు నుంచే నేను పనిచేస్తోన్న హాస్పిటల్‌కి ఎక్కువ మంది కొవిడ్ పేషెంట్లు రావడం మొదలైంది. నెమ్మదిగా రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది.
******
కొన్ని రోజుల తర్వాత.. అత్యవసరమైన శస్త్రచికిత్సలు చేయించుకునే వారిని, కొవిడ్-19 పాజిటివ్ రోగుల్ని మాత్రమే చేర్చుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకు తగినట్లుగానే హాస్పిటల్‌లోని 4వ ఫ్లోర్‌ని ఐసోలేషన్ వార్డుగా మార్చారు. వచ్చే బాధితులకు స్క్రీనింగ్ చేసే విభాగంలో నన్ను నియమించారు. మొదటిరోజు స్క్రీనింగ్ రూంని చూసి చాలా భయపడ్డాను. ఇక్కడికొచ్చే పేషెంట్లందరికీ కరోనా వైరస్ ఉండకూడదని, వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే రావాలని ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఆ క్షణం ఇంకేమీ చేయలేకపోయా.

అంతలోనే నాకో భయంకరమైన సంఘటన ఎదురైంది. స్క్రీనింగ్ రూంకి ఒక వ్యక్తి వచ్చాడు. తనకున్న వ్యాధి లక్షణాలను వివరించాడు. తను చెప్తున్నది వింటుంటే కొవిడ్-19కి ఉండే లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయనిపించింది. ఆ సమయంలో అతనికి పరీక్షల్లో పాజిటివ్ రావచ్చని నాకర్థమైంది. వెంటనే అతను దగ్గడం ప్రారంభించాడు. అది చూసి.. ‘నేను జాగ్రత్తలు తీసుకున్నాను.. నాకు రాదు..’ అంటూ నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆపై అతనికి కూడా ధైర్యం చెప్పాను.. ఇలా అప్పటిదాకా కాస్త భయం భయంగానే ఉన్న నేను ఆ క్షణం ధైర్యంగా వ్యవహరించడంతో నాలో తెలియని ఆత్మవిశ్వాసం వచ్చినట్లయింది.
******
ఇలా కొవిడ్-19 బాధితులకు సేవలందిస్తూ దాదాపు నెలరోజులు గడిచిపోయింది. అంతలోనే నా పుట్టినరోజు కూడా వచ్చింది. కానీ అదే రోజు నిద్ర లేచే సరికి నా ఒళ్లు కాలిపోవడం గమనించాను. నాకు జ్వరం వచ్చిందని తెలుసుకొని కాస్త ఆదుర్దా పడ్డా. వెంటనే నా సోదరికి, నాకు కాబోయే భర్తకు కాల్ చేశాను. నేనుంటున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే తను (నాకు కాబోయే భర్త) కూడా ఉంటున్నారు. నన్ను కలవడానికి రావద్దని చెప్పాను. అంతేకాదు.. పుట్టినరోజు కేక్ కూడా కట్ చేయాలనుకోవడం లేదని చెప్పాను. అదృష్టవశాత్తూ.. కొన్ని గంటల్లోనే నాకు జ్వరం తగ్గింది. ఇక మూమూలుగా నా రోజువారీ పనుల్లో మునిగిపోయాను. అయితే అకస్మాత్తుగా ఇలా జ్వరం రావడం అనేది భయం కలిగించే విషయమే.. ఎందుకంటే కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో నాకూ ఆ వ్యాధి సోకిందేమోనని భయపడ్డా.. అయితే ఓ డాక్టర్‌గా నాకు ఇలాంటి అనుభవాలన్నీ కామన్.

డాక్టర్‌గా విధులు నిర్వర్తించడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలో వైద్యులందరూ ఒత్తిడి, ఆందోళనలకు గురవడం సహజమే. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వంతో సేవ చేయాల్సిన బాధ్యత ఓ బాధ్యతాయుతమైన డాక్టర్‌గా నాపై ఉంది. దాదాపు నెలరోజులుగా నేను కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నాను. ఈ మహమ్మారి అంతమయ్యే వరకూ నా సేవల్ని కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రోగుల ప్రాణాలను కాపాడడానికే డాక్టర్ అయ్యా. నా పేషెంట్లకు నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను.. మేమంతా మీకోసమే ఇక్కడ ఉన్నాం.. మీరందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. ఇలా సామాజిక దూరం పాటిస్తూనే మనమందరం కలిసి ఈ మహమ్మారితో ధైర్యంగా పోరాడుదాం.. విజయం సాధిద్దాం..!’ అంటూ తన అనుభవాలను గుదిగుచ్చిందీ యంగ్ డాక్టర్.
డాక్టర్లైనా.. వాళ్లూ మనుషులే.. వారికీ భయాలు, ఆందోళనలు, భావోద్వేగాలు ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటినీ పక్కన పెట్టి మన కోసం పోరాటం చేస్తోన్న నిజమైన యోధులు వాళ్లు. అలాంటి వారికి భారం తగ్గించడానికి మన వంతుగా సహాయపడదాం.. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ఇంటి పట్టునే ఉందాం.. తద్వారా మనం, మన కుటుంబాలను కాపాడుకుంటూనే.. అటు వైద్యుల ప్రాణాలకు మన వల్ల ముప్పు రాకుండా జాగ్రత్తపడదాం.. హ్యాట్సాఫ్ టు ఆల్ మెడికల్ స్టాఫ్!