కరోనా.. ఈ పదం ఎందరో పాలిట యమపాశమవుతోంది.. ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తోంది.. ఎంతోమందిని మానసికంగా కుంగదీస్తోంది.. ఎన్నో బంధాలను కాలరాస్తోంది. కన్న వాళ్లు, కట్టుకున్న వాళ్ల కడసారి చూపు కూడా దక్కకుండా చేస్తోంది. ఇలా ప్రపంచమంతా విషపు కోరలు చాస్తున్న కరోనా తన జీవితాన్నీ ఛిద్రం చేసిందంటోంది ఓ మహిళ. భర్తే సర్వస్వం అనుకున్న ఆమెకు ఆఖరికి కన్నీళ్లనే మిగిల్చిందీ మహమ్మారి. భర్త కడసారి చూపు కూడా దక్కకుండా చేసింది.. కానీ ఆయన గుండెల నిండా తామే ఉన్నామన్న ఆఖరి సందేశం మాత్రం ఎప్పటికీ తనతోనే, తనలోనే ఉంటుందన్న ఆమె బరువెక్కిన హృదయంతో తన మనసులోని మాటల్ని పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
నా పేరు క్యాటీ.. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో నివసిస్తున్నాను. నాకు నా కాలేజ్ ఫ్రెండ్ జోనాథన్‌తో 2013లో వివాహమైంది. మాది ప్రేమ వివాహం. ఒకే కాలేజీలో చదువుకునే సమయంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మా ఏడేళ్ల వైవాహిక బంధానికి తీపి గుర్తులే మా పిల్లలు బ్రాడిన్, పెన్నీ (కూతురు, కొడుకు). జోనాథన్ అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తించేవాడు. దాంతో కరోనా లాక్‌డౌన్‌లోనూ విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విధులకు హాజరై ఇంటికి వచ్చాక తన వల్ల నాకు, మా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో.. మాకు ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయపడేవాడు. నేనేమో ఇంట్లో ఉండి తన గురించి భయపడేదాన్ని. తనకేమైనా అయితే నేను, నా పిల్లలు ఏమైపోవాలి..? అని నిత్యం బాధపడేదాన్ని. ఆ భయమే నిజమైంది.. కరోనా మా కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మేమున్న చోట కూడా పంజా విసరడంతో అధికారులు లాక్డౌన్ విధించారు. దీంతో నేను, పిల్లలు ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నాం. అయితే జోనాథన్ పనిచేసేది అత్యవసర సేవా విభాగం కావడం వల్ల రోజూ విధులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో విధులు ముగించుకొని ఓరోజు ఇంటికి వచ్చిన జోనాథన్ నీరసంగా, అనారోగ్యంగా కనిపించడం నేను గమనించా. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోమన్నా. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు జోనాథన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తేల్చారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడం ప్రారంభించారు.
******
అటు ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడికి ఎవరినీ రానివ్వరు.. ఇంట్లో ఉందామంటే జోనా ఆరోగ్యం ఎలా ఉందోనని నాలో ఆందోళన అంతకంతకూ పెరగసాగింది. అయినా ఏ మూలో చిన్న ఆశ.. తను త్వరగానే కోలుకొని ఇంటికొస్తాడన్న నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. అయితే అదే సమయంలో ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ నా ఆశలను ఆవిరి చేసింది. చికిత్స సమయంలో జోనాథన్‌కు గుండెపోటు వచ్చి చనిపోయాడని డాక్టర్లు చెప్పగానే నా హృదయస్పందన ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. ఆఖరి చూపుకి కూడా నోచుకోకుండా జోనాను ఆ దేవుడు నా నుంచి దూరం చేశాడు. ఆరోగ్యంగా తిరిగొస్తాడనుకున్న నా భర్త ఇక రాడని తెలిశాక నాలో కన్నీరు కట్టలు తెంచుకుంది. నా కాళ్ల కింద భూమి కదిలినట్లనిపించింది. ఇన్ని రోజులుగా కట్టుకున్న మా కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలినట్లనిపించింది. ఇక తను పోయాడన్న బాధ కన్నా జోనా ఫోన్లో ఉన్న మెసేజ్ మమ్మల్ని మరింత వేదనకు గురిచేసింది. చనిపోవడానికి ముందు జోనా తన ఫోన్లో నన్ను, పిల్లల్ని ఉద్దేశిస్తూ రాసిన ‘గుడ్ బై నోట్’ నా గుండె పగిలేలా చేసింది. ఇంతకీ ఆ నోట్ లో ఏముందంటే..

క్యాటీ.. నేను నీకు భర్తనైనందుకు, మన పిల్లలకు తండ్రినైనందుకు ఎంతో గర్వపడుతున్నా. నేను నిన్ను, పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడూ కోరుకోని, ఊహించని ఉత్తమ జీవితాన్ని మీరు నాకు అందించారు. నీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడిని డియర్. నేను చూసిన వారందరిలో అత్యంత అందమైన వ్యక్తిత్వం, కేరింగ్ కలిగిన మహిళ నువ్వే క్యాటీ. నిన్ను ప్రేమించే వ్యక్తి జీవితంలో నీకు ఎప్పుడైనా ఎదురై.. మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటే అతడిని నువ్వు తిరస్కరించకు’.. అంటూ జోనా రాసిన నోట్స్ చదువుతున్నంత సేపూ నా కన్నీరు ఆగలేదు. ఆయన మరణంతో నా హృదయం వేయి ముక్కలైంది. ఈ అగాథం లాంటి బాధ నుంచి నేను తిరిగి ఎప్పటిలా సాధారణమైన జీవితం గడపడం అసాధ్యమనిపి స్తోంది. జోనా.. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. నువ్వు మళ్లీ తిరిగి రావాలన్నదే నా ఏకైక కోరిక. డియర్... మా కోసం మళ్ళీ తిరిగొస్తావా?