కరోనా చేస్తోన్న విలయ తాండవానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి అడుగు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది మాత్రం పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా పేషెంట్స్‌కి చికిత్స అందించే క్రమంలో ఆ వైరస్ తమకూ సోకే ప్రమాదముందని తెలిసినా.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన స్నేహా సింగ్ యూకేలోని జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్హెచ్ఎస్)లో ఎమర్జెన్సీ విభాగంలో వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. రోగులను కొవిడ్ 19 బారి నుంచి రక్షించేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాలు తన మాటల్లోనే..
‘కరోనా వైరస్.. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తోన్న అత్యవసర సిబ్బందిలో నేనూ ఒకరిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నా. నా పేరు స్నేహా సింగ్. నేను ప్రస్తుతం యూకేలోని ఎన్హెచ్ఎస్లో ఎమర్జెన్సీ మెడిసిన్ రిజిస్ట్రార్ (ఎమర్జెన్సీ ఫిజీషియన్)గా పని చేస్తున్నాను. విధుల్లో భాగంగా కరోనా బారిన పడిన ఎంతోమందికి నేను చికిత్స అందించాను. వీరిలో ఈ వ్యాధి నయమై ఆనందంగా ఇంటికి వెళ్లిన వారు కొందరైతే.. దానితో పోరాడుతూ ప్రాణాలొదులుతున్న వారు మరికొందరు. ఈ క్రమంలో నాకు ఎదురైన కొన్ని అనుభవాలు మీతో పంచుకోవడానికే ఇలా మీ ముందుకొచ్చా..

అదే నా భయం!
కరోనా వైరస్‌కు సామాన్యుడు, సెలబ్రిటీ, పేద, ధనిక.. ఇలాంటి తేడాలేవీ లేవు. జాగ్రత్తలు పాటించకపోతే అది ఎవరినైనా కాటు వేస్తుంది. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో ఈ వైరస్ వైద్యులకు కూడా సోకే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభణ మొదలైనప్పుడే.. ఎమర్జెన్సీ ఫిజీషియన్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న వారిలో ఎక్కువశాతం మందికి ఈ వైరస్ సోకే అవకాశముందని మాలో చాలామంది అనుకున్నాం. ఎందుకంటే చికిత్సలో భాగంగా మేము ప్రతిరోజూ కరోనా రోగులను కలుస్తుంటాం. ఈ క్రమంలో మేము ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ వైరస్ మాకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మేమంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల విషయంలో ఏమాత్రం అలక్ష్యం చేయట్లేదు. ఈ మహమ్మారితో పోరాడగలిగే శక్తిని మాకు ప్రసాదించమని రోజూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
ఇక నా విషయానికొస్తే నాకు ఈ వైరస్ సోకుతుందనే ఆందోళన లేదు. నేను దాంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అది నా నుంచి నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, దాంతో పోరాడలేని వ్యక్తులకు ఎక్కడ వ్యాపిస్తుందో అని భయంగా ఉంది.

టాయిలెట్‌కు వెళ్లడానికీ వీలుకాదు..
కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులుగా మేము ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొంటాం. ఈ విషయంలో మేము ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది వాళ్లతో పాటు మా ప్రాణాలకూ ప్రమాదమే..! ఈ నేపథ్యంలో ఐసొలేషన్ గదిలో ఉన్న పేషెంట్ల దగ్గరకు వెళ్లేటప్పుడు మేము PPE (Personal Protection Equipment) సూట్ ధరిస్తాం. ఎన్నో పొరలున్న ఈ రక్షణ దుస్తులు తల నుంచి కాలి గోటి వరకు మొత్తం శరీరాన్ని కవర్ చేస్తాయి.
PPEలో భాగంగా మేము ధరించే FFP3 మాస్కులు చాలా కీలకం. వాటిలో ఎలాంటి లీకేజీలున్నా అవి ప్రమాదానికి దారి తీస్తాయి. అందుకే వాటిని పూర్తిగా పరీక్షించాకే మేము ధరిస్తాం. అయితే ఈ దుస్తుల్లో ఎన్నో పొరలుంటాయి. వీటి వల్ల శరీరానికి గాలి సరిగ్గా అందక ఉక్కపోతతో చిరాకు వస్తుంది. కానీ, ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ మేము వీటిని ధరించడం తప్పనిసరి. పేషెంట్స్ నుంచి వైరస్ మాకు వ్యాపించకుండా ఈ PPEనే మమ్మల్ని రక్షిస్తుంది.

మేము ఈ రక్షణ దుస్తులను ఒక్కసారి ధరిస్తే 4-5 గంటల పాటు వాటిని తొలగించం. ఈ వ్యవధిలో నీళ్లు తాగడం, ఆహారం తీసుకోవడమే కాదు.. కనీసం టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా వీలుకాదు. అందుకే, PPE ధరించే ముందు మాలో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు. PPE ధరించిన సమయంలో మేము ఎదుర్కొనే అతి పెద్ద సవాలేదైనా ఉందంటే.. అది పేషెంట్లతో, సహోద్యోగులతో సంభాషించడమే..! ఈ డ్రస్ ధరించినప్పుడు ముఖం పూర్తిగా కవర్ కావడంతో మేము ఏం చెబుతున్నామో అవతలి వ్యక్తికి సరిగ్గా అర్థం కాదు. అంతేకాదు, పేషెంట్లు మమ్మల్ని ఈ వేషంలో చూస్తే ఒకింత భయాందోళనలకు గురైన సందర్భాలూ ఉన్నాయి.
అది చూసి మనసు బాధతో బరువెక్కిపోయేది!
ఇక నా వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై కొవిడ్ 19 ఎంతవరకు ప్రభావం చూపుతోందని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ వైరస్ నన్ను ఎన్నో సార్లు భావోద్వేగాలకు గురి చేసింది. ఒక వైద్యురాలిగా ‘మీ కుటుంబ సభ్యుడు/సభ్యురాలు/సన్నిహితులు చనిపోతున్నారు.. వాళ్లను ఐసొలేషన్‌లో ఉంచిన కారణంగా వారిని చూడడానికి ఆస్పత్రికి రావడానికి మీకు అనుమతి లేదు’ అని ఒకరికి చెప్పడం సులభమే కావచ్చు.. కానీ, నా అంతరాత్మకు మాత్రం అది చాలా కష్టమైన పని.

చికిత్సలో భాగంగా రోగులు తమ చివరి శ్వాస విడిచే వరకు తాము ఒంటరి కాదని మేము వాళ్ల చేయి పట్టుకొని వారిలో మనోస్థైర్యం నింపడానికే ప్రయత్నిస్తాం. అది మా బాధ్యత కూడా! చనిపోయే ముందు చాలామంది పేషెంట్లు చివరిసారిగా చూసే దృశ్యం.. మాస్కులతో ఉన్న మా ముఖాలే..! ఆ సమయంలో వారి ప్రాణాలను కాపాడలేకపోయామని మా మనసు బాధతో బరువెక్కిపోతుంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం మనసారా ఏడవడం కోసమే నేను ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో! ఈ నేపథ్యంలో అందరూ క్షేమంగా ఉండాలని తరచూ భగవంతుడిని ప్రార్థిస్తుంటా.
వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి...
కొవిడ్ 19తో పోరాడే క్రమంలో ప్రపంచమంతా ఏకమై ఐకమత్యంతో కృషి చేస్తోన్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వైద్యులు, నర్సులతో పాటు ఇతర అత్యవసర విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగులు సైతం వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి విస్తృతస్థాయిలో తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ యూకే ప్రభుత్వం మా వార్షిక సెలవులను సైతం రద్దు చేయడం గమనార్హం.
ప్రస్తుతం మనమంతా కలిసికట్టుగా ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కులం, మతం, ప్రాంతం, వర్ణం.. అనే తేడాల్లేకుండా మనుషులంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ సహృదయంతో మెలుగుతుండడం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.

దయచేసి ఇంట్లోనే ఉండండి!
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. కరోనాను కట్టడి చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నారు. కానీ, కరోనా మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పింది. ఇందులో భాగంగా ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాకు మేం ప్రశ్నించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పేద, ధనిక అనే భేదాలు లేకుండా ప్రజలందరికీ ఒకే విధంగా మెరుగైన సేవలు అందుబాటులోకి రావాలని నా అభిప్రాయం. అంతేకాదు, కొవిడ్ 19 వంటి వ్యాధులు భవిష్యత్తులో ఇక రావని చెప్పలేం. ఈ క్రమంలో అవి ‘మహమ్మారి’గా మారడానికి ముందే వాటిని ఎలా అరికట్టగలం అనే విషయంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలి.
ఇక చివరగా మీ అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. కొవిడ్ 19 నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కాపాడేందుకు మేమంతా (వైద్య సిబ్బంది) కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నాం. అందుకే దయచేసి మీరంతా ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని నేను కోరుకుంటున్నా..!’
కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో పాల్గొంటోన్న డాక్టర్ స్నేహకు.. అలాంటి మరెందరో కరోనా యోధులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం మన సామాజిక బాధ్యత. సెల్యూట్ కరోనా వారియర్స్!