కరోనా బాధితులకు నిరంతరాయంగా వైద్య సేవలు చేస్తూ.. ఎంతోమంది వైద్య సిబ్బంది కూడా ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారు. తమ రక్షణ గురించి క్షణమైనా ఆలోచించకుండా కరోనా బారి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి వైద్య సిబ్బంది చేస్తోన్న కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ క్రమంలోనే భారతీయ సంతతికి చెందిన ఓ అమెరికన్ డాక్టర్ కరోనా బాధితులకు సేవలందిస్తూ తానూ ఆ మహమ్మారి బారిన పడి మరణించింది. ఇలా ఆమె మరణించే ముందు తన కుమార్తెతో జరిపిన వాట్సాప్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తల్లీకూతుళ్లు పంచుకున్న మాటలు అందరి చేతా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మరి, కరోనా బాధితులను కాపాడే ప్రయత్నంలో ఈ మహమ్మారి చేతిలో ఓడిపోయిన ఈ గ్రేట్ డాక్టర్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..
అమెరికాలో కరోనా తీవ్రత తార స్థాయికి చేరింది. అక్కడ లక్షల్లో కరోనా కేసులు నమోదవడం, రోజుకు వేల మంది మరణించడంతో ప్రస్తుతం అగ్రరాజ్యం పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అక్కడి వైద్య సిబ్బంది కూడా కరోనా బాధితులను కాపాడడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. అలా కరోనా కాటుకు బలయ్యారు భారతీయ సంతతికి చెందిన న్యూయార్క్ డాక్టర్ మాధ్వీ అయా.

కేవలం సర్జికల్ మాస్క్ ధరించింది..
కరోనా బాధితులకు వైద్యం చేసే క్రమంలో డాక్టర్లకు, నర్సులకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం వారికి తెలిసినా కూడా తమ విధి నిర్వహణకే ప్రాముఖ్యమిచ్చి కరోనా బాధితులకు సేవలందించడంలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు తమ ప్రాణాలను కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం. అయితే కొన్నాళ్ల పాటు ఇండియాలో డాక్టర్‌గా పనిచేసిన మాధ్వీ.. 1993లో అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్‌లోని వుడ్హల్ మెడికల్ సెంటర్లో ఫిజీషియన్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించిన ఈ డాక్టర్.. అమెరికాలో కొవిడ్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో విరామమనేదే లేకుండా అత్యవసర విభాగంలో రోగులకు చికిత్సనందించడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా మాస్క్‌ల కొరత ఏర్పడడం ఆమె పాలిట శాపంగా మారింది. కరోనా బాధితులకు వైద్యమందించే సిబ్బంది ప్రత్యేకమైన మాస్క్‌లను ధరించాల్సి ఉంటుంది. కానీ వాటి కొరత కారణంగా కేవలం సర్జికల్ మాస్క్‌ను ధరించి వైద్యం చేశారు మాధ్వి.

అన్ని వేళలా తను మాతోనే ఉండేది..
ఇలా రోగులకు చికిత్స అందిస్తు్న్న తరుణంలో గత నెల మార్చిలో ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెని కరోనా టెస్ట్‌ల కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు ఆమె భర్త రాజ్. జ్వరం వల్ల ఆమె క్రమక్రమంగా బలహీనపడ్డారు. జ్వరం మరింత తీవ్రమవడంతో మంచానికే పరిమితమయ్యారు మాధ్వి. ఈ క్రమంలోనే తనకు వ్యాధి సోకినట్లుగా నిర్థారణ కావడంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందించడం ప్రారంభించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే తన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టినట్లుగా వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఆమె పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు మాధ్వి. ఈ క్రమంలో ఆమె భర్త రాజ్ మాట్లాడుతూ.. ‘మాకు ఎప్పుడు తన అవసరం ఉన్నా ఆ రోజు సెలవు పెట్టి తను మాతోనే ఉండేది. కానీ తనకు జబ్బు చేసిన ఇలాంటి సమయంలో ఒక్కరం కూడా తన పక్కన ఉండే అవకాశమే లేకుండా పోయింది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారాయన.
అమ్మ వస్తుంది.. నాకా నమ్మకముంది..!
మాధ్వి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో (మాధ్వి చనిపోవడానికి మూడు రోజుల ముందు) తన 18 ఏళ్ల కుమార్తె మినోలీకి, తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది. ‘గుడ్ మార్నింగ్ మామ్. ఇది సరికొత్త రోజు. నేను నువ్వు ఇంటికి క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నాను. నాకు నువ్వు కావాలమ్మా. ఈ ప్రపంచంలో నన్ను బాగా అర్థం చేసుకున్న దానివి నువ్వేనమ్మా! నువ్వు లేకుండా నేను బతకలేను. నేను మాత్రమే కాదు.. మన కుటుంబ సభ్యులెవరూ నువ్వు లేకుండా ఉండలేరు. నాకు నీపై నమ్మకముంది. దయచేసి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా పోరాడు. నువ్వు ఎంతో స్ట్రాంగ్ అని నాకు తెలుసు. నువ్వు ఊహించిన దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తు్న్నాను..’ అంటూ తన మనసులోని ఆవేదనను తల్లికి వాట్సాప్ ద్వారా పంపించింది మినోలీ. దానికి సమాధానంగా మాధ్వి..‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అమ్మ తిరిగి వస్తుంది..’ అంటూ కూతురుకు ధైర్యం చెప్పిందా తల్లి. దాంతో తన తల్లి రాకకోసం కళ్లలో వత్తులేసుకొని కూర్చున్న మినోలీకి చేదు అనుభవమే ఎదురైంది. వస్తానన్న తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లడిల్లి పోతోందా కూతురు.

అమ్మ ఇలా చేయడం కరక్ట్ కాదు..
తన తల్లి మరణం గురించి మినోలీ మాట్లాడుతూ.. ‘అమ్మకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి వస్తుందనుకోలేదు. నేను గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి డాక్టర్ అవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం.. ఇవన్నీ అమ్మ చూడాలనుకున్నా.. తను నాకు అమ్మగా కంటే బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండేది. అమ్మకి టెక్ట్స్ చేశాను. ఇంటికి తప్పకుండా వస్తానని ప్రామిస్ చేసింది. కానీ తను చనిపోయింది. తను ఇంటికి వస్తే తనతో ప్రతిదీ మాట్లాడాలనుకున్నా. తను లేదన్న చేదు నిజం నేను జీర్ణించుకోలేకపోతున్నా.. ప్రస్తుతం డాక్టర్సే మన సైన్యం. కనిపించని శత్రువుతో వాళ్లు పోరాడుతున్నారు. అలాంటి వారికి సరైన రక్షణ కల్పించాలి..’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది మినోలీ.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వృత్తిధర్మమే పరమావధిగా భావించి.. కొవిడ్ బాధితులకు సేవలందిస్తూ.. ఆ వైరస్‌కే బలవుతోన్న ఇలాంటి వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి మనమూ సెల్యూట్ చేద్దాం..!