ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.
నమస్తే! నా పేరు వైశాలి. నిశ్చితార్థం జరిగి పెళ్లికి ఇంకా నెల రోజులు మాత్రమే సమయముందనగా కలిశాడు రాహుల్. అతను పరిచయమమ్యే వరకు నా జీవితంలో నేనేం కోల్పోయానో నాకు తెలియలేదు. ఇన్ని రోజుల్లో నా జీవితంలో నేను కోరుకున్నవన్నీ నాకు దక్కాయని సంబరపడ్డాను. కానీ నాకు లభించినవి మరొకరి ఇష్టప్రకారం వచ్చినవే తప్ప, నా ఇష్ట ప్రకారం దక్కినవి కావని తెలిసి బాధపడ్డాను. అలా తెలుసుకోనివ్వకుండా చేసింది నా తల్లిదండ్రుల ప్రేమ! కాదు... వారు నా తల్లిదండ్రులు కారు.. ఇంకెవరికో తల్లిదండ్రులు కావాల్సింది!

పాతికేళ్ల క్రితం మా ఊరిలోని ఆదర్శ అనాథ శరణాలయంలో జరిగిన ఆ ఘటన నా జీవితాన్నే మార్చేసింది. నేను, నా వయసుండే మరో పాప (పేరు గుర్తులేదు) కలిసి శరణాలయంలోని ఊయలలో ఆడుకుంటున్నాం. ఉన్నట్టుండి మా వార్డెన్ ఆ పాపను ఆర్జెంటుగా రమ్మని పిలిచింది. ఆవిడలో ఎప్పుడూ నేనంత ఆరాటం చూడలేదు. తర్వాత ఆ పాప కూడా రెండు రోజుల వరకు కనిపించలేదు. మూడో రోజు ఉన్నఫలంగా ప్రత్యక్షమైన ఆ పాప ముభావంగా కనిపించింది. ఏమైందని అడిగాను? సమాధానం లేదు! ఇంతలో మా వార్డెన్ నన్ను పిలిచింది. అప్పుడు చూశాను.. నా తల్లిదండ్రులను!
******
చాలాకాలంగా పిల్లలు లేకపోవడంతో నా తల్లిదండ్రులు ఆ పాపను దత్తత తీసుకున్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆమెకు ఓ ప్రమాదకరమైన వ్యాధి ఉందని తేలడంతో ఆ పాపను తిరిగి అనాథ శరణాలయంలో విడిచి చివరికి నన్ను ఎంచుకున్నారు. అలా మలుపు తీసుకున్న నా జీవితం రాహుల్ కలిసే వరకు మరో మలుపు లేకుండా సాగింది. నేనడగకుండానే ప్రతిదీ నా ముందుంచారు నా తల్లిదండ్రులు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే అది ప్రేమని నేను అనుకున్నానే కానీ.. నేను రాజీపడడం వల్లే ఆ ప్రేమ నాకు దక్కిందన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. దాన్నే ‘మొహమాటం’ అని కూడా అంటారని నాకు తెలియదు. బహుశా ఏ బిడ్డ కూడా తన తల్లిదండ్రుల ముందు నాలా మొహమాట పడి ఉండదేమో! కానీ నా పరిస్థితి అందుకు భిన్నం. ఎందుకంటే వారు నన్ను చేరదీసిన తల్లిదండ్రులు కదా!

దిక్కూ మొక్కూ లేకుండా ఉన్న నా మీద వారు దయతలచి కొత్త జీవితాన్ని ఇచ్చారనో.. లేక నాతో ఆడుకున్న పాపను కాదని నన్ను ఎంచుకున్నట్లే మరొకర్ని ఎంచుకుంటారనే భయం వల్లనో.. వారు ఇచ్చిందేదీ నేను కాదనలేదు. కొత్త బట్టలు కొనేటప్పుడు నాకు పసుపు రంగు బట్టలు వేసుకోవాలనుండేది.. కానీ వారు తెలుపు రంగు బట్టలు కొనిచ్చేవారు. పుట్టినరోజు నాడు నాకు కేక్ తినాలనిపించేది.. కానీ వారు పాయసం చేసిచ్చేవారు. పదో తరగతిలో నాకు సైకిల్ కావాలనిపించేది.. కానీ నాన్న నన్ను బండి మీద తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు. ఇలా నా ఇష్టాయిష్టాలు చెప్పకముందే వారి ఇష్టప్రకారమే వారికి నచ్చిందే నాకు లభించేది. అయితే అవి కూడా దక్కని ఆ పాపలాంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో.. అనుకుని రాజీపడేదాన్ని. జీవితాంతం అలా రాజీపడాల్సి వస్తే... ? అన్న ఆలోచనే ఇప్పుడు నన్ను బాధిస్తోంది! ఎందుకంటే మనం ఇష్టపడిన దానికి బదులు.. మరొకటి లభిస్తే ఉండే బాధ జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
******
ఇప్పుడు రాహుల్ విషయంలో అదే జరుగుతోంది. నా తల్లిదండ్రుల ప్రకారమే నేను చదువుకున్నాను. వారి ఇష్ట ప్రకారమే యూఎస్‌లో మంచి ఉద్యోగం సంపాదించాను. మా ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా ‘మీ అమ్మానాన్నల కష్టాన్ని నిలబెట్టావమ్మా!’ అని వాళ్లు నన్ను మెచ్చుకుంటున్నప్పటికీ నాలో ఏదో తెలియని వెలితి ఉండేది.. కానీ అమ్మానాన్న మాత్రం వాళ్లంతా అలా నన్ను మెచ్చుకుంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని పొందేవారు. వారి ఆనందమే నా ఆనందం అనుకున్నాను. అయితే అది వారి పరువు కోసం పాకులాట అని తర్వాత తెలిసింది. విదేశాల్లో ఉన్న నాకు సడన్‌గా విజయ్ అనే కుర్రాడితో పెళ్లి ఫిక్స్ చేశానన్నారు నాన్న. అతడిది కూడా అమెరికానే. న్యూయార్క్‌లో మంచి ఉద్యోగం. ఓసారి కలిశాను. పెద్దగా మైనస్‌లు ఏమీ కనిపించలేదు. అలాగని అతనంటే ఇష్టం అని చెప్పలేను. ఇది కూడా పసుపు రంగు బట్టలకు బదులు తెలుపు రంగు బట్టలు కొనిచ్చినట్లే అనుకొని ఓకే చేసేశాను. అయితే పాతికేళ్ల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనభై ఏళ్ల జీవితంలో రాజీపడ్డానని గ్రహించలేకపోయాను. ఇదే విషయం గ్రహించేలా చేశాడు రాహుల్!

విజయ్‌తో నిశ్చితార్థమైన కొన్ని రోజులకు నాకు రాహుల్ కలిశాడు. అతడిది కూడా అమెరికానే. సెయింట్ లూయీస్‌లో తనే స్వయంగా ఓ కంపెనీ పెట్టాడు. తను సూపర్ మార్కెట్లో కలిసినప్పటి నుంచి మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలనుకునేదాన్నో అచ్చం నా ప్రతిబింబంలా అతడుంటాడు. అయితే అతనికి నేనంటే పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందని నేను తెలుసుకోలేదు. తనే ఓ రోజు నాపై తన మనసులోని ప్రేమను బయటపెట్టాడు. ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారిగా జీవితంలో నేను పడిన రాజీ జ్ఞాపకాలన్నీ నా మదిలో మెదిలాయి. అంతే.. వెంటనే నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే ఆయన నుంచి వచ్చిన సమాధానం నన్ను షాక్‌కి గురి చేసింది!

అసలు ఒకరితో నిశ్చితార్థం అయ్యాక ఈ ఆలోచన ఎలా వచ్చిందని కోప్పడ్డారు. నేను ఎంతగానో వివరించాలని చూశాను. కానీ ఆయన అర్థం చేసుకోలేదు. అప్పుడు కానీ నేను గ్రహించలేదు.. చిన్నప్పుడు పిల్లలు లేని తల్లిదండ్రులుగా సమాజం నుంచి ఎదురయ్యే ఈసడింపులకు గురికావడం ఇష్టం లేకే వారు నన్ను ఎంచుకున్నారని, నేను కాకపోయుంటే వారు మరొకరిని పెంచుకునేవారని! అప్పుడే నిర్ణయించుకున్నాను.. ఇక రాజీపడింది చాలు అని. ఇప్పుడు చెప్పండి! నేను నా తల్లిదండ్రులకు ఇంకా కృతజ్ఞతాభావంతోనే ఉండి నా భవిష్యత్తుని త్యాగం చేయాలా? లేక నేను ఇష్టపడిన రాహుల్‌ను నా జీవితంలోకి ఆహ్వానించి ఇకపైనైనా నాకు నచ్చేలా జీవించాలా? ఏం చేయమంటారు ?
ఇట్లు,
వైశాలి.