హాయ్ మేడమ్.. మా తమ్ముడికి మా మేనమామ కూతుర్నిచ్చి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. ఇద్దరూ ఇష్టపడ్డారని పెళ్లి చేశారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఆరు నెలల క్రితం నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మా తమ్ముడికి పెళ్లికి ముందే వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఎవరికీ ఆ విషయం తెలియదు. మా తమ్ముడు ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి. ఊరు మారితే ఏమైనా మార్పు వస్తుందని వేరే ఊరిలో పెట్టుబడి పెట్టారు. అయినా నష్టం వచ్చింది. చివరికి ఒక ఊరిలో కిరాణా వ్యాపారం పెట్టించారు. సెట్ అయిందని అనుకునే సమయానికి ఆ అమ్మాయితో ఉన్న సంబంధం బయటకు వచ్చింది. మా నాన్న, మరదలికి ఈ విషయం మూడు సంవత్సరాల క్రితమే తెలుసు. అమ్మకు తెలిసి సంవత్సరమైంది. అది కూడా ఊళ్లో వాళ్లు ఎవరో చెబితే తెలిసింది. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోయాను. మా తమ్ముడిని గట్టిగానే అడిగాను. మా ఆయనతో కూడా అడిగించాను. అయినా కూడా మొండిగా సమాధానం ఇస్తున్నాడు.
తనే కావాలంటున్నాడు!
‘పెళ్లికి ముందు నుంచి ఉన్న సంబంధం.. వదులుకోలేనని’ అంటున్నాడు. ‘ఆ అమ్మాయి భర్త నుంచి విడాకులు తీసుకుంది.. ఒక అమ్మాయి కూడా ఉంది. నా అవసరం తనకి ఉంది’ అని అంటున్నాడు. అందరూ ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. ఈ విషయం గురించి ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది. పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా అమ్మానాన్న ఇన్నేళ్లు నరకయాతన అనుభవించారు. నాన్నకి ఊర్లో మంచి పేరు ఉంది. అందుకే ఎవరూ ఏమీ అడిగే వారు కాదు. అదే అదనుగా మా తమ్ముడు రెచ్చిపోయాడు. మా మరదలికి మారిపోయానని మాయ మాటలు చెప్తే ముందు నమ్మేసింది. నాకు కోపం వచ్చి కేసు కూడా పెట్టించాను. అయితే ఆ అమ్మాయి ఇక ముందు మా తమ్ముడితో సంబంధం పెట్టుకోనని పోలీసు స్టేషన్లో సంతకం చేసింది. కానీ మా తమ్ముడు ఏం చెప్పినా వినడం లేదు. నాకు ఆ అమ్మాయి కావాలి అంటున్నాడు. మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఎలా మార్చాలి?
మా తమ్ముడి నడవడిక సరిగ్గా లేకపోవడంతో వాడి పిల్లల్ని కూడా మా పేరెంట్స్ ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటున్నారు. వ్యాపారం కూడా వాళ్లే చూసుకుంటున్నారు. మా తమ్ముడికి ఏమీ ఇవ్వకూడదని ఆస్తులు కూడా మా నాన్న మనవళ్ల పేరు మీద రాశారు. ఇల్లు, పిల్లలు, వ్యాపారం.. ఇవన్నీ చూసుకోవడానికి నా మరదలు కూడా అమ్మానాన్నలతో పాటు కష్టపడుతోంది. కానీ ఎన్ని రోజులు ఇలా అనేది అర్థం కావడం లేదు. మా తమ్ముడు ఏదో చిన్న పనులు చేసుకుంటున్నాడు. ఇంటికి వస్తాడు, తింటాడు, నిద్రపోతాడు అంతే. ఏ బాధ్యత లేకుండా ఉంటాడు. మా తమ్ముడిలో ఎలా మార్పు తీసుకురావాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీరు రాసిన ఉత్తరంలో అతని వ్యవహార శైలిలో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ వ్యాపారం పెట్టించినా రాణించలేకపోవడం.. మరొకరితో సంబంధం పెట్టుకొని కూడా పెళ్లి చేసుకోవడం.. భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా చాలాకాలం పాటు వ్యవహారం సాగించడం.. ఆ విషయం తెలిసిన తర్వాత భార్య గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించకుండా తనకు కావాల్సిన దాని గురించే మాట్లాడడం.. వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాధ్యతారాహిత్యాన్ని దూరం చేయండి..
అతనిలో ఇలాంటి లక్షణాలున్నా.. మీ మరదలు అత్తమామలపై ఉన్న గౌరవంతో కానీ, భర్తపై ఏర్పడిన అనుబంధం వల్ల కానీ, పిల్లల కోసం కానీ.. ఆమె జీవితాన్ని అతనితోనే కొనసాగిస్తోంది. అలాగే మీ వైపు నుంచి ఒక సోదరిగా బాధ్యత తీసుకొని మరొక స్త్రీతో ఉన్న సంబంధాన్ని కొనసాగనీయకుండా చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. కానీ అతను తన వివాహేతర సంబంధాన్ని ఆపకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. మీరు ముందుగా అతనిలో ఉన్నటువంటి ఈ బాధ్యతారాహిత్యాన్ని దూరం చేయడానికి ఎలాంటి మార్పు తీసుకురావాలి అనే విషయంపై దృష్టి పెట్టాలి.
మీ తమ్ముడు పూర్తిగా పని చేయనప్పుడు ఆ వ్యాపారాన్ని నాన్న గారే చూసుకోవడం.. మనవళ్లు, కోడలి బాధ్యతను కూడా తనే తీసుకోవడంతో అతనిలో ఉన్న బాధ్యతారాహిత్యం మరింత దృఢపడుతున్నట్లు కనిపిస్తోంది. మీ మరదలికి అతని నుంచి విడిపోయే ఆలోచన లేకపోతే వాళ్లిద్దరి మధ్య బంధం బలపడడానికి కుటుంబం పట్ల బాధ్యత వహించడానికి ఏమైనా చేయగలరేమో ఆలోచించండి. ఉదాహరణకు తన భార్య, పిల్లలు, కుటుంబ బాధ్యతలను తన పైనే పెట్టడం, అలాగే ఒక కొడుగ్గా, భర్తగా, తండ్రిగా తను తప్పనిసరిగా చేసి తీరాల్సిన పనుల గురించి అతనికి స్పష్టం చేయడం వంటి విషయాలను పరిశీలించండి.

తననే చేయనివ్వండి..
ఉదాహరణకు పిల్లల చదువులు చూసుకోవడం, వారి ఫీజులు కట్టడం, కుటుంబాన్ని నడపడం, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం వంటివి అతనికి తెలియజేసే ప్రయత్నం చేయండి. తన కోసం మరొకరు తనకు కావాల్సినవి చేస్తుండడంతో.. తనకు దక్కిన వాటి గురించి సంతృప్తి పడకుండా.. ‘నాకు ఇష్టమైంది దక్కనివ్వడం లేదు’ అనే శైలిలో అతను వ్యవహరిస్తున్నాడు. కాబట్టి, తన బాధ్యతలను తనే నిర్వర్తించే విధంగా తగిన పరిస్థితులను సృష్టించే ప్రయత్నం చేయండి.
అతను ఎవరితో వ్యవహారం నడుపుతున్నాడో ఆమెని నియంత్రించే ప్రయత్నం మీరు చేశారు. అలాగే మీ తమ్ముడిని కూడా దార్లో పెట్టడానికి ఏం చేయాలో మీ తల్లితండ్రులు, ఇతర పెద్దలు, ఆత్మీయులతో కలిసి ఆలోచించండి. అలాగే ఇన్నేళ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అతను ఏ రంగంలో రాణించగలడో మీ కుటుంబ సభ్యులంతా కలిసి లోతుగా ఆలోచించండి. అందుకు తగిన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్